పట్టభద్రుల ఎన్నికల ఓటింగ్ సరళి

3

– 2019 అసెంబ్లీ ఎన్నికలతో చూస్తే ఎలా ఉంది?

హోరాహోరీగా జరిగిన మూడు పట్టభద్రుల స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. గెలుపోటములపై రకరకాల విశ్లేషణలూ జరిగాయి. 2019 ఎన్నికల తరువాత స్ధానిక సంస్థల ఎన్నికలు, రెండు ఉప ఎన్నికలు జరిగినా అవి ఎటువంటి పరిస్ధితిలో జరిగాయెూ చూసాం. మెదటిసారి ప్రతిపక్షాలు అధికార పక్షం బుల్డోజింగ్ ఎదుర్కొని ఢీ అంటే ఢీ అని తలపడ్డాయి. ఈ ఎన్నికలు విశ్లేషణ చేయడానికి కాస్త వాస్తవికంగా ఉంటాయి కనుక వీటిని విశ్లేషించి చూద్దాం.

ఫలితాలను బట్టి చూస్తే మూడు స్ధానాలలో కలిపి మెత్తం 7,16,664 ఓట్లు పోలవగా తెదేపా కు 2,89,630 ఓట్లు వచ్చాయి. ఇవి పోలైన ఓట్లలో 40.4% ఓట్లు. వైకాపా కు 2,36,972 ఓట్లు వచ్చాయి. ఇవి 33.06% ఓట్లు. పిడియఫ్ 12.82% తో 91,912 ఓట్లు సాధించగా, భాజపా 3.43% తో 24,611 ఓట్లు సాధించింది. వీటిని 2019 సాదారణ ఎన్నికలతో పోల్చి చూస్తే తెదేపా 2019 లో వచ్చిన 39.26% ఓట్లను స్వల్పంగా (+1.1%) మెరుగుపరచుకుని తన ఓటు బ్యాంక్ నిలబెట్టుకుంది. వైకాపా గతంలో వచ్చిన 49.95% ఓట్లను గణణీయంగా(-16.89%) కోల్పోయింది.

జసేపా ఇప్పుడు పోటీ చేయకున్నా గత ఎన్నికల్లో కమ్యూనిస్ట్, బియస్పీతో పొత్తులో సాధించిన 6.25% (జేయస్పీ 5.54% , సిపిఐ 0.11%, సిపియం 0.32%, బియస్పీ 0.28% ఓట్లు) ఇప్పుడు కమ్యూనిస్ట్ అనుబంధ సంఘంగా ఉన్న పిడియఫ్ కు పడి ఉంటే ఆ పార్టీ తన ఓటు శాతం మరొక 6.57% పెంచుకొంది. ఇక గతంలో 0.84% ఓట్లు సాధించిన భాజపా మరొక 2.54% ఓట్లను పెంచుకోగలిగింది. మరొక 9% చెల్లని ఓట్లు పోలయ్యాయి.

వీటిని విశ్లేషించి చూస్తే తెదేపా 2019 లో సాధించిన దాదాపు 40% ఓట్లను నిలబెట్టుకుని స్వల్పంగా మెురుగుపడింది. ఇంకా తెదేపా సాంప్రదాయకంగా బలమైన ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా ఎన్నికలు జరిగితే దాని ఓట్ల శాతం మరింత మెురుగ్గా ఉండేదేమెూ. తూర్పు, పశ్చిమ రాయలసీమ కూడిన ఆరు జిల్లాలలో 2019లో 7 స్థానాలు గెలిచిన తెదేపా, గోదావరి, కృష్ణా డెల్టాల నాలుగు జిల్లాలలో 10 స్థానాలు గెలవడం ఆ ప్రాంతంలో ఆ పార్టీ బలానికి నిదర్శనం.

దానికితోడు తెదేపా తురుపు ముక్కలైన అమరావతి, పోలవరం ఈ నాలుగు జిల్లాలలో నేరుగా ప్రభావం చూపుతాయి కనుక ఇక్కడ ఓటింగ్ శాతం కలిస్తే సుమారుగా 45% మేర ఉండవచ్చు. ఇది 2014 లో తెదేపా గెలిచినపుడు వచ్చిన ఓట్ల శాతానికి దగ్గరగా ఉంటుంది. ఇక సాదారణ ఎన్నికల్లో అధికార పార్టీకి ప్రభుత్వ యంత్రాంగంపై పట్టు ఉండదు కనుక ప్రతిపక్షాలపై అజమాయిషీ చేసి కట్టడి చేసే అవకాశం ఉండదు దానివల్ల ఓటింగ్ శాతం పెరిగితే ఇది మరికొంత పెరిగే అవకాశం ఉంది.

వైకాపా గత ఎన్నికల్లో సాధించిన 50%లో దాదాపు 17% పోగొట్టుకోవడం ఆశ్చర్యకరం. అందులోనూ రాయలసీమ ప్రాంతం ఆ పార్టీ ఆయువుపట్టు అక్కడ అత్యధిక సీట్లు సాధించింది, మూడు జిల్లాల్లో ప్రతిపక్షానికి ఒక్క సీటూ దక్కనివ్వలేదు. సామాజికంగా కూడా ఆ పార్టీకి బలమైన ప్రాంతం. ఉత్తరాంధ్రలో కూడా 2019లో అధ్బుత ఫలితాలు సాధించింది. అక్కడా ఒక జిల్లాలో స్వీప్ చేసింది. వీటికి తోడు వైకాపా మెూడల్ మూడు రాజధానుల్లో ఈ ప్రాంతాలకు రెండు ఇచ్చి, విశాఖలో లక్షల కోట్ల పెట్టుబడుల సదస్సులు చేసినా ఇక్కడ ఓడిపోవడం అనూహ్యం.

ఇక గోదావరి, కృష్ణా డెల్టాల పరిధిలో జరిగి ఉంటే ఈ 33% లో మరింత తగ్గి 30% వరకు పడేవోయేదేమెూ. బహుశా 2024లో ధన ప్రభావం ఉంటే అందులో ప్రత్యర్థులకు వంద మైళ్ళ ముందున్నందున, కేంద్రంలో అధికార పార్టీతో ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల ఏమైనా అద్భుతాలు జరిగితే కాస్త మెరుగైన ఫలితాలు రావచ్చేమెూ. ఇక మరొక ప్రదాన ప్రతిపక్షం జనసేన పోటీ చేయకపోయినా గత ఎన్నికల్లో దానితో కలిసి పోటీ చేసిన వామపక్షాల అనుబంధ సంస్థ పిడియఫ్ పోటీ చేసి 12.82% తెచ్చుకుంది ఇది గత ఎన్నికల్లో ఈ కూటమి తెచ్చుకున్న 6.25 కు దాదాపు రెట్టింపు.

అధికార వైకాపా కోల్పోయిన 16.8% లో 6.6% ఇటు మళ్ళాయనుకుంటే జనసేన కూటమి ఓట్లు దాదాపు అలాగే ఉండి మరొక 6% కొత్తగా సాధించుకుంది. బహుశా 2024 లో ఈ నాలుగు పక్షాలు విడిగా పోటీ చేసినా వామపక్షాలకు 3% వరకు జనసేనకు 8-10% వరకు ఉండే అవకాశం ఉంది. చివరిగా మరొక పార్టీ భాజపా, ఇ పార్టీ గతంలో పేరుకే విడిగా పోటీ చేసినా పూర్తిగా వైకాపా కోసమే పనిచేసిందనేది రాజకీయ ఆరోపణ, దానికి తగ్గట్టుగా ఇరు పార్టీల నాయకులూ ప్రవర్తిస్తారు. కనుక భాజపా పెంచుకున్న రెండున్నర శాతం వైకాపా ఓటర్లే అయ్యుండవచ్చు.

2024లో ఈ రెండు పార్టీల అంతర్గత అవగాహన బట్టి భాజపా ఓట్ల శాతం ఆధారపడి ఉంటుంది. మరొక జాతీయ పార్టీ కనుచూపుమేరలో కనిపించకుండా కనుమరుగైంది. ఈ యంయల్సీ ఎన్నికల సరళిని ఆధారంగా చేసుకుని చూస్తే 2024 లో తెదేపాకా 45-47% శాతం, వైకాపా 32-35%, జనసేన 7-10%, వామపక్షాలు 3-4%, భాజపా, కాంగ్రేసు 1-2% వరకు సాధించే అవకాశాలన్నాయని అంచనా వేయవచ్చు.

– దుర్గాప్రసాద్‌ కొంగర
నందిగామ