– ఏపీ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు సోము వీర్రాజు డిమాండ్
ఏపీ లో వినాయకచవితి వేడుకలు బహిరంగ వేదికల పై నిర్వహించడానికి వీలు లేదంటూ రాష్ట్రప్రభుత్వం ప్రకటించడాన్ని భారతీయ జనతాపార్టీ తీవ్రంగా తప్పు పట్టింది. భారతీయ సంస్కృతిలో ముఖ్య భాగమైన విఘ్నాధిపతి వినాయక చవితి నవరాత్రులు స్వాతంత్ర్యం రాక ముందు నుండి బహిరంగ వేదికల పై నిర్వహించడం హిందూ సంస్కృతి, సంప్రదాయాల్లో భాగంగా వస్తోంది
చలువపందిళ్లు వేసి సామూహికంగా వినాయక నవరాత్రులు జరపడం భారతీయుల ఆచారం, సాంప్రదాయంగా హిందువులు వందల సంవత్సరాలుగా నిర్వహించుకొంటున్న నేపథ్యంలో, కరోనా పేరుతో వినాయక చవితిని వ్యక్తిగతంగా ఇళ్ల వద్దే చేసుకోవాలంటూ, బహిరంగ ప్రదేశాల్లో జరపకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షా సమావేశంలో నిర్ణయించడం ద్వారా , మెజార్టీ ప్రజల మనోభావాలను దెబ్బతీయడమే అవుతుందని రాష్ట్ర బిజెపి ఆగ్రహం వ్యక్తం చేసింది.
కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా వినాయక చవితి కార్యక్రమాలు నిర్వహించుకోవాలని, తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటిస్తే బాగుండేదని, అలా కాకుండా ఏకపక్ష నిర్ణయంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వెనుక ‘కుట్ర కోణం’ దాగివున్నట్లు రాష్ట్ర బిజెపి అభిప్రాయపడింది
కరోనా సమయంలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని అధికార పార్టీ నేతలు గొంతెత్తి అరిచారని,ఇప్పుడు నిబంధనలు పాటిస్తూ,అన్ని వ్యాపార,వాణిజ్య, విద్యాసంస్థలు,సినిమాహాళ్ళు పనిచేస్తున్న సంగతిని రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ! ప్రస్తుతం అందరికీ వ్యాక్సిన్ అందిస్తున్న తరుణంలో,రాష్ట్ర ప్రభుత్వమే కరోనా అదుపులో ఉందని చెబుతూ.. కేవలం వినాయక చవితి వేడుకులకు మాత్రం, కరోనా అఢ్డంకిగా కనపడుతోందా అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ప్రభుత్వాన్ని నిలదీశారు
నిన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాలను వేడుకగా రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో జరిపిన వైసీపీ ప్రభుత్వం, వినాయక చవితి పండుగ నిర్వహించుకోవడానికి నిబంధనల పేరుతో అడ్డుకోవడం దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు
ఇటువంటి నిర్ణయాలు తీసుకునే సమయంలో, అధికారులతోపాటు రాజకీయపక్షాలతో సమావేశం ఏర్పాటు చేసి కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా వినాయక చవితి వేడుకలకు అనుమతిస్తే బాగుండేదని, ప్రభుత్వం పట్ల గౌరవం పెరిగేదని, అలా క సామూహికంగా నిర్వహించడానికి వ్యతిరేకమన్నట్లుగా ప్రభుత్వం మొండి వైఖరి అవలంభించడం సేహుతుకం కాదని బిజెపి విమర్శించింది..
హిందువుల పండుగలు,దేవాలయాల పరిరక్షణ, అభివృద్ధి విషయాల్లోనే రాష్ట్ర ప్రభుత్వం అనుసరించే విధానం, పలు అనుమానాలకు బలంచేకూరే విధంగా ఉందని,ప్రజలు భావిస్తున్నారని, ప్రభుత్వ వైఖరి కూడా, అనుమానాలకు తగ్గట్టుగా ఉందని బిజెపి తప్పు పట్టింది.
కరోనా విషయంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా వినాయక చవితి వేడుకలు, చలువ పందిళ్ళు వేసుకుని నిర్వహించుకునే విధంగా అనుమతులు మంజూరు చేయాలని రాష్ట్ర బిజెపి డిమాండ్ చేస్తున్నట్లు, పార్టీ అధ్యక్షులు సోము వీర్రాజు ఒక ప్రకటనలో తెలిపారు