– ఇప్పటికే 500 ఎకరాల సేకరణ
– ఎకరాకు రూ. 20 లక్షల వరకు నష్టపరిహారం
– భూసేకరణ బాధితులకు ఉపాధి కల్పిస్తాం
– శాసనమండలిలో మంత్రి అనగాని సత్యప్రసాద్
అమరావతి: ఇండోసోల్ కంపెనీ ఏర్పాటుచేయబోయే పారిశ్రామిక హబ్ కోసం నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడులో భూములు ఇచ్చేందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ర్టేషన్, స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. శాసనమండలిలో గురువారం కరేడు భూముల సేకరణపై వైసీపీ ఎమ్మెల్సీ మాధవరావు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.
ఇప్పటికే 500 ఎకరాలు ఇచ్చేందుకు రైతులు లిఖిత పూర్వకంగా అనుమతి నిచ్చారని, 300 ఎకరాలకు నష్టపరిహారం కూడా చెల్లించామని చెప్పారు. రామయపట్నం పోర్టుకు అనుసంధానంగా కరేడులో ఏర్పాటు చేయబోయే పారిశ్రామిక హబ్ కోసం 8,200 ఎకరాలు సేకరించాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ప్రారంభంలో రైతులు కొంతమేరకు భూసేకరణపై అనుమనాలు వ్యక్తం చేసినప్పటికీ, కలెక్టర్, భూసేకరణ అధికారులు వెళ్లి రైతులతో చర్చించి వారి అనుమానాలు తీర్చారని చెప్పారు.
ఆ గ్రామంలో ఎకరం ఐదు లక్షల రూపాయలు ఉండగా భూసేకరణ చట్టం ప్రకారం రెండున్నర రెట్లు అదనంగా 12.5 లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. అయితే తమవి సారవంతమైన భూములని, రెండు పంటలు పండుతాయని, నష్టపరిహారం పెంచాలని రైతులు కోరడంతో ఎకరాకు 20 లక్షల రూపాయాల వరకు నిర్ణయించామని చెప్పారు. దీంతో రైతులు సమ్మతించి భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు.
భూ సేకరణ కారణంగా ఉపాధి కోల్పోయే కుటుంబాలకు ఉపాధి కల్పించడం ప్రభుత్వానిదే బాధ్యతని చెప్పారు. పారిశ్రామిక హబ్ ఏర్పాటు ద్వారా వచ్చే ఉద్యోగ అవకాశాల్లో స్థానికులకే మొదటి అవకాశాలు ఇస్తామని చెప్పారు. పరిశ్రమలు స్థాపిస్తేనే ఉద్యోగాలు వస్తాయని, అప్పుడే సంపద పెరుగుతుందని చెప్పారు. నిజమైన పారిశ్రామికాభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు.
కియా పరిశ్రమ రాబట్టే ఉమ్మడి అనంతపురం జిల్లా అభివృద్ధిలో పరుగులు తీసిందన్నారు. వాన్ పిక్ ప్రాజెక్ట్ వచ్చి ఉంటే తమ బాపట్ల జిల్లా రూపురేఖలే మారిపోయి ఉండేవన్నారు. కానీ, రేపటి రోజున కరేడు ప్రాంతం కచ్చితంగా ప్రగతి పథంలో దూసుకెళ్ల్తుందన్నారు.