– కేసీఆర్‌కు అది ఈటల గుచ్చిన బాణమే
– జనం తిరుగుబాటుకు దారితీసిన అణచివేత ఫలితం
– తెరాసపై తిరగబడ్డ ఓట్ల తాయిలం
( మార్తి సుబ్రహ్మణ్యం)
టీఆర్‌ఎస్ ‘కారు’కు బీజేపీ టక్కర్.. ‘గులాబీ’వనంలో విరబూసిన ‘కమలం’.. కేసీఆర్‌కు గుచ్చుకున్న ఈటల ముళ్లు.. హుజురా‘బాద్‌షా’ బీజేపీ.. బీజేపీ హు‘జోరు’.. హుజురాబాద్‌లో ‘కారు’ బోల్తా.. గొల్లుమన్న ‘గెల్లు. ’హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితంపై ఇలాంటి ఆకర్షణీయమైన హెడ్డింగులు చాలా పెట్టవచ్చు. కానీ.. అక్కడ జరిగిన యుద్ధం చూసిన తర్వాత… ‘తిరుగుబాటు.. సానుభూతికి.. ఓట్ల హుజూరు’ హెడ్డింగే కరెక్టనిపించింది. ఎందుకంటే అక్కడ జరిగింది సర్కారుపై సామాన్యుడి తిరుగుబాటు కాబట్టి!
నిజం. కేవలం ఒక ఉప ఎన్నిక కోసం కేసీఆర్ భూమ్యాకాశాలను ఏకం చేయించారు. అయితే అణచివేతను పంటి బిగువున భరించే ప్రజలు.. అవకాశం వస్తే ఏ స్థాయిలో తిరుగుబాటు చేస్తార న్న దానికి, తాజా ఉప ఎన్నిక ఫలితమే నిలువెత్తు నిదర్శనం. ఈటలపై కేసులకు కారణమయిన యాంజాల్ భూములకు సంబంధించిన బాధితులంతా, హుజురాబాద్‌కు కట్టకట్టుకువచ్చి, ఈటల కోసం పనిచేశారంటే.. కేసీఆర్ తీరుపై జనాగ్రహం ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవడం పెద్ద కాష్టం కాదు. తెరాస ఇచ్చిన డబ్బులు తీసుకుని కూడా ఈటలకు జైకొట్టారంటే, ప్రజల మనసులో స్థిరపడిన కేసీఆర్ స్థానం ఎంత వేగంగా దిగజారుతోందో సులభంగానే ఊహించుకోవచ్చు. ట్రబుల్‌షూటర్‌గా పేరున్న హరీష్‌రావు కూడా ఈటల విజయాన్ని అడ్డుకోలేకపోయారు. ఇది ఆయనకు దుబ్బాక తర్వాత రెండో పరాజయం. అంటే హరీష్ వ్యూహాలు కూడా కాలగమనంలో పదునుతగ్గి, ఫలితాలివ్వడం లేదని స్పష్టమవుతున్నట్లే లెక్క.
ప్రజలు కూడా ఒక రకంగా గెరిల్లా లాంటివాళ్లే. పరిస్థితులు సహకరించనప్పుడు, రాజ్యం భయాందోళన సృష్టిస్తున్నప్పుడు .. వెనక్కి తగ్గి మౌనంగా ఉండటం, అవకాశం వచ్చినప్పుడు సత్తా చాటడం.. అప్పుడప్పుడూ కనిపించే ప్రజాస్వామిక దృశ్యాలే. ప్రజలు మౌనంగా ఉన్నారంటే.. చైతన్య రహితులుగా ఉన్నారంటే, అది చేతకాక-చేవలేక కాదు. పరిస్థితులు అనుకూలించక! రాజ్యం అణచివేతకు పాల్పడుతుంటే ఎదిరించలేక మౌనంగా ఉన్నారంటే, దానికి కారణం సరైన సమయం రానందున!! అది తెలంగాణలోనయినా, ఆంధ్రాలోనయినా!!!
పోలీసు బలగాన్ని ముందు పెట్టి, సర్వ వ్యవస్థలనూ ఏకీకృతం చేసి, చివరాఖరకు ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధులను కూడా అంగుష్టమాత్రం చేసి, తాననుకున్నదే ప్రజాస్వామ్యమన్నట్లు నడిపించిన కేసీఆర్ పనితీరు, ఈ ఫలితం.. ఈటల అన్నట్లు చెంపపెట్టు. కేటీఆర్ చెప్పినట్లు.. ఈ ఉప ఎన్నికతో సర్కారుకు వచ్చేదీ పోయేదేమీ లేకపోవచ్చు. కానీ ఇక నుంచి పోయేదే ఎక్కువ ఉంటుందన్నది ఈ ఫలితం మోగించిన ప్రమాద ఘంటిక. దాన్ని సానుకూల కోణంలో చూస్తే, ప్రమాదం ఏ స్థాయిలో ఉంటుందన్నది తేలిగ్గా గ్రహించవచ్చు. అదే తెలివైన వారు చేసే విశ్లేషణ. అది పాలకుల విజ్ఞత బట్టి ఆధారపడి ఉంటుంది.
ఇక హుజురా‘బాద్షా’ ఈటల మాత్రమే. కమలం కానేకాదన్నది నిష్ఠుర నిజం. తన ఆస్తుల రక్షణకు బీజేపీ సరైన రాజకీయ రక్షణ వేదిక అనుకునే ఈటల.. అందులో చేరారన్నది, మెడ మీద తల ఉన్న ఎవరికయినా తెలుసు. దానికి తగినట్లే.. తర్వాత ఆయనపై సర్కారు కేసుల్లో వేగం కూడా తగ్గిపోయింది. ఇప్పుడాయన ఉట్టి ఎమ్మెల్యే మాత్రమే కాదు. బీజేపీ జాతీయ నాయకుడు కూడా. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇక భూముల కేసు పురోగతి ఉంటుందనుకోలేం. అయితే ఈటల ఎంచుకున్న రక్షణ వేదిక సరైనదేనని, ఫలితం కూడా స్పష్టం చేసింది. నిజానికి ఆయన కాంగ్రెస్‌లో చేరి ఉంటే కథ మరోలా ఉండేది. అయితే అసలు ఏ పార్టీలో చేరకుండా స్వతంత్రుడిగా బరిలో దిగి ఉంటే.. పార్టీలకు అతీతంగా ప్రజలు ఆయనకు మరింత ఎక్కువ మెజారిటీ ఇచ్చి, బ్రహ్మరథం పట్టేవారు. కానీ ఆ ధైర్యం చేయకపోవడానికి కారణం, తనకు బలమైన రాజకీయ పార్టీ దన్ను కావాలని కోరుకోవడమే.
తాజా ఎన్నిక ఫలితం ఓ సారి విశ్లేషిస్తే.. భవిష్యత్తులో ఓటర్లు, అధికారంలో ఉన్న పార్టీ నుంచి వీలైనంత ఎక్కువగా డబ్బులు పిండి, తనకు నచ్చిన అభ్యర్ధికి ఓటేసే సంప్రదాయం మొదలయిందని అర్ధమయింది. అధికార పార్టీ ఇచ్చే డబ్బులు తమవేనన్న భావన, తమను పాలకులు మోసం చేసినట్లే, తామూ పాలకపార్టీని మోసగిస్తే తప్పులేదన్న వైఖరి స్పష్టం చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఏపీలో చంద్రబాబు.. పసుపు-కుంకుమకు ఇచ్చిన పదివేల తాయిలం కూడా ఇలాగే బూమెరాంగయింది.
పసుపు-కుంకుమ కింద డబ్బులిచ్చిన బాబును మెచ్చుకునే బదులు… ‘ఆ డబ్బేమన్నా ఆయన ఇంటి నుంచి ఇస్తున్నారా? మా డబ్బులే మాకిస్తున్నారన్న’’ భావన, ఎన్నికలప్పుడే ఇవన్నీ ఎందుకిస్తారన్న అనుమానం మహిళల్లో నాటుకుపోయింది. ఫలితంగా బాబు తాయిలం రివర్సయింది. ఇప్పుడు కేసీఆర్ ప్రకటించిన దళిత బంధు సహా అన్ని పథకాలూ అంతే. పధకాలు పాలకపార్టీలను కాపాడలేవన్న గొప్ప సందేశం ఇచ్చిన హుజురాబాద్ ఓటర్ల తీర్పునటు జోహార్లు.
హుజురాబాద్ ఉప ఎన్నిక పరాజయంతో, సోషల్‌మీడియా మళ్లీ జడలు విప్పింది. ఫలితంపై విచ్చలవిడిగా చెలరేగింది. టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా వైరల్ అవుతున్న వ్యంగ్యాస్త్రాల వీడియోలు పరిశీలిస్తే..
ప్రజాస్వామ్యదేశంలో అణచివేత ఎక్కువకాలం పనిచేయదని స్పష్టమవుతుంది. ఇప్పటివరకూ పోలీసుల భయంతో వెనుకంజవేసిన, రాజకీయ పార్టీల ప్రాయోజిత సోషల్‌మీడియా ఇకపై చె లరేగడం ఖాయం. పబ్లిక్ పల్సు ఏమిటో తెలిసిపోయిన పోలీసులు కూడా, మునుపటి రాజభక్తి ప్రదర్శించడం కష్టం. ఒకవేళ ఆ సాహసం చేస్తే దానికి మూల్యం చెల్లించుకునేదీ వాళ్లే. అదొక్కటే కాదు. కేసీఆర్ వైఖరి నచ్చని సొంత పార్టీ ప్రజాప్రతినిధులకు ఈ ఫలితం బహు ఆనందం ఇచ్చే ఉంటుంది. మంత్రులు, ఎమ్మెల్యేలకు దర్శనభాగ్యం లేని కేసీఆర్ నియంత పోకడను ప్రశ్నించలేక, తమలోతామే రగిలిపోతున్న ప్రజాప్రతినిధులకు ఈ ఫలితం నెత్తిన పాలుపోసినట్లే.
నిజానికి చాలామంది ప్రజాప్రతినిధులు ఈ ఉప ఎన్నికలో పార్టీ ఓడిపోతేనయినా, కేసీఆర్ కళ్లు నేలమీదకు వస్తాయని ఆశించారు. గతంలో చంద్రబాబు, వైఎస్ విషయంలోనూ అదే జరిగింది. ఎవరైతే తమను నిర్లక్ష్యం చేస్తారో, వారు పరాజితులు కావాలని కోరుకోవడం మానవ నైజం. అందుకు టీఆర్‌ఎస్ నేతలేమీ అతీతులు కాదు. ఇప్పుడు ఏ మంత్రి కూడా నేరుగా కేసీఆర్‌ను కలిసే వీలు లేదు. ఆయన అనుకుంటే తప్ప! పేరుకే ఆయన సీఎం గానీ, పెత్తనమంతా కేటీఆర్‌దేనన్నది మనం మనుషలం అన్నంత నిజం. ఒక సాధారణ ఏసీపీ, సీఐ బదిలీ కూడా కేటీఆర్‌కు తెలియకుండా, ఎమ్మెల్యేలకు సంబంధం లేకుండా జరుగుతున్నాయంటే, తెలంగాణలో ప్రజాప్రతినిధుల దయనీయం ఏవిధంగా ఉందో స్పష్టమవుతుంది.
ఈటల విజయంతో తెలంగాణ భవిష్యత్తు రాజకీయాలు ఎన్నో మలుపు తిరగవచ్చు. రాష్ట్రమంతా పర్యటి స్తానన్న ఈటల మాట నిజమైతే, టీఆర్‌ఎస్‌లో నిద్రాణంగా దాగున్న అసమ్మతి స్వరాలు మేల్కొన్నా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. కెపాసిటీకి మించి కిటకిటలాడుతున్న ‘కారు’లో గాలిరాని-స్వేచ్ఛలేని నేతలు, అదే గాలి- స్వేచ్ఛ కోసం బయటకు రావచ్చు. రాజకీయాల్లో అదృష్టలక్ష్మి ఎప్పుడూ పర్మినెంటుగా ఒక్కరినే అంటిపెట్టుకోని ఉండదు. సీజన్ ప్రకారం షిఫ్ట్టవుతుంటుంది. ఎవరికయినా నడిచినంతకాలమే. ఇది చరిత్ర చెప్పిన సత్యం. మనం చూస్తున్న మహా సత్యం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే పట్నాయక్ లాంటి ముఖ్యమంత్రులనే చరిత్ర గుర్తుంచుకుంటుంది.
కాబట్టి.. ప్రజల మౌనాన్ని, రోడ్డెక్కి ప్రశ్నించలేని చైతన్యరాహిత్యాన్ని అసమర్ధత అనుకుంటే, ఫలితం చివరాఖరులో ఇలాగే కళ్లు బైర్లు కమ్మేలానే ఉంటుంది. ఎన్ని సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నా.. ప్రజలు తమను పాలకపార్టీలు మోసం చేస్తున్నాయని గ్రహిస్తే, ఇక ఆ పార్టీలకు శంకరగిరిమాన్యాలే. ఎన్టీఆర్ ప్రభంజనం సునామీలా వీస్తున్న రోజుల్లో, కుక్కను నిలబెట్టి గెలిపిస్తాననే అహంభావ స్థితికి వెళ్లి దెబ్బలు తిన్నారు. ఇప్పటి తెలుగు రాష్ట్రాల రాజకీయ పార్టీ అధినేతలు, ఎన్టీఆర్‌ను మించిన ప్రజానేతలు కాదుకదా?