పార్టీపై జగన్‌కు పట్టు పోయిందా?

– ఉమ్మడి హైదరాబాద్ డిమాండ్ పరువు తీసిన అగ్రనేతలు
– హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలన్న వైవి సుబ్బారెడ్డి
– ఇప్పట్లో విశాఖ రాజధాని కాదని స్పష్టం చేసిన సుబ్బారెడ్డి
– అప్పటిదాకా హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిని చేయాలని డిమాండ్
– రెండేళ్లు పొడిగిస్తే చాలట
– దానికోసం పార్లమెంటులో పోరాడతామని వెల్లడి
– మేనిఫెస్టోలో కూడా చేరుస్తామని ప్రకటన
– సుబ్బారెడ్డి ప్రకటనతో పార్టీకి సంబంధం లేదన్న మంత్రి బొత్స
– ఉమ్మడి రాజధాని వైసీపీ విధానం కాదని సత్తిబాబు స్పష్టీకరణ
– అనుభవం ఉన్న నేత ఎవరైనా అలా చెబుతారా అని ఎదురుదాడి
– ఇంతజరుగుతున్నా పార్టీ అధినేతగా స్పందించని జగన్
– పార్టీ విధాన నిర్ణయాలు జగన్ ప్రకటించరా?
– ఇంతకూ ఉమ్మడి రాజధానిపై బాబాయ్‌ది కరెక్టా? బొత్సది రైటా?
– గందరగోళంలో వైసీపీ నేతలు
– జగన్ మీడియాలో కనిపించని సుబ్బారెడ్డి వార్త
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఆయన సీఎం కమ్ వైసీపీ అధినేత జగన్‌కు స్వయంగా బాబాయ్. అంతకుమించి.. పార్టీని చక్కదిద్దేందుకు జగన్ నియమించిన ప్రాంతీయ సమన్వయకర్తల్లో ఒకరు. ఉత్తరాంధ్ర అంతా ఆయన ఏలుబడిలోనే ఉంది. అంటే మరి బాబాయ్ పవర్‌ఫుల్లేనన్నమాట. ఆ ప్రకారంగా జగన్‌తో చర్చించి నిర్ణయం ప్రకటిస్తారన్నమాట. మరి అంతలావు బాబాయ్.. అబ్బాయ్ జగన్‌ను అడ్డంగా ఇరికించేశారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌నే మరికొన్నేళ్లు కొనసాగించాలన్నది వైసీపీ విధానమని ప్రకటించి.. ఉన్న వివాదాలు సరిపోనట్లు, కొత్త వివాదాన్ని రగిలించారు.

ఫలితంగా వైసీపీపై ఆంధ్రా-తెలంగాణ నుంచి జమిలిగా విమర్శల జడివాన వెల్లువెత్తింది. దానితో మంత్రి బొత్స రంగంలోకి దిగి, ‘‘ఛస్.. అసలు సుబ్బారెడ్డి ప్రకటనతో పార్టీకి సంబంధం లేదు. తమ పార్టీది ఉమ్మడి రాజధాని విధానం కాద’’ని, చావు కబురుచల్లగా చెప్పి.. అటు బాబాయ్‌ను ఇటు అబ్బాయ్‌నీ జాయింట్‌గా ఇరికించేశారు. సత్తిబాబు కూడా సుబ్బారెడ్డి లెక్క ఒక సమన్వయకర్తనేమరి. ఒక కీలక అంశంపై పార్టీలో ఇంత వివాదం జరుగుతున్నా, అధినేతగా జగన్ పెదవి విప్పకపోవడమే ఆశ్చర్యం.

ఒక సమన్వయకర్త వ్యాఖ్యలను, మరో సమన్వయకర్త కొట్టిపారేయడమంటే… పార్టీపై జగన్‌కు పట్టు ఉందా? లేదా? ఉంటే ఒకే అంశంపై ఇద్దరు అగ్రనేతలు భిన్నవ్యాఖ్యలు ఎలా చేస్తారు? మరి అవి జగన్‌కు చెప్పి చేశారా? చెప్పకుండా చేశారా? చెప్పకుండా ప్రకటనలు చేసేవారిని జగన్ అసలు సహించరు. మరి బాబాయ్ ఇప్పుడు అదే పనిచేశారు. మరి బాబాయ్‌ను, అబ్బాయ్ ఏమంటారో చూడాలి.

అసలు విధాన నిర్ణయం ప్రకటించాల్సిన అధినేత మౌనంగా ఉండే పార్టీ, దేశంలో తమదొక్కటేనన్నది వైసీపీ అగ్రనేతల ఉవాచ. ఇంత జరుగుతున్నా పార్టీ క్రమశిక్షణా కమిటీ అధ్యక్షుడు ఏమయ్యారు? ఇవన్నీ కలసి వెరసి పార్టీపై, జగన్‌కు పట్టు పోయిందన్న సంకేతాలు వెళ్లడమేనన్నది వారి ఆందోళన.

వైసీపీ సమన్వయకర్త- రాజ్యసభ అభ్యర్ధి, వాటికి మించి సీఎం జగన్ బాబాయ్ అయిన వైవి సుబ్బారెడ్డి లేవె నెత్తిన, ఉమ్మడి రాజధాని హైదరాబాద్ డిమాండ్ వైసీపీకి పితలాటకంగా మారింది. ఉమ్మడి రాజధాని అంశాన్ని మేనిఫెస్టోలో చే రుస్తామని, పార్లమెంటులో కూడా పోరాడతామని సుబ్బారెడ్డి సెలవిచ్చారు.

జూన్‌లో పదేళ్ల హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి, విభజనట్టం ప్రకారం గడువు ముగుస్తుంది. దానిని మళ్లీ పొడిగించడం రేవంత్‌రెడ్డి-జగన్మోహన్‌రెడ్డి చేతుల్లో లేదు. మళ్లీ పార్లమెంటులో దానిని చట్టం చేయాల్సిందే. అది జగన్ అండ్ కో తరచూ చేసే, ‘మూడు రాజధానుల యవ్వారం’లా ఉండదు. అన్నీ చట్టానికి లోబడి నిర్ణయించాల్సిందే.

కానీ సుబ్బారెడ్డి మాత్రం మరో రెండళ్లయినా హైదరాబాద్‌ను, ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని చేసిన వ్యాఖ్య బూమెరాంగ్ అయింది. ఎన్నికల్లో ఎలాగూ ఓడిపోతున్నందున, ఈ అంశంతోనయినా సెంటిమెంటు రగిలించి, లబ్థి పొందాలన్నది వైసీపీ దురాలోచన అన్న విమర్శలు వెల్లువెత్తాయి.

మరోవైపు తెలంగాణలో అధికారం కోల్పోయిన తన మిత్రుడు కేసీఆర్‌కు.. పార్లమెంటు ఎన్నికల్లో లబ్థి కలిగించేలా, ఒక సెంటిమెంటు అస్త్రాన్ని జగన్ ఇచ్చారన్న మరికొన్ని విమర్శలు వినిపించాయి. దానికి తగినట్లే.. బీఆర్‌ఎస్‌కు చెందిన మాజీ మంత్రులు-ఎమ్మెల్యేలు , హైదరాబాద్‌నుఉమ్మడి రాజధాని ఎలా చేస్తారంటూ సెంటిమెంట్ పల్లవి అందుకున్నారు.

ఇదేదో పార్టీ కొంపముంచేలా ఉందని గ్రహించిన సీనియర్ మంత్రి, పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త బొత్స సత్తిబాబు రంగంలోకి దిగారు. సుబ్బారెడ్డి ప్రకటనను త్రోసిపుచ్చారు. అసలు ఉమ్మడి హైదరాబాద్ రాజధాని అంశం, తమ పార్టీ విధానం కాదని కుండబద్దలు కొట్టారు. అనుభవం ఉన్న నేత ఎవరైనా అలా చెబుతారా? పదేళ్ల తర్వాత హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిని చేయడం ఎలా సాధ్యమవుతుంది? సుబ్బారెడ్డి మాటలను మీడియా వక్రీకరించింది’’అని సత్తిబాబు చేసిన ప్రకటన, సుబ్బారెడ్డి పరువు తీసినట్టయింది. కానీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యల వీడియో.. ఇంకా సోషల్‌మీడియాలో ఇంకా సర్క్యులేట్ అవుతుందన్న విషయం, ‘ఇంగ్లీషు అనర్గళంగా మాట్లాడే’ సత్తిబాబుకు తెలియకపోవడమే వింత.

అయితే సీఎం-పార్టీ అధినేత జగన్ అనుమతి లేకుండానే.. సుబ్బారెడ్డి ఇలాంటి కీలక ప్రకటన చేయడం అసంభవమని, పార్టీ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఇది రెండు రాష్ట్రాలకు-సెంటిమెంటుకు సంబంధించిన అంశమని గుర్తు చేస్తున్నారు. జగన్ ఆదేశాలు లేకుండా ఒక సమన్వయకర్త, ఇలాంటి ప్రకటనలు చేసే ధైర్యం చేయరని సీనియర్లు స్పష్టం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే విమర్శలు మొదలవడం, వైసీపీ వర్గాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

అసలు విభజన సమస్యలు పూర్తిగా పరిష్కరించకుండానే, నాటి తెలంగాణ సీఎం కేసీఆర్ కోరకపోయినా సచివాలయంపై ఏపి హక్కును జగన్ వదులుకున్న వైనం, మళ్లీ ఇప్పుడు తెరపైకి వచ్చింది. దానికంటే ప్రధానంగా.. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జగన్ బినామీ ఆస్తులు కాపాడుకునేందుకే , సుబ్బారెడ్డి ఈ డిమాండ్‌ను తెరపైకి తెచ్చారన్న ఆరోపణలూ మొదలయ్యాయి. ఇక వేల కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు, హైదరాబాద్‌లో ఆర్టీసీకి స్థలాల కేటాయింపు వంటి విభజన సమస్యల పరిష్కార అంశాలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. వీటిని కేసీఆర్‌పై ఒత్తిడి చేయడంలో జగన్ విఫలమైన అంశాలు, సుబ్బారెడ్డి వ్యాఖ్యల పుణ్యాన మళ్లీ తెరపైకి వచ్చాయని వైసీపీ నేతలు తలపట్టుకుంటున్నారు.

తెలంగాణలో ఎన్నికల రోజు నాగార్జనసాగర్ డ్యాం పైకి ఏపీ పోలీసులను పంపడం ద్వారా.. భావోద్వేగాలు రెచ్చగొట్టి, కేసీఆర్‌కు మేలు కలిగించేందుకు చేసిన ప్రయత్నం వివాదమయింది. ఇప్పుడు దానిని తెలంగాణ కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు.
అసలు ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన అమరావతి రాజధాని కాకుండా.. మూడు రాజధానుల ముచ్చటను తెరపైకి తెచ్చిందే వైసీపీ అన్న చర్చ, సుబ్బారెడ్డి ప్రకటన పుణ్యాన మళ్లీ తెరపైకి వ చ్చింది.

‘అమరావతినే రాజధానిగా కొనసాగించి ఉంటే, మళ్లీ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అవసరం ఎందుకొస్తుంద’న్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ ఇంట్లో జగన్ బిర్యానీ తిన్నప్పుడు.. రోజా ఇంట్లో కేసీఆర్ చేపలపులుసు తిన్నప్పుడే ఉమ్మడి రాజధాని ప్రస్తావన తెచ్చిఉండాల్సిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

అప్పుడు కేంద్రంకూడా ఇద్దరితో సఖ్యతగా ఉన్నందున, ఉమ్మడి రాజధాని వచ్చేదన్న చర్చ కూడా మొదలయింది. అప్పుడు డిమాండ్ చేయకుండా.. లోక్‌సభ పదవీకాలం ముగిసేముందు ఉమ్మడి రాజధాని డిమాండ్ చేయడం, కేసీఆర్‌కు మళ్లీ ‘భావోద్వేగ బహుమతి’ ఇవ్వడమేనంటున్నారు.

వీటిని పక్కనపెడితే.. అసలు సొంత పార్టీలో ఇద్దరు సమానస్థాయి నేతలు పరస్పర భిన్నమైన ప్రకటనలు చేస్తుంటే, పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జగన్ మౌనంగా ఉండటమే సీనియర్లను విస్మయపరుస్తోంది. పార్టీ విధాన నిర్ణయాలను ఏ పార్టీలో అయినా, అధ్యక్షుడే స్వయంగా మీడియా ముందుకొచ్చి ప్రకటిస్తారు. కీలక అంశాలయితే అధ్యక్షుడు మాత్రమే మాట్లాడతారు. కేఏ పాల్ లాంటి వాళ్లు కూడా అదే చేస్తుంటారు.

కానీ వైసీపీ అందుకు భిన్నం. సరే ఎలాగూ జగన్‌కు మీడియా ముందుకు వచ్చే మాట్లాడే అలవాటు లేదు కాబట్టి, కనీసం ఆయన పేరున ప్రకటనయినా విడుదల చేయవచ్చు. ఈ రెంటిలో ఏదీ కాకుండా.. సమన్వయకర్తలు, ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేరు మీద ప్రకటనలు- ప్రెస్‌మీట్లు పెట్టే విచిత్రం, ఒక్క తమ పార్టీలోనే ఉందని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం అత్యంత కీలకమైన ఉమ్మడి రాజధాని అంశాన్ని తన బాబాయ్ సుబ్బారెడ్డి వివాదం చేసిన తర్వాత కూడా, జగన్ మౌనంగా ఉన్నారంటే.. ఆయనకు పార్టీపై పట్టు తప్పిందన్న అనుమానాలకు మరింత బలం చేకూరుతోందని మరికొందరు సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.

‘ఇందులో రెండు అంశాలు. ఒకటి జగన్ అనుమతితోనే సుబ్బారెడ్డి మాట్లాడి ఉండాలి. అందుకే జగన్ మౌనంగా ఉన్నారు. రెండు. బొత్సకు ఈ విషయం తెలియకుండా.. ఏదో పార్టీని కాపాడదామన్న ఆత్రుతతో, సుబ్బారెడ్డి ప్రకటనను ఖండించి ఉండవచ్చు. మళ్లీ సుబ్బారెడ్డి మంత్రి బొత్స వ్యాఖ్యలను ఖండించి, తన మాటకు కట్టుబడి ఉంటానని కూడా ప్రకటించలేదు. అయినా ఇద్దరూ మామాలుగానే జగన్‌తో మాట్లాడుతున్నారు. అంటే ఇద్దరితో జగనే మాట్లాడిస్తున్నట్లు మేం అర్ధం చేసుకోవాలన్నమాట’ అని, గుంటూరు జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి అసలు విషయం వెల్లడించారు.

సుబ్బారెడ్డి చేసిన ప్రకటనను సహజంగా అన్ని పత్రికలూ, చానెళ్లూ ప్రముఖంగా ప్రచురించాయి. కానీ విచ్రితంగా జగన్ మీడియాలో మాత్రం.. సుబ్బారెడ్డి చేసిన ఉమ్మడి హైదరాబాద్ డిమాండ్ వార్త, భూతద్దం పెట్టి వెతికినా కనిపించకపోవడమే వింత. అంటే మిగిలిన మీడియాలో వచ్చే వార్తలపై రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు వేసిన ఎత్తుగడగా అనుమానించాలేమో?!

One thought on “పార్టీపై జగన్‌కు పట్టు పోయిందా?

Leave a Reply