– కృష్ణాజిల్లా జిల్లా కలెక్టర్ జె. నివాస్ విజ్ఞప్తి
కోవిడ్ థర్డ్ వేవ్ రానున్నదని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రజలు వినాయక చవితి వేడుకలను నిరాడంబరంగా నిర్వహించుకోవాలని కృష్ణాజిల్లా జిల్లా కలెక్టర్ జె. నివాస్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు డివిజన్, మండల, గ్రామ స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని రెవెన్యూ, సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ విషయంపై విజయవాడ, నూజివీడు, మచిలీపట్నం, గుడివాడ డివిజన్లోని సబ్ కలెక్టర్లకు, ఆర్డీవోలకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈనెల 10వ తేదీన వినాయక చవితిని పురస్కరించుకుని ఇంటిలో మాత్రమే పూజలకు పరిమితమై ఎలాంటి బహిరంగ వేడుకలు నిర్వహించరాదని ఆయన భక్తులను కోరారు. వేడుకల్లో భాగంగా బహిరంగ ప్రదేశాలు, కూడళ్లలో విగ్రహాలను స్థాపించరాదని, నిమజ్జన కార్యక్రమాలు చేయరాదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఈ మేరకు వినాయక చవితి నిర్వహణ కమిటీలకు ఆయన విజ్ఞప్తి చేస్తూ ఈ విషయంలో జిల్లా యంత్రాంగానికి సహకరించాలన్నారు.
ఈ మేరకు డివిజన్, మండల, మున్సిపాలిటి స్థాయిలో వినాయక చవితి నిర్వహణ కమిటీ ప్రతినిధులను, స్థానిక ప్రముఖులను ఆహ్వానించి సమావేశం నిర్వహించాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు గత ఏడాది వినాయక చవితి వేడుకలు జరుపుకున్న రీతిలోనే ఈసారి కూడా నిర్వహించాలని సమావేశంలో కోరాలన్నారు. ఈ విషయంలో వినాయక చవితి నిర్వహణ కమిటీ ప్రతినిధులను కూడా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి సహకరించమని విజ్ఞప్తి చేయాలన్నారు.
ప్రజలు గుమికూడకుండా వుండడమే కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఉత్తమ మార్గమన్నారు…