– సుప్రీం తీర్పు
న్యూఢిల్లీ : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ తెలంగాణకు బదిలీ అయింది. ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. కేసును హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. ఈ విచారణపై మరణించిన వ్యక్తి కుమార్తె, భార్య అసంతృప్తిగా ఉన్నందున ప్రాథమిక హక్కులను పరిగణనలోకి తీసుకుని కేసును కడప న్యాయస్థానం నుంచి హైదరాబాద్ బదిలీ చేస్తున్నట్లు జస్టిస్ ఎం.ఆర్.షా పేర్కొన్నారు.
ఈ కేసులో సాక్షులను, నిందితులు బెదిరిస్తున్నారని, కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ వివేకా కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం నేడు తీర్పు వెల్లడించింది. తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
‘‘మరణించిన వ్యక్తి కుమార్తె, భార్య సుప్రీంకోర్టు వరకూ రావడమంటే ఈ కేసులో ఎన్ని కుట్ర కోణాలు దాగి ఉన్నాయో అర్థమవుతోంది. విచారణపై వాళ్లిద్దరూ అసంతృప్తిగా ఉన్నందున ప్రాథమిక హక్కులను పరిగణనలోకి తీసుకుని కేసును బదిలీ చేస్తున్నాం. న్యాయం జరుగుతుంది కాదు.. జరిగినట్లు కనిపించాలి. హత్య కేసులో సాక్ష్యాధారాలను ధ్వంసం చేసిన ఆధారాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరం.
ఈ కేసులో దురాలోచనతో కూడిన కుట్ర కోణం దాగి ఉంది. అదే సమయంలో కేసును తారుమారు చేయడంతో పాటు అన్ని రకాల సాక్ష్యాలను ధ్వంసం చేశారు. ఈ పరిణామాలన్నింటిలో ఉన్న కుట్ర కోణం బయటకు రావాలంటే తదుపరి విచారణ కొనసాగాలి. కడపలో స్థానికంగా ఉన్న పరిస్థితుల్లో విచారణ జరగడం కంటే బయట రాష్ట్రంలో కొనసాగడమే సముచితంగా భావిస్తున్నాం. అందుకే కేసును హైదరాబాద్‌కు బదిలీ చేస్తున్నాం’’ అని సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొంది.