Suryaa.co.in

Features

ఓటు తాకట్టు.. పరువు వాకట్టు..

దేవుడు సృష్టించిన వేదాలు..
వాటి చుట్టూ
ఎన్నో వాదాలు..
నచ్చిన రీతిలో అన్వయాలు
తోచినట్టు అనువాదాలు
కృష్ణుడు చెప్పిన గీత
ఆ శ్లోకాలు అనుసరిస్తే ఇప్పుడు శోకాలేనట..
ఎవడికి నచ్చినట్టు
వాడే గీసుకుంటున్నాడు గీత
మార్చేసుకుంటున్నాడు తలరాత..
ప్రతివోడు అధర్మ సంస్థాపనార్థాయ
సంభవామి ఏరోజుకారోజు..
ఎవడికి వాడే
అవినీతి మారాజు..
మహాభారతం
పంచమ వేదమట..
మానవ జీవన నిర్వేదమంట..
అయితే అందులోని
మంచిని విడిచిపెట్టి
చెడును..చేదును
అనుసరిస్తూ,ఆస్వాదిస్తూ
ముందుకు సాగుతున్న మనుషులు..
అభినవ శకునులు..
దొంగ మునులు..
ఆధునిక దమనకులు..
మన రాజకీయ నాయకులు..!

ఆపద్ధర్మం కోసం
అసత్యమాడితే ధర్మరాజు
అదే సాకుగా స్వధర్మం కోసం
పూటకో అబద్ధం..
రోజుకో అసత్యమాడుతూ
పబ్బం గడుపుకుంటున్న
మనుజులు..
కలియుగపు దనుజులు..
యుధిష్టరుని
ధర్మనిరతిని గాక
అతడు జూదమాడలేదా..
కృష్ణుడు లెక్కకు మించిన
మగువలతో కూడలేదా..
ద్రౌపది ఐదుగురు
మగలతో కాపురం చేయలేదా..
రాజ్యం కోసం అన్నదమ్ములు
కొట్టుకు చావలేదా..
అనుచు మంచిని విడిచి చెడును మాత్రమే స్వీకరించి
స్వీయధర్మాన్ని రచించుకుని
అమలు చేస్తున్నాం మనం..
అందుకే ఈ లోకం
కుహానా సిద్ధాంతాల వనం.. ఒకనాడు నాయకుడంటే రాముడే..
ఇప్పుడురావణుడు..
దుర్యోధనుడు..కీచకుడు..;
జైలుపక్షి..అక్కుపక్షి..
నిరక్షరకుక్షి..స్మగ్లరు.. లంచగొండి..ఫ్యాక్షనిస్టు..
ఇలా ప్రతి నాయకుడు
ప్రతినాయకుడే..
ఆ పోకడే..ఆ దూకుడే
మనిషిని చెడు వైపు
నడిపిస్తోంది..
ఎన్నికలలో తప్పుటడుగులు
వేయిస్తోంది..!

విలన్లనే హీరోలనుకుంటున్నాం..
ఓటు వేసి ఆనక నాలిక కరుచుకుంటున్నాం..
ఓటు బలమైన ముద్ర
తప్పుగా వేస్తే ప్రజాస్వామ్యానికే
శాశ్వత నిద్ర..
పైసామే పరమాత్మ
ఓటు నీ జీవాత్మ
దానిని కొనాలని
చూసేవాడు ప్రేతాత్మ..
చూస్తున్నావా ఈ దేశం
ఎటు పోతోందో
ఓ మహాత్మా..!?

ఆపేద్దాం ఈ ఓటు
అమ్మకాలను..కొనుగోళ్లను
ఎన్నికలంటే వ్యాపారం కాదు
బలమైన జాతి నిర్మాణం
తప్పు చేస్తే
ప్రజాస్వామ్య నిర్యాణం..!
అయినా నీ ఓటు..నీ హక్కు..
నీ ఇచ్చ..నీ స్వేచ్చ..
నీ గుత్తం..నీ చిత్తం..
దానిని నువ్వే
ఎందుకు చెయ్యాలి
ఇంకొకరికి ధారాదత్తం…
జీవితమంతా ఇంకొకడి జెండా మోయడమేనా
నీ అజెండా
ఏమైంది నీ సొంత తెలివి..
నీ వివేచన.. ఆలోచన..
ఓటు అమ్ముకోవడం
పరువును అమ్ముకోవడమే
గౌరవాన్ని తాకట్టు
పెట్టడమే..
అది ప్రజాస్వామ్య హననం..
రాజ్యాంగ ఖననం..
నీ విలువల వంచన
నీ తల పరాయి పంచన..
ఒకడు విసిరే
డబ్బుకు దాసోహం
క్షమించరాని దేశద్రోహం..!

వద్దు ఈ బానిసత్వం
ఏమైంది నీ వ్యక్తిత్వం
నేర్చుకున్న అక్షరాలు
చదివిన చదువులు
వంటబట్టించుకున్న
విలువలు
ఎందుకలా నీకు నువ్వే
ఊడదీసుకుంటున్నావు
నీ ఒంటిపైన వలువలు..
నోటుకు ఓటు
కానే కాదు
నీ రూటు..

ఎవడైనా కొనాలని
వస్తే ఛీకొట్టు
బెదిరిస్తే తొడకొట్టు
ఇంకా మాటాడితే ఢీకొట్టు..
అంతే గాని పెట్టొద్దు
నీ గౌరవాన్ని…నీ దేశ గౌరవాన్ని
ఓ నీచుడికి తాకట్టు
ఇదంతా ఎన్నికల కనికట్టు..
ఒక్కటి గుర్తు పెట్టుకో..
వచ్చినవాడు తెల్లోడి కంటే
మాయగాడు..
లొంగావా మరోసారి
బానిసత్వమే..
ఈసారి విముక్తి..
శాపవిముక్తి..
దాస్యవిముక్తి ఉండవు..
తప్పు చేసేసాకా
ఉప్పు సత్యాగ్రహాలు కాపాడవు
తప్పుడు మనుషులకు
దండ వేసేసాక
దండి మార్చిలు మార్చలేవు..
జలియన్వాలాభాగున
తెల్లోడు సృష్టిస్తే నరమేధం
ఎన్నికల బరిలోన
మనోళ్లే సాగిస్తారు
అక్రమాల అశ్వమేధం..!?
అందుకే పారాహుషార్..
నువ్వు కానే కావద్దు జీవితాంతం
జీ హుజూర్..!

-ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE