Suryaa.co.in

Andhra Pradesh

యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు

– ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్

విజయవాడ: చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో వర్షాలు కురియడంతో సింగ్ నగర్ ప్రాంతంలో వరద ఉధృతి పెరిగింది. 100, 200 ఏళ్ళ చరిత్ర చూసినా ఇంత భారీగా వర్షం.. అదే విధంగా విజయవాడలో వరద ప్రభావం లేదని తెలుస్తోంది. 2009 కంటే ఇప్పుడు భారీగా వర్షాలు కురిసాయి. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు ఇంత పెద్దస్థాయిలో వరద వస్తుందని ఊహించలేదు.

-తెలంగాణ ప్రాంతంలో ఎగువన కురిసిన వర్షాలకు స్థానికంగా వర్షాలు తోడవడంతో ఈ పరిస్థితి ఎదురైంది. ముఖ్యమంత్రి దార్శనికత, ముందుచూపు వల్ల ఆపదలో ఉన్న ప్రజలకు యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టేందుకు వీలైంది.

అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా కష్టాల్లో ఉన్న ప్రజలకు సాయం అందించడంలో మొత్తం అధికార యంత్రాంగాన్ని సర్వసన్నద్ధం చేశారు. రెవెన్యూ, పోలీస్, పురపాలక.. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ముంపు ప్రభావిత బాధితులకు సహాయ సహకారాలు అందించడం జరుగుతోంది.

మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేష్ బాబు.. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ బాధితులకు సహాయం అందించే చర్యలు సరైన విధంగా జరిగేలా చూస్తున్నారు.డివిజన్ల స్థాయిలో, వార్డు సచివాలయ స్థాయిలో మంత్రులకు ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించి వివిధ అధికారులను, క్షేత్రస్థాయి సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ బాధితులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నాం.

గత ప్రభుత్వం కాలువలు, డ్రైన్లను సరైన మరమ్మతులు చేయకుండా గాలికి వదిలేయడంతో వరద ప్రవాహం సరిగా లేకపోవడం వల్ల ఈ దుస్థితి ఎదురయింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను, బోట్లను రంగంలోకి దిగేలా చేశారు.

ముందుగా ప్రజలకు అత్యవసరమైన ఆహార పదార్థాలను అందించేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి అహర్నిశలు కృషి చేస్తున్నాయి. స్థానికంగా ఆహార ప్యాకెట్లను సిద్ధం చేయడంతో పాటు పక్క జిల్లాలనుంచి కూడా ఆహారం సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగింది. సిద్ధం చేస్తున్న ఆహార ప్యాకెట్లను మంచినీరు, బిస్కెట్లు తదితరాలను బాధితులకు చేరవేసేందుకు రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది.

సహాయక చర్యలు పూర్తిస్థాయిలో సజావుగా సాగేందుకు వీలుగా నిధులు కొరత అనే మాట లేకుండా ఏర్పాట్లు చేయమని గౌరవ ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందుకు తగ్గట్లు ఏర్పాటు చేశాం.బాధితులకు సహాయ సహకారాలు అందించడంలో మీడియా కూడా భాగస్వామ్యం కావాలని.. ప్రభుత్వం దృష్టికి మీడియా తీసుకువచ్చే అంశాలను పరిశీలించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

-బాధితులకు సహాయ సహకారాలు అందించడం, మనోధైర్యం కల్పించడం అనేది అందరి సమష్టి బాధ్యత.ముఖ్యమంత్రి చొరవతో ఆయనతోపాటు మొత్తం అధికార యంత్రాంగం కలెక్టర్ కార్యాలయంలో ఉండి పరిస్థితిని సమీక్షిస్తూ సహాయ క చర్యలు చేపట్టడం జరుగుతోంది. క్షేత్రస్థాయి సిబ్బందికి మార్గ నిర్దేశం చేస్తూ సహాయక చర్యలు సాఫీగా సాగేలా చూస్తున్నాం.

LEAVE A RESPONSE