– సజ్జల రామకృష్ణారెడ్డి
టీడీపీ అంటే ఒక గోబెల్స్ పార్టీ అని మరోసారి రుజువు అయ్యింది. నాతో సహా మా కుటుంబ సభ్యుల ఓట్ల చేరికపై ఒక అబద్ధాన్ని పదేపదే చెప్పి అదే నిజం అని నమ్మించడానికి టీడీపీ నాయకులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీకావు. కళ్లముందు ఆధారాలు స్పష్టంగా ఉన్నాసరే వాస్తవాలను కప్పిపుచ్చి, అబద్ధాలను నిజాలుగా నమ్మించే ప్రయత్నంచేస్తున్నారు. ప్రజలకు తప్పుడు సమాచారం చేరకూడదనే ఉద్దేశంతో ఈ అంశాన్నికి సంబంధించి మరోసారి స్పష్టత ఇస్తున్నాను.
1. అక్టోబరు 13, 2023న నాతో సహా నా కుటుంబ సభ్యులు పొన్నూరు నియోజకవర్గంలో ఓటర్లగా చేరడానికి దరఖాస్తు చేశాం. అయితే రెయిన్‌ట్రీ సముదాయంలోని అపార్ట్‌మెంట్ల భాగం పొన్నూరులోకి, మేం నివాసం ఉంటున్న రోడ్డుకు ఇటువైపున ఉన్న విల్లాల భాగం మంగళగిరి నియోజకవర్గంలోకి వస్తుందని సంబంధిత సిబ్బంది ద్వారా తెలిసింది.
2. ఇది తెలిసిన వెంటనే అక్టోబరు 27, 2023న మంగళగిరి నియోజకవర్గంలో మళ్లీ ఓట్ల చేరికకోసం దరఖాస్తు చేయడం జరిగింది.
3. మొదట మేం చేసిన దరఖాస్తుకు సంబంధించి ప్రక్రియ నడుస్తున్న సమయంలో దాన్ని ఉపసంహరించుకునేందుకు ఎలాంటి ఆస్కారం లేదు. జాబితా వెలువడిన తర్వాతే ఆపేర్లను సంబంధిత జాబితానుంచి ఉపసంహరించడానిగాని, డిలీట్ చేయడానికి గాని అవకాశం ఉంటుంది.
4. ఈ నేపథ్యంలో జనవరి 22, 2024న కొత్త జాబితాలు తయారవగానే, పొన్నూరు నియోజకవర్గం జాబితా నుంచి నాతో సహా, నా కుటుంబ సభ్యుల పేర్లు తొలగించమని జనవరి 31, 2024న దరఖాస్తు కూడా చేయడం జరిగింది.
5. ఎన్నికల అధికారులు మేం చేసిన డిలీషన్ దరఖాస్తును పరిశీలించి వాటిని తొలగించడం కూడా జరిగింది.
ఈ అంశంలో చాలా పారదర్శకంగా వ్యవహరించాం అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏంఉంటుంది? అయినా సరే అబద్ధాలు చెప్పి, వాటిని నిజాలుగా నమ్మించే ప్రయత్నంచేసి, రాజకీయంగా లబ్ధి పొందడానికి, బురదజల్లడానికి టీడీపీ చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు గమనించారు. వారి విపరీతపోకడలకు సరైన సమాధానం చెప్తారు.