కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ‘రోడ్ షో’లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి మాటలు వింటే ఆయన ఆలోచనా ధోరణి సజావుగా లేదనిపిస్తుంది ఎవరికైనా. గురువారం తన ప్రసంగంలోని ‘విసుర్ల’తో జనంలో ఆయన కొత్త ‘అలజడి’ సృష్టించారు. ‘అన్నేళ్లు ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడేనా? ఈ నాయుడు గారు!’ అనే రీతిలో ఆయన రెచ్చిపోయారు.
భారత రాజ్యాంగంపై ఈ మాజీ హైటెక్ సీఎంకు ఏమాత్రం గౌరవం లేదని ఆయన మాటలు మరోసారి నిరూపించాయి. ‘ఈ అసెంబ్లీ గౌరవ సభ కాదు. కౌరవ సభ. మళ్లీ మీ మద్దతుతో ముఖ్యమంత్రి హోదాలో మాత్రమే అసెంబ్లీలో అడుగుపెడతా,’ అన్న చంద్రబాబు మాటలు చట్టసభల గౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయి. రాజ్యాంగబద్ధంగా, చట్టప్రకారం దాదాపు మూడున్నరేళ్ల క్రితం ఎన్నికల ద్వారా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ 15వ శాసనసభను ‘కౌరవ సభ’ అని మూడుసార్లు సీఎంగా పనిచేసిన నారా వారు అభివర్ణించారంటే ఏమనుకోవాలి? 72 ఏళ్ల ‘రాజకీయ అనుభవశాలి’ ఇప్పటి యువతరానికి ఇచ్చే సందేశం–చట్టసభలను కించపరుస్తూ మాట్లాడమనేనా? మెజారిటీ సభ్యులు ఉన్న రాజకీయపక్షమే పాలకపక్షం అవుతుందని భారత రాజ్యాంగం చెబుతోంది. మరి, అత్యధిక మెజారిటీ ఉన్నంత మాత్రాన ప్రస్తుత ఏపీ అసెంబ్లీ ‘కౌరవ సభ’ ఎలా అవుతుంది? ఇలాంటి ప్రశ్నలకు తెలుగుదేశం నేత నుంచి జవాబులు ఆశించడం అత్యాశే.
ముద్దులు పెడితే ఓట్లేస్తారా? భయ్యా?
పైన చెప్పిన ఎమ్మిగనూరు రోడ్ షోలోనే చంద్రబాబు రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన శాసనసభను కించపరుస్తూ మాట్లాడి ఊరుకోలేదు. ఆ సభకు సభ్యులను అఖిలాంధ్ర ప్రజలు ఎలా ఎన్నుకున్నారో ఆయన చాలా చౌకబారు ధోరణిలో, అసభ్యంగా వ్యాఖ్యానించారు. ఓటర్లను అవమానించే విధంగా నోరు పారేసుకున్నారు అసెంబ్లీపై అలిగిన ఈ ప్రతిపక్ష నేత.
‘‘2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఊళ్లన్నీ తిరుగుతూ ప్రస్తుత ముఖ్యమంత్రి గారు మీకు ముద్దులు పెట్టేశారు. మీరేమో ఆయనకు ఓట్లేసి గెలిపించారు,’ అని చంద్రబాబు అన్న మాటలు ఆయన మానసిక స్థితిపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఓ రాజకీయ పార్టీ నాయకుడు జనం మధ్యలోకి వచ్చి తనను అభిమానించే ప్రజలను తన పాదయాత్రలో ముద్దులు పెట్టుకున్నంత మాత్రాన వారు ఓట్లేస్తారా? అంటే– వేస్తారని టీడీపీ అధినేత ‘ఎత్తిపొడుపు మాటలు’ సూచిస్తున్నాయి. వాస్తవం ఏమిటో తెలుగు ప్రజానీకానికి, చంద్రబాబుకు తెలుసు.
ఐదేళ్ల తెలుగుదేశం పాలనతో విసిగిపోయిన ఏపీ జనం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానాలపై నమ్మకంతో ఓట్లేసి, భారీ మెజారిటీ అందించారు. ఈ రాజకీయ సత్యాన్ని మనసులో దాచుకున్న టీడీపీ నేత– ప్రజలను ఎగతాళి చేసేలా ఎమ్మిగనూరులో ప్రసంగించడం ఏమాత్రం సబబు కాదు.