– ఎంపి కేశినేని శివనాథ్
విజయవాడ :గణనాథుడికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించడం ద్వారా సుఖసంతోషాలు, ప్రశాంతత, పాడిపంటలతో రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళ్తుంది. ఆ విఘ్నేశ్వరుడు ఎలాంటి విఘ్నాలు లేకుండా రాష్ట్రాభివృద్దికి ఆశీస్సులు అందించాలని ఎంపి కేశినేని శివనాథ్ కోరారు.
వినాయక చవితి సందర్భంగా పశ్చిమ నియోజక వర్గం సితార సెంటర్ లేబర్ కాలనీ గ్రౌండ్ లో డూండీ గణేష్ సేవా సమితి ఏర్పాటు చేసిన 72 అడుగుల శ్రీ విజయ మహాగణపతి విగ్రహాన్ని ఎంపి కేశినేని శివనాథ్ దర్శించుకున్నారు. డూండీ గణేష్ సేవ సమితి నిర్వాహకులు ఎంపి కేశినేని శివనాథ్ కి స్వాగతం పలికారు. పురోహితుల వేద మంత్రోచ్చారణ మధ్య ఉత్సవ వినాయక విగ్రహానికి కొబ్బరి కాయ కొట్టి తొలి పూజ నిర్వహించారు. వినాయకుడి కరుణకటాక్షాలతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో వుండాలని ప్రార్థించారు.
ఈ సందర్బంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఈ ఏడాది అకాల వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అయితే దేవుడి దయ వల్ల, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎక్కువ ప్రాణ నష్టం లేకుండా బయటపడ్డామన్నారు. భక్తుల సౌకర్యార్ధం ఇక్కడ కావాల్సిన సహకారం తప్పక అందిస్తామని డూండీ గణేష్ సేవా సమితి నిర్వాహకులు చెప్పారు.
ఖైరతాబాద్ వినాయక విగ్రహం కంటే భారీ వినాయక విగ్రహాం ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఎంపి కేశినేని శివనాథ్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో డూండీ గణేష్ సేవా సమితి నిర్వాహకులు డూండీ రాకేష్, గడ్డం రవి, దర్శిసుబ్బారావు భక్తులు పాల్గొన్నారు.