-పోలీసు పాలనతో తెలంగాణ ఆగం
-హరీష్ రావుతో సహా బీఆర్ఎస్ నేతల అరెస్ట్ అక్రమం
-రేవంత్ సర్కారు తీరును ఖండించిన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
హైదరాబాద్: ఇందిరమ్మ రాజ్యం అంటేనే అంతులేని హింస అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి కనుసన్నల్లో సాగుతున్న పోలీసు పాలనతో తెలంగాణ రాష్ట్రం ఆగమవుతోందని ఆయన గురువారం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి హరీష్ రావుతో సహా పలువురు బీఆర్ఎస్ నేతల అరెస్ట్ అక్రమమని ఆయన తీవ్రంగా ఖండించారు.
తన ఫోన్ ట్యాపింగ్ అవుతోందని ప్రజాస్వామ్య పద్ధతిలో పోలీసు స్టేషన్ కు వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై తప్పుడు కేసు నమోదు చేయడం ఎక్కడి న్యాయమని జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిఐని ప్రశ్నించినందుకు పాడి కౌశిక్ రెడ్డిపై కేసులు పెట్టడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు.
ఈ నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళిన మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, బీఆర్ఎస్ ఇతర నేతలను అరెస్టు చేయడం కాంగ్రెస్ సర్కారు నిరంకుశత్వానికి నిదర్శనమని ఆయన నిప్పులు చెరిగారు. ఫిర్యాదు తీసుకునే ధైర్యం లేని ప్రభుత్వాన్ని తప్పు బడుతున్న ప్రజలు హింసాత్మక ఇందిరమ్మ రాజ్యంపై తిరగబడే రోజు ఎంతోకాలం లేదని ఆయన హెచ్చరించారు. పాడి కౌశిక్ రెడ్డిపై నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని, అరెస్టు చేసిన బీఆర్ఎస్ నాయకులను వెంటనే విడుదల చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.