– బాబుతో జతకట్టిన పార్టీలన్నీ ఇప్పడు కళ్ళుతేలేసాయి. ఆ లెగ్ అలాంటిది
-సంక్షేమ, అభివృద్ది పథకాలే పార్టీకి శ్రీరామరక్ష
-సోషల్ మీడియా కార్యకర్తలకు ప్రాధాన్యత
– మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ లో ఆమోదించాలి
– ట్విట్టర్ వేదికగా ఎంపీ విజయసాయి రెడ్డి
విశాఖపట్నం : తెలుగుదేశం అధినేత చంద్రబాబుది గుంటనక్క బుద్దని తెలిసే ప్రధాని మోదీ దూరం పెట్టారని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. గురువారం ట్విట్టర్ వేదికగా పలు అంశాలు వెల్లడించారు.
వంగివంగి దండాలు పెట్టే రోజులే గనక ఇప్పడుంటే తాను పుతిన్ ఒప్పించి యుద్ధం ఆపిస్తానని మోది ముందు వీరబిల్డప్ లు ఇచ్చేవాడని అన్నారు. పోలెండ్ లో మకాం పెట్టి తానే విధ్యార్దులకు ఫ్లైట్లు ఎక్కించానని తన అనుకుల మీడియాతో ప్రచారం హోరెత్తించేవాడని అన్నారు.
అప్పట్లో చంద్రబాబుతో జతకట్టి చేతులు పైకెత్తిన పార్టీలన్నీ ఈ ఎన్నికల్లో కళ్ళు తేలేశాయని, బాబు లెగ్ మహత్యం అలాంటిది అన్నారు. యుపిని మళ్లీ గెలుచుకున్న బీజేపీకి అభినందనలు చెప్పి వారి చంకలో దూరాలని ఉన్నా .వేచి చూస్తున్నాడని, అఖిలేష్, మాయావతి ఫోన్లు చేసి ఎక్కడ దులిపేస్తారోనని కలవరపడుతున్నట్లున్నాడని ఎద్దేవా చేసారు.
పార్టీలు, ప్రాంతాలు, కుల మతాలకు అతీతంగా రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని, అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయమని అన్నారు. ఇవే పార్టీకి శ్రీరామ రక్షగా నిలుస్తాయని ఫలితంగా 2024లోనూ వైఎస్సార్ సీపీనే అధికారంలోకి వస్తుందని అన్నారు.
రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడంలో సోషల్ మీడియా కార్యకర్తలు కీలకపాత్ర పోషించారని అన్నారు. సీఎం వైఎస్ జగన్ గారి ఆదేశాల మేరకు వారికి తగిన గుర్తింపు ఇచ్చి, ప్రోత్సహించడం జరుగుతుందని అన్నారు. సోషల్ మీడియా కార్యకర్తల మాదిరిగానే నేనూ పార్టీకి సేవకుడినేనని అన్నారు.
సాయుధ బలగాలలోకి పెద్ద ఎత్తున మహిళలకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం గొప్ప విషయమని ఈ మేరకు మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ఆమోదించాలని మరోమారు వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. ఇది మహిళలు చట్టాలు రూపొందించే ప్రక్రియలో మరింత చురుకైన పాత్ర పోషించడానికి సహాయపడుతుంది, చివరికి అన్ని రంగాలలో మహిళా సాధికారతకు దారి తీస్తుందని వెల్లడించారు.