ఇది రాజధాని డ్రామా… ప్రజలు వీరు ఉచ్చులో పడరు…

-పార్టీలో వై.వి. సుబ్బారెడ్డి ఆషామాషీ వ్యక్తేమి కాదు…
-వాళ్ళిద్దరూ తోడు దొంగలే…
-యుద్ధ ప్రాతిపదికన అమరావతి, పోలవరం నిర్మాణం…
-బూట్లు వేసుకున్న అధికారులు పనికిమాలిన రాజకీయ నాయకుల చెప్పులు తుడుస్తున్నారు…
-ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్ కు నివేదించిన పురంధేశ్వరి …
-వైకాపా ఖాళీ అవుతుందని ముందే చెప్పా…
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు

రాజధాని పేరిట ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆయన బాబాయి చేత కొత్త డ్రామా ఆడిస్తున్నారని, ఇటువంటి పిచ్చి డ్రామాలకు ప్రజలెవరు వారి ఉచ్చులో పడరని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు అన్నారు. బుధవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… అమరావతిని రాజధానిగా కొనసాగించరు కానీ విశాఖపట్నంను రాజధాని చేస్తానంటారని, కర్నూలును న్యాయ రాజధానిగా పేర్కొంటారని, మాకు తెలియకుండానే కర్నూలుకు కోర్టును ఎలా మారుస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించగా, కోర్టు మారుస్తామని అనలేదంటూనే కర్నూలును అసలు రాజధానిగా ప్రకటించలేదన్నారని, కేవలం రెండు రాజధానులు మాత్రమే ఏర్పాటు చేస్తామన్నామని చెప్పి ఆ రెండు రాజధానులను కూడా ఏర్పాటు చేయలేదని ఆయన అన్నారు. అమరావతిలో రోడ్లను తవ్వించారని, స్థానిక ఎంపీ చేత నానా దరిద్రం చేయించారని, అమరావతిలో పూర్తయిన బిల్డింగులకు 70 కోట్ల రూపాయల అద్దె వస్తుందని, రుణాలను చెల్లించాల్సి వస్తుంద దొరకకుండా డ్రామాలాడుతున్నారని అన్నారు. ఇంత ఫ్రాడ్ చేసి, ఉన్నదంతా ఇచ్చేసి ఉమ్మడి రాజధానిగా హైదరాబాదును మరో మూడేళ్ల పాటు కొనసాగించాలని జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ అయినా వై.వి. సుబ్బారెడ్డి కోరుతున్నారని, అది ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తూ ఇలాంటి చెత్త వాగుడు వాగొద్దని రఘురామకృష్ణ రాజు హెచ్చరించారు.

పార్టీలో వై.వి. సుబ్బారెడ్డి ఆషామాషీ వ్యక్తేమి కాదు…
వైకాపాలో వై.వి. సుబ్బారెడ్డి ఆషామాషీ వ్యక్తి ఏమి కాదని, ఆయన విశాఖపట్నం పాలెగానిగా వ్యవహరించారని, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ గా నాలుగేళ్ల పాటు కొనసాగారని, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి స్వయాన బంధువే కాకుండా, పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఆయన ఒకరని, అటువంటి వై.వి. సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షాలు రాజధానిని అభివృద్ధి చేయనివటం లేదని, హైదరాబాదు నగరాన్ని మరో మూడేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగించేలా కేంద్రాన్ని కోరబోతున్నట్లుగా చెప్పారని రఘురామకృష్ణ రాజు  తెలిపారు.

పదేళ్ల పాటు హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా ప్రకటించినప్పటికీ ఇప్పుడు అది సరిపోదని… మరో మూడేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలంటూ ఆయన కారు కూతలను కూశారన్నారు. అయితే విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం మీడియానే వై.వి. సుబ్బారెడ్డి మాటలను వక్రీకరించిందని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. వై.వి. సుబ్బారెడ్డి క్రిస్టల్ క్లియర్ గా అందరికీ అర్థమయ్యేలా హైదరాబాదును మరో మూడేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని పేర్కొన్నారని అన్నారు. ఈ విషయంలో జగన్ మోహన్ రెడ్డి కూడా స్పష్టత ఇస్తారని వై.వి. సుబ్బారెడ్డి చెప్పారని గుర్తు చేశారు.

అయితే పార్టీకి, వై. వి. సుబ్బారెడ్డి వ్యాఖ్యలకు సంబంధం లేదని సత్తిబాబు అన్నప్పటికీ, పార్టీలో సత్తిబాబు ఎంత పవర్ ఫుల్ అనేది తెలియదు కానీ, సుబ్బారెడ్డి మాత్రం పవర్ ఫుల్ వ్యక్తేనని రఘురామకృష్ణ రాజు చెప్పారు. రాజ్యసభ సభ్యుడిగా నామినేషన్ దాఖలు చేసిన వై.వి. సుబ్బారెడ్డి పదవికి మరో ఆరేళ్ల పాటు డోకా లేదని, జగన్ మోహన్ రెడ్డి మరో రెండు నెలల తర్వాత అధికారంలో ఉంటారా?, పోతారా?, బొత్స సత్యనారాయణ అధికారంలో ఉంటారా?, పోతారా?? అన్నది సస్పెన్స్ అని అన్నారు. అయినా సుబ్బారెడ్డి చెప్పిన దాన్ని కాకి రెట్టేసినట్లుగా తుడిచేయమని బొత్స సత్యనారాయణ పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.

ఉమ్మడి రాజధానిగా మరో మూడేళ్ల పాటు హైదరాబాదును కొనసాగించాలని వై.వి. సుబ్బారెడ్డి ఎందుకు అన్నారన్నది విజ్ఞులైన ప్రజలంతా ఆలోచించాలని రఘురామకృష్ణ రాజు కోరారు. హైదరాబాదు నగరాన్ని మించిన రాజధానిని నిర్మిస్తామని గతంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారని, రాజధాని నిర్మించాలంటే కేవలం డబ్బులు మాత్రమే ఉంటే సరిపోదని, నిర్మించాలనే ఆలోచన కూడా ఉండాలని సైగ చేశారన్నారు. ఆ తరువాత రాజధాని నిర్మాణం అంటే ఖర్చుతో కూడుకున్న పని అని చెప్పి, మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నామని అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టి చెప్పారన్నారు.

చివరకు న్యాయస్థానంలో మూడు రాజధానుల బిల్లు కొట్టివేస్తుందన్న దశలో బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లుగా పేర్కొని, బిల్లును వెనక్కి తీసుకున్నారని గుర్తు చేశారు. మూడు రాజధానుల బిల్లుపై తీర్పు ఇవ్వవద్దని న్యాయస్థానాన్ని కోరారని, అలాంటి బిల్లు పెట్టడానికి వీలులేదని చాలా డీటెయిల్ గా న్యాయస్థానం తీర్పు ఇచ్చిందని, దీంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిందని అక్కడ అసెంబ్లీకి బిల్లు పెట్టి హక్కు లేదన్నారు సార్ అంటూ స్టే ఆర్డర్ అడిగితే కోర్టు అవతలికి పొమ్మన్నదని తెలిపారు. మూడేళ్ల పాటు ఈ తతంగమంతా నడిచిందని, అయినా గుడివాడ అమర్నాథ్ విజయసాయి రెడ్డి , సుబ్బారెడ్డి వంటి జగన్ మోహన్ రెడ్డి బినామీలు… విశాఖపట్నంకి జగన్ మోహన్ రెడ్డి వచ్చేస్తున్నారని, ఆయన్ని ఆపే శక్తి ఎవరికీ లేదంటూ బీరాలు పలికారని అన్నారు. రైతులు మొక్కవోని దీక్షతో న్యాయస్థానాలను ఆశ్రయించారని, న్యాయస్థానాలు చెంప చెల్లుమనిపించేలా తీర్పులు ఇచ్చాయని అన్నారు. అమరావతి రైతుల ధైర్యం ముందు ఒక్క అడుగు కూడా జగన్ మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ ముందుకు వేయలేకపోయిందని అన్నారు.

టూరిజం ప్రాజెక్టు పేరిట ప్రజాధనంతో పెద్ద ప్యాలెస్ కట్టుకున్నప్పటికీ ఆ ప్యాలెస్ లోకి వెళ్లలేని దుస్థితి నెలకొందని, ఏకంగా ప్యాలెస్ లోకి వెళ్లలేని దుస్థితి నెలకొన్న తర్వాత ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలంటే విశాఖపట్నంలో నాలుగైదు లక్షల ఎస్ఎఫ్టి కలిగిన కార్యాలయం ఏర్పాటు చేయాలని, ముఖ్యమంత్రి ఆర్డర్ ఇచ్చిన వెంటనే అమలు చేయడానికి కార్యదర్శులు అందుబాటులో ఉండాలని కహానీలు చెప్పారని, అన్నారు. చిన్న రాష్ట్రంలో మూడు జిల్లాలలో విశాఖపట్నం విపరీతంగా అభివృద్ధి చెందిందని రాజధానిగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారని, మిగిలిన రెండు జిల్లాల అభివృద్ధి చేయడానికి రాష్ట్రంలోని ఓ మూల ప్రాంతంలో సెక్రటేరియట్ అంతా తీసుకువెళ్లిపోయి అక్కడ పెట్టాలట అని అన్నారని, ఇది కూడా న్యాయస్థానం పసిగట్టి ఎంత మంది వెళ్లాలని ప్రశ్నిస్తూ ఐదు లక్షల ఎస్ఎఫ్టి స్థలం ఎందుకని నిలదీసిందని తెలిపారు. సమగ్ర సమాచారాన్ని ఇవ్వాలని ఆదేశించడంతో సమాచారము ఇవ్వడానికి అవకాశం లేక ఆ ప్రయత్నాన్ని కోర్టు జోక్యంతో విరమించుకున్నారని అన్నారు.

తెలంగాణలో టీ.ఆర్.యస్. కాస్తా బీ.ఆర్.యస్ గా రూపాంతరం చెందిందని, జగన్ మోహన్ రెడ్డి కేసీఆర్ గార్ల మధ్య సంబంధ బాంధవ్యాలు మొదటి నుంచే తీవ్రంగా ఉన్నాయని, బిర్యానీ తినడానికని హైదరాబాదుకు వెళ్ళిన జగన్ మోహన్ రెడ్డి , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆస్తులను తానేదో మహానుభావుడిని, బలి చక్రవర్తిని, శిబి చక్రవర్తిని అన్నట్లుగా తెలంగాణకు పప్పు బెల్లాలలా కట్టబెట్టారని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 58% ఆస్తుల వాటా, దాదాపుగా 20 నుంచి 25 వేల కోట్ల రూపాయల విలువ ఉంటుందని, వాటన్నింటినీ తెలంగాణకు తన అబ్బా బాబు సొమ్ములాగా బదిలీ చేశారని తెలిపారు. ఇప్పుడు వీళ్ళ బాబాయేమో హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉండాలని అంటున్నారని, ఇదంతా రాజకీయ క్రీడలో ఒక భాగం కాదా? అన్నది విజ్ఞులైన ప్రజలు ఆలోచించాలని కోరారు.

టిఆర్ఎస్ కాస్తా బిఆర్ ఎస్ గా రూపాంతరం చెందిన తర్వాత, ప్రాంతీయ వాదం చచ్చిపోయి, ఆ పార్టీని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఓడించిన తర్వాత, ఆ పార్టీని లేపడానికి జగన్ మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయి చేత ఆడిస్తున్న నాటకమన్నది అందరికీ అర్థమవుతూనే ఉందని అన్నారు. తెలంగాణ ప్రజలు ఆంధ్రప్రదేశ్ నాయకులు ఈరోజు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలని కోరుతున్నారని, రేపు రెండు రాష్ట్రాలను విలీనం చేయాలని అడుగుతారంటూ ఏదో గొడవలు సృష్టిస్తారన్న ఆలోచనతోనే ఈ నాటకానికి తెర లేపారని రఘురామకృష్ణ రాజు అన్నారు. అదేమీ కుదరదని, తెలంగాణలో సుస్థిర ప్రభుత్వం ఉందని, జగన్ మోహన్ రెడ్డి , తెలంగాణ మాజీ పాలకుల మధ్య మంచి అండర్స్టాండింగే ఉందని, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న బకాయిలు సెటిల్ చేయమని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ని కోరుతారని, అసలు రెండు రాష్ట్రాల మధ్య బకాయిలను సెటిల్ చేయడానికి నిర్మలా సీతారామన్ కి ఏమిటి సంబంధమని రఘురామకృష్ణ రాజు ప్రశ్నించారు.

వాళ్ళిద్దరూ తోడు దొంగలే…
గతంలో తనను అరెస్టు చేసినప్పుడు జగన్ మోహన్ రెడ్డి తెలంగాణలో ఎవరితో మాట్లాడారో తెలుసునని రఘురామకృష్ణ రాజు తెలిపారు. డిజి అనుమతి తీసుకుని నియమ నిబంధనలన్నీ ఉల్లంఘించి తనను అక్రమంగా నిర్బంధించారని, ఆ తర్వాత సైబరాబాద్ సీపీగా వ్యవహరించిన స్టీఫెన్ రవీంద్ర సహకారంతో తనను అంతమొందించాలని చూశారని, నకిలీ పోలీసులు తన ఇంటి వద్ద రెక్కీ నిర్వహిస్తుండగా తనకు రక్షణగా ఉన్న సి ఆర్ పి ఎఫ్ పోలీసు బలగాలు వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించారని, అప్పుడు తన ఉంగరం పోయిందని నకిలీ పోలీసు చేసిన ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు తనపై, టీతన కుమారుడిపై తిరిగి కేసులు నమోదు చేశారని తెలిపారు. ఈ కేసులో హైకోర్టులో స్టే లభించకపోతే, సుప్రీంకోర్టును ఆశ్రయించి స్టే తీసుకోవలసి వచ్చిందని అన్నారు. జగన్ మోహన్ రెడ్డితో తెలంగాణ పోలీసులు, అక్కడి నాయకులు కుమ్మక్కయ్యారని, వీరంతా తోడుదొంగలేనని, సీతారామాంజనేయులు , తెలంగాణ డిజితో మాట్లాడారని అన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా సెక్యూరిటీ కోసం తన ఇంటి బయట పోలీసులను కాపలాగా పెట్టారని, గచ్చిబౌలి ఎక్కడా?, బేగంపేట ఎక్కడా?? అని ప్రశ్నించిన రఘురామకృష్ణ రాజు , మోడీ హైదరాబాదు నుంచి వెళ్లిపోయిన తర్వాత తన ఇంటి వద్ద కాపలా పెట్టిన వ్యక్తి ఎవరికో ఉప్పందించడానికి తచ్చాడుతూ తిరుగుతూ ఉంటే, సిఆర్పిఎఫ్ పోలీసులు పట్టుకొని ఐడి కార్డు చూపించాలని ప్రశ్నిస్తే… తమ పైనే కేసులు పెట్టి అరెస్టు చేయాలని చూశారన్నారు.
యుద్ధ ప్రాతిపదికన అమరావతి, పోలవరం నిర్మాణం…
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని రెండు నెలల్లో ప్రజలు పార్సిల్ చేసి ఇంటికి పంపించనున్నారని రఘురామకృష్ణ రాజు అన్నారు. నూతన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో యుద్ధ ప్రాతిపదికన అమరావతి నిర్మాణంతో పాటు, జగన్ మోహన్ రెడ్డి నడిసముద్రంలో వదిలేసిన పోలవరం ప్రాజెక్టును మొదటి ప్రాధాన్యతగా పూర్తి చేస్తారన్నారు. చంద్రబాబు నాయుడు అభివృద్ధి కాముకుడని, అమరావతి నగరాన్ని ఏదో రకంగా సమాధి చేయాలనుకుంటున్న జగన్ మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ ఆశలు అడియాసలే అవుతాయని అన్నారు. అమరావతి నగరాన్ని రాష్ట్ర రాజధానిగా, పారిశ్రామికంగా విశాఖపట్నం, కాకినాడ కారిడార్ ను అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రాన్ని తిరిగి ప్రగతి పథంలో నడిపించడానికి తమ వద్ద ప్రణాళికలు ఉన్నాయని చెప్పారు.

బూట్లు వేసుకున్న అధికారులు పనికిమాలిన రాజకీయ నాయకుల చెప్పులు తుడుస్తున్నారు…
బూట్లు వేసుకునే అధికారులు పనికిమాలిన రాజకీయ నాయకుల చెప్పులను తుడుస్తున్నారని రఘురామకృష్ణ రాజు ఫైర్ అయ్యారు. తిరుపతిలో ఎంతో ఫ్రాడ్ చేసిన పోలీసులపై పెట్టిన కేసులో భాగంగా సిఐ, ఎస్ఐ లను సస్పెండ్ చేశారని, ఎస్పీ సహకారం లేకుండానే ఫ్రాడ్ చేయడానికి వారికి సాధ్యమవుతుందా? అని ప్రశ్నించారు. ఎక్స్, వై, వై ఎస్ జె లాంటి నాయకులు చెప్పకపోతే వారికి ఎందుకు ఇంట్రెస్ట్ ఉంటుందని నిలదీశారు. ఇలాంటి లుచ్చా పనులకు సహాయం చేయడానికి అధికారులు సహకరించవద్దని సూచించారు.

ప్రాధాన్యత కలిగిన పోస్టుల కోసం కక్కుర్తి పడి, అధికారంలో ఉన్న వారు చెప్పినట్లు చేస్తే అధికారులే బలవుతారని, ఎన్నికల కమిషన్ కూడా వారిని బలి చేస్తుందని అన్నారు. రాజకీయ నాయకులను బలి చేయలేదు కాబట్టి అధికారులపైనే ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుందని గుర్తు చేశారు. అధికారంలో ఉన్న అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా దూరంగా ఉండాలని లేదంటే ఇలాగే బలవుతారని అన్నారు. పరమేశ్వర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, అమ్మి రెడ్డి, విజయ రావు, పకీరప్ప, అన్బురాజ్, రఘురామిరెడ్డి వంటి అధికారులు రేపు ఎన్నికల విధుల్లో ఉంటారనుకోవడం అత్యాశే అని, ఎందుకంటే వారి చరిత్ర రెడీగా ఉందని, పేపర్ కటింగ్ లతో సహా ఎన్నికల కమిషన్ కి నివేదిస్తామని తెలిపారు.

డిజి ర్యాంక్ అధికారులకు ఇచ్చే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బాధ్యతలను రఘురామిరెడ్డికి అప్పగించడం ఆశ్చర్యకరంగా ఉందని, డిఐజి నుంచి ఐజిగా పదోన్నతి పొందిన వెంటనే రఘురామిరెడ్డికి కీలక పదవి బాధ్యతలను కట్టబెట్టడం వెనుక ఆంతర్యం ఏమిటి? అని, అలాగే డ్రగ్ కంట్రోలర్ పోస్ట్ లో కూడా ఆయన్ని కొనసాగించడానికి కేవలం నారాయణ కాలేజీలపై దాడి చేయడానికేనని అర్థమవుతూనే ఉందని అన్నారు. నారాయణ మెడికల్ కాలేజీలో, మందుల షాపు ఉంటుందని తెలుసునని, అందుకే రఘురామిరెడ్డిని డ్రగ్ కంట్రోలర్ గా కొనసాగిస్తూ, ఆ కాలేజిపై దాడి చేయించి నానా కంపు చేశారట అని అన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలో నుంచి దిగిపోయిన తర్వాత కేంద్ర సర్వీసులకు వెళ్తామంటే కుదరదని, పోలీసు సర్వీసులోకి ఎందుకు వచ్చామని బాధపడే విధంగా శిక్షిస్తామన్నారు.

ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్ కు నివేదించిన పురంధేశ్వరి …
దొంగ ఓట్లపై ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి నివేదించారని రఘురామకృష్ణ రాజు తెలిపారు. చిలకలూరి పేట నుంచి గుంటూరుకు పదివేల ఓట్లను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజిని బదిలీ చేసినట్లు తెలిసిందని, ఆ మాత్రం దానికి జగన్ మోహన్ రెడ్డి ఆమెను చిలకలూరి పేట నుంచి గుంటూరుకు మార్చే బదులు, ఇక్కడే కొనసాగించవచ్చు కదా… ఓట్లను మార్చడం ఎందుకని రఘురామకృష్ణ రాజు అపహాస్యం చేశారు.

చిలకలూరిపేట నుంచి గుంటూరుకు మారుస్తున్న ఓట్లను జీరో నెంబర్ ఇంటి నెంబర్లపై నమోదు చేసే అవకాశం ఉందని, చిలకలూరి పేట లోను, గుంటూరులోనూ వారికి ఓట్లు ఉండే అవకాశం ఉందని, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి కూడా పొన్నూరుతో పాటు మంగళగిరి నియోజకవర్గంలోనూ ఓట్లు ఉన్నట్లు తెలిసిందని చెప్పారు. వేలకు వేల ఓట్లు ఇలాగే అన్ని నియోజకవర్గాలలోనూ నమోదు చేయించే విధంగా వైకాపా నాయకులు ప్రణాళికలు రచిస్తున్నారని, ఎన్ని చోట్ల ఇలా ఓట్లు నమోదు చేశారన్న దానిపై పురంధేశ్వరి ఎన్నికల కమిషన్ కు నివేదిస్తారేమోనని అన్నారు. ఒకవేళ ఆమె తీసుకు వెళ్ళని పక్షంలో తాను తీసుకువెళ్తానని తెలిపారు. ఎన్ని ఫ్రాడ్లు చేసినా అడ్డంగా దొరికిపోవడం ఖాయమని, ఇకనైనా ఇటువంటి నీచ రాజకీయాలు, దిగజారిన రాజకీయాలు చేయడం మానివేయాలని, దొంగ ఓట్ల నమోదుకు ఇకనైనా బ్రేకులు వేసుకుంటే మంచిదని, లేకపోతే ఎలా బ్రేకులు వేయాలో తమకు తెలుసునని అన్నారు.

వైకాపా ఖాళీ అవుతుందని ముందే చెప్పా…
ఎన్నికల ముందు వైకాపా ఖాళీ అవుతుందని తాను ఐదారు నెలల క్రితమే చెప్పానని రఘురామకృష్ణ రాజు గుర్తు చేశారు. వైకాపా నాయకుల్లో ఎంత అసంతృప్తి ఉందో తనకు ముందే తెలుసునని, సీనియర్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని దారుణంగా అవమానించారని, నమస్కారం పెడితే, ప్రతి నమస్కారం చేయడం అన్నది సమస్కారమని, ఆ సంస్కారం వైకాపా నాయకులకు లేదని అన్నారు. మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కూడా పార్టీ వీడనున్నారని తెలుస్తోందని, అలాగే పార్టీకి ఎంతో ఆర్థిక సహాయ సహకారాలు అందజేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా పార్టీ వీడనున్నారట అని అన్నారు. ఆనం రామనారాయణ రెడ్డిని, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని, చంద్రశేఖర్ రెడ్డి ని ఇప్పటికే దూరం చేసుకున్నారని, కృష్ణాజిల్లాలో కృష్ణ ప్రసాద్ తో పాటు పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారధి గారు ఇలా చెప్పుకుంటూ పోతే ఒకరా ఇద్దరా ఎంతో మంది పార్టీ నుంచి వలసలు వెళ్లారని అన్నారు. అంతా ఒకే ఒక నాయకుడి నడవడిక వల్లేనని… ఏమీ చేయకుండానే చేశామని చెప్పడం వల్ల ప్రజలు గుడ్డిగా నమ్మరని, మరో 65 రోజుల్లో ఎన్నికలు వచ్చేస్తాయని, మే 15వ తేదీ నాటికి ఎన్నికల ఫలితాలు కూడా వెలువడుతాయని, ఆ తర్వాత వైకాపా పరిస్థితి ఏమిటో అందరికీ తెలిసిందేనని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు.

Leave a Reply