-అభ్యర్థులు ప్రచార అనుమతులు తీసుకోవాలి
-రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో
-గుంటూరు నగర కమిషనర్ చేకూరి కీర్తి
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సార్వత్రిక ఎన్నికల్లో వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా నియమించడానికి వీలులేదని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి (ఆర్‌ఓ) కీర్తి చేకూరి స్పష్టం చేశారు. మంగళవారం కమిషనర్ చాంబర్‌లో కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, పశ్శిమ నియోజకవర్గ ఆర్‌ఓ, అదనపు కమిషనర్ కె.రాజ్యలక్ష్మితో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ ప్రచార ర్యాలీలు, ఇంటింటి ప్రచారాలు చేపట్టడానికి రిటర్నింగ్ అధికారి నుంచి తగిన అనుమతులు పొందాలని, అందుకు తగిన విధంగా జీఎంసీ ప్రధాన కార్యాలయంలో తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకు వేర్వేరుగా సింగిల్ విండో కౌంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. సింగిల్ విండో ద్వారా త్వరగా అనుమతులు వచ్చేలా అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటామన్నారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు, లౌడ్ స్పీకర్ల వినియోగం, బోర్డులు, బ్యానర్లు, తాత్కాలిక పార్టీ కార్యాలయాల ప్రారంభం తదితర అంశాలకు సంబంధించి రిటర్నింగ్ అధికారి నుంచి అనుమతి పొందాలని సూచించారు.
నగరంలోని ప్రైవేట్ హోర్డింగ్స్, బోర్డులను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా సమాన ప్రాతిపదికగా కేటాయించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సిటి ప్లానర్‌ను ఆదేశించారు. అనంతరం జిల్లా ఎన్నికల అధికారి అనుమతి మేరకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిన రాజకీయ పార్టీలకు కేటాయింపులు చేస్తామని తెలిపారు. నగరంలోని పెద్ద హోర్డింగ్స్ స్ట్రక్చరల్ స్టేబులిటి సర్టిఫికెట్ తీసుకోవాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, మేనేజర్ ప్రసాద్, సూపరింటెండెంట్ పద్మ, డి.జానిబాబు (వైసీపీ), ఓంకార్ (టీడీపీ), సిహెచ్.వాసు (బీఎస్పీ), పాండురంగ విఠల్ (బీజేపీ), సేవకుమార్ (అమ్ ఆద్మీ), జాని బాషా (కాంగ్రెస్) పాల్గొన్నారు.