ఓటున్న ప్రతి పౌరుడూ దాన్ని వినియోగించుకోవాలి. 18 ఏళ్లు నిండిన వారంతా ఓటరు జాబితాలో నమోదయ్యాక… వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు నేరుగా వెళ్లి ఓటేయాలి. కొన్ని అసాధారణ సందర్భాలలో నేరుగా ఓటు వేయడం సాధ్యం కాదు. అలాంటి వారికి మరో నాలుగు విధాలుగా ఓటేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. అయితే… సంబంధిత ఓటరు ఎన్నికల సంఘం విధించిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.
సాధారణ ఓటు: 18 ఏళ్లు నిండిన, ఓటుహక్కు కలిగిన ప్రతి పౌరుడు పోలింగ్ కేంద్రాల్లో నేరుగా ఓటు వేయడాన్ని సాధారణ ఓటు అంటారు.
పోస్టల్ బ్యాలెట్: ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది పోలింగ్ రోజున… తమ స్వస్థలాలకు వెళ్లి ఓటేసే అవకాశముండదు. ఇలాంటి వారికి తపాలా బ్యాలెట్ ద్వారా ఓటును వినియోగించుకునే అవకాశాన్ని కల్పించారు.
సర్వీస్ ఓటు: సైనికులు, పారామిలిటరీ దళాల్లోని ఉద్యోగులు, సిబ్బంది… విధుల నిర్వహణలో భాగంగా దూరప్రాంతాల్లో ఉంటారు. వీరు తమ స్వగ్రామాల్లో ఓటు హక్కును వినియోగించుకునేలా సర్వీస్ ఓట్ల విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది.
ప్రాక్సీ ఓటు: అంటే… తమకు బదులుగా ఇతరులను పంపి ఓటు వేయడం. పోలీసు, రక్షణ శాఖల్లోని ఇంటెలిజెన్స్, గూఢచారి సిబ్బంది ఎవరికీ తెలియకుండా విధులు నిర్వహిస్తుంటారు. వారు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఈ అవకాశం కల్పించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దీన్ని ఇప్పటివరకు ఎవ్వరూ వినియోగించు కోలేదని ఎన్నికల అధికారులు తెలిపారు.
టెండర్ ఓటు: జాబితాలో పేరుండీ, పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లేసరికి తమ ఓటును వేరొకరు వేశారని తెలిశాక ఏమిచేయాలో పాలుపోని పరిస్థితిలో ఉన్న వారికి టెండర్ ఓటు ఇస్తారు. అయితే, తాను అంతకుముందు ఓటు వేయలేదని ఆ ఓటరు పోలింగ్ సిబ్బంది వద్ద నిరూపించుకోగలగాలి.