Suryaa.co.in

Editorial

డీజీపీ గారూ… ‘ఆనం’ రెడ్డిని ముక్కలుగా నరికేస్తారట.. విన్నారా?

– తిరుపతి కార్పొరేషన్ కౌన్సిల్‌లో వైసీపీ కార్పొరేటర్ హెచ్చరిక
– ముక్కముక్కలుగా నరుకుతానని కమిషనర్ ముందే హెచ్చరించిన తెగింపు
– సుమోటో కేసులు పెట్టని పోలీసుల విశాల హృదయం
– గతంలో సీఎంను నువ్వు అన్నందుకే కేసులు పెట్టిన పోలీసులు
– పోస్టులు ఫార్వార్డ్ చేసినందుకే వృద్ధురాలిపై సీఐడీ కేసు
– మరి ఆనం వెంకటరమణారెడ్డిని ముక్కలు చేస్తానన్న కార్పొరేటర్‌పై కేసులేవీ?
– అధికారపార్టీ నేతలను ఇలాగే హెచ్చరించినా ఇంతే మౌనంగా ఉంటారా?
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీలో ధర్మం నాలుగుపాదాల.. పంచకల్యాణి గుర్రం కూడా ఈర్ష్యపడలా పరుగులు తీస్తోందన్నది పాలకులు- పోలీసు బాసులు తరచూ చెప్పేమాట. నిర్మొహమాటంగా, నిజాయితీగా పనిచేస్తుంటే, తమపై అనవసరంగా బురద చల్లుతున్నారని పోలీసు బాసులు, తరచూ మీడియా సమావేశాల్లో వాపోతుంటారు. తాము కొండవీటి సింహంలో ఎన్టీఆర్ మాదిరిగా, నీతి-నిజాయితీ అనే మడిబట్ట కట్టుకుని అంకితభావంతో పనిచేస్తున్నామని కూడా సెలవిస్తుంటారు. తమకు రాగద్వేషాలు, పార్టీ ముద్రలు లేవని చెబుతుంటారు. మంచిదే. ఏపీలో అంకితభావం కమ్ చిత్తశుద్ధితో పనిచేసే పోలీసులు.. పరాయి రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంటే, అంతకంటే కావలసింది ఏముంటుంది?

అయితే వాస్తవంలో అందుకు భిన్నంగా జరుగుతుండటం వల్లే.. విమర్శలకు తెరపడటం లేదన్నది బుద్ధిజీవుల వాదన. గతంలో పలువురు విపక్ష నేతలు సీఎం జగన్మోహన్‌రెడ్డిని, ‘నువ్వు’ అని సంబోధించినందుకే వారిపై కేసులు పెట్టారు. ప్రెస్‌మీట్లలో పరుషపదజాలం వాడిన వారిపైనా కేసులు నమోదు చేశారు. ఇక సోషల్‌మీడియాలో ప్రభుత్వంపై వచ్చిన విమర్శలను ఫార్వార్డ్ చేసినందుకు.. కామెంట్లు పెట్టినందుకు, గుంటూరులో ఒక వృద్ధురాలి సహా లెక్కనేంతమందిపై కేసులు పెట్టి, పోలీసులు తమ అంకితభావం కమ్ చిత్తశుద్ధిని జమిలిగా చాటుకున్నారు. సంతోషం.

సీన్ కట్‌చేస్తే.. తాజాగా, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం జరిగింది. మేయర్ డాక్టర్ శిరీష అధ్యక్షతన జరిగిన ఆ సమావేశానికి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి సహా కార్పొరేటర్లు హాజరయ్యారు. ఆ సందర్భంలో ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి వీరాభిమాని అయిన, కో ఆప్షన్ సభ్యుడు ఇమామ్ చేసిన వ్యాఖ్యలు కౌన్సిల్‌ను అట్టుడికించాయి. అవి మీడియాలో కూడా ప్రముఖంగా వచ్చాయి.

‘‘మా నాయకుడు కనుసైగ చేస్తే ఆనం వెంకటరమణారెడ్డి గాడిని ముక్కముక్కలుగా నరికేస్తా’’నని కన్నెర్ర చేశారు. టీడీఆర్ బాండ్ల జారీలో భూమన కరుణాకర్‌రెడ్డి భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డారంటూ, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించటమే ఇమాం ఆవేశానికి అసలు కారణం. భూమనకు ప్రధాన అనుచరుడైనందున, ఇమామ్ ఆవేశపడి ఉండాలి.

అయితే ఇమామ్ ఆవేశంగా ఆనం వెంకటరమణారెడ్డిని ముక్కముక్కలుగా నరికేస్తా.. చంపేస్తానంటూ శివాలెత్తుతున్న సమయంలో, అక్కడే ఉన్న భూమన ఆయనను వారించారనుకోండి. అది వేరే విషయం. పోనీ ఇవన్నీ ఎక్కడో రహస్యంగా జరిగిన సమావేశంలో జరిగిన సన్నివేశాలు కాదు. నిండు సభలో, సీసీ టీవీ కెమెరాలు, కమిషనర్, మేయర్, ఎమ్మెల్యేల సాక్షిగా.. ఆనంపై ఇమామ్ చేసిన హెచ్చరిక వ్యాఖ్యలు. అవి మీడియాలో కూడా ప్రముఖంగా వచ్చాయి.

కానీ ఏపీలో అంకితభావం కమ్ చిత్తశుద్ధి కమ్ నీతి-నిజాయితీ-కమ్ నిస్వార్థంతో పనిచేసే పోలీసులకు మాత్రం.. ఇమామ్ చేసిన నరికివేత వ్యాఖ్యలు కనిపించకపోవడం-వినిపించకపోవడమే వింత. సాధారణంగా అయితే ఒక వ్యక్తినుద్దేశించి.. మరొక వ్యక్తి హత్య చేస్తానంటూ బహిరంగా హెచ్చరిస్తే, దానిపై ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా, పోలీసులు దానిని సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాలి. అసలు ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా సీఐడీ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసిన కేసులకు లెక్కేలేదు. మరి ఆ ప్రకారమే అయితే ఇమామ్‌పై కూడా పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి తీరాలి. కానీ ఇప్పటిదాకా ఆ పనిచేయలేదు. అదే సమస్య!

ఆనం వెంకటరమణారెడ్డి అంటే.. ఎవరో దారిన పోయే దానయ్య కాదు. ప్రతిపక్ష పార్టీకి రాష్ట్ర అధికార ప్రతినిధి. పాలకుల అక్రమాలను మీడియా ముఖంగా చాకిరేవు పెట్టడంలో ముందుంటారు. రుజవులతో ముందుకు వస్తుంటారు. గతంలో ఆయన ఇంటిపైనే దాడి జరిగింది. అయినా ఇప్పటిదాకా చర్యలు లేవు. దాడిని ప్రేరేపించిన వారిని వదిలేయడం విమర్శలకు గురిచేసింది. పార్టీ కార్యక్రమాల కోసం ఆయన రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తుంటారు. ఆ సందర్భంలో ఆయనకు ఇమామ్ వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే దానికి బాధ్యులెవరు?

ఆనం రమణారెడ్డిని హత్య చేస్తానని ముంద స్తుగా హెచ్చరించిన ఇమామ్‌పై, కేసు పెట్టి అరెస్టు చేయాల్సిన పోలీసులు.. మౌనవ్రతం ఎందుకు పాటిస్తున్నారు? రేపు ఏ విపక్ష పార్టీకి చెందిన నాయకుడో నేరుగా సీఎంనో, మంత్రినో, ఎమ్మెల్యేనో ఇమామ్ మాదిరిగా హెచ్చరిస్తే.. పోలీసులు ఇలాగే మౌనవ్రతం పాటిస్తారా? ఇంత విశాల హృదయం ప్రదర్శిస్తారా? ఇంత సహనంతో ఉంటారా? ఆ విమర్శించిన వారిని పట్టుకుని డొక్క చించి డోలు కట్టి బొక్కలో వేయరూ?! మరి ఇమామ్ విషయంలో ఆ కాఠిన్యం, విధి నిర్వహణ ఏమైంది? ఇదేనా విధి నిర్వహణలో ఏపీ పోలీసుల చిత్తశుద్ధి కమ్ అంకితభావం?

మీడియా-సోషల్ మీడియాలో పాలకులు-పాలకపార్టీ నేతలకు వ్యతిరేకంగా వచ్చే ప్రకటనల ఆధారంగా, కేసులు పెడుతున్న పోలీసుల దూకుడు.. డజన్ల మంది సాక్షిగా ఇమామ్ అనే వ్యక్తి , ఆనం వెంకటరమణారెడ్డి ముక్కలు ముక్కలుగా నరికేస్తానని హెచ్చరించిన విషయంలో మాత్రం, ఎందుకు అదే దూకుడు ప్రదర్శించడం లేదు? మరి రాష్ట్రంలో శాంతిభద్రతలు దివ్యంగా వెలిగిపోతోందని తరచూ మీడియాకు చెప్పే డీజీపీ సారు… విపక్ష నేతను ముక్కలు ముక్కలుగా నరికి చంపేస్తానన్న ఇమామ్ హెచ్చరికలపై స్పందించరా? ఇమామ్ మాదిరిగానే విపక్ష నేతలు పాలకులను హెచ్చరిస్తే వారిని కూడా ఇంత విశాల హృదయంతో వదిలేస్తారా? అన్నది బుద్ధిజీవుల సందేహాలు. పోలీసులూ… వింటున్నారా?!

LEAVE A RESPONSE