– కేసీఆర్ కు ప్రజాస్వామ్యంపైన నమ్మకం లేదు
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్
22 నెలలపాటు వీఆర్వోలను రోడ్డు పాల్జేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు లాటరీ ద్వారా ఇతర శాఖల్లోకి సర్దుబాటు చేయాలనుకోవడం వారందరినీ అవమానించడమే. ఈ మేరకు ఏకంగా జీవో జారీ చేయడం సిగ్గు చేటు. ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి నుండి రెవిన్యూ వ్యవస్థపై కక్ష కట్టినట్లు వ్యవహరిస్తున్నారు. వీఆర్వోలను దొంగలుగా చిత్రీకరించి 22 నెలలుగా రోడ్డు పాల్జేశారు.
అశాస్త్రీయమైన ధరణి వెబ్ సైట్ లోని తప్పులను ఎత్తిచూపుతారనే ఉద్దేశంతో వీఆర్వో వ్యవస్థను తొలగించారు. కొత్త జిల్లాలు, కొత్త మండలాలు ఏర్పాటు చేసిన కేసీఆర్.. రెవిన్యూ శాఖలో ఒక్క వీఆర్వో పోస్ట్ కూడా క్రియేట్ చేయకుండా ఆ శాఖలో కొనసాగుతున్న 7 వేల పైచిలుకు వీఆర్వోలను లాటరీ పద్దతిలో ఇతర శాఖల్లోకి సర్దుబాటు చేయాలని ఉత్తర్వులు జారీ చేయడం సిగ్గు చేటు.
భూస్వామ్య మనస్తత్వం కలిగిన కేసీఆర్ కు ప్రజాస్వామ్యంపైన నమ్మకం లేదు. పెత్తందారీ మనస్తత్వంతో 8 ఏళ్లుగా పాలన కొనసాగిస్తున్నారు. దళిత, బడుగు, బలహీనవర్గాలను చెట్టుకొకరు పుట్టకొకరుగా చేసుతున్నారు. సర్పంచులకు అధికారాల్లేకుండా చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీల అధికారాలను నామమాత్రంగా మార్చారు. పంచాయతీరాజ్, రెవిన్యూ వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్వ్యం చేశారు.
చివరకు గ్రామ కార్యదర్శులకు కూడా మనశ్సాంతి లేకుండా చేస్తున్నరు.
ఉన్నత విద్యావంతులైన వీఆర్వోలను తహిసిల్దార్లుగా చేస్తానని గతంలో హామీ ఇచ్చిన కేసీఆర్… అవినీతి అనే సాకుతూ ఏకంగా వీఆర్వో వ్యవస్థనే నిర్మూలించడం దారుణం. తక్షణమే ముఖ్యమంత్రి కేసీఆర్ జీవో నెంబర్ 121ను ఉపసంహరించుకోవాలి. వెంటనే వీఆర్వోలందరికీ పోస్టింగ్ ఇవ్వాలని బీజేపీ తెలంగాణ శాఖ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.