Suryaa.co.in

Editorial

పెద్దిరెడ్డి..సాయిరెడ్డి వైసీపీ పుట్టి ముంచుతున్నారా?

– జగన్‌ను ప్రశ్నించలేక పార్టీని ఇరికిస్తున్నారా?
– విపక్షాలకు వారిద్దరూ పరోక్షంగా అస్త్రాలు అందిస్తున్నారా?
– ఎన్నికల వేళ లోకల్-నాన్ లోకల్ నినాదాలేమిటి?
– ఇప్పటికే జిల్లాలు మార్చి అభ్యర్ధులను ప్రకటిస్తున్న జగన్
– వేరే నియోజకవర్గాల్లో పోటీ చేయిస్తున్న వైనం
– మరి ఆ బాణాలు తగిలేది మనకే కదా?
– వైసీపీ అభ్యర్ధులపై నాన్ లోకల్ నినాదం ప్రమాదమే
– బీజేపీ నేత సత్యకుమార్ ఏపీలో ఎలా పోటీ చేస్తారన్న పెద్దిరెడ్డి
– విజయమ్మ వైజాగ్‌లో ఎలా పోటీ చేశారని సత్య ఎదురుదాడి
– మంగళగిరిలో విజయసాయిరెడ్డి లోకల్- నాన్ లోకల్ వివాదం
– ఇప్పటికే మంత్రులు, ఎంపీలను జిల్లాలు-నియోజకర్గాలు మార్చిన జగన్
– మరి వారికీ నాన్ లోకల్ కార్డు వర్తిస్తుంది కదా?
– సాయిరెడ్డి-పెద్దిరెడ్డి పార్టీకి మేలు చేస్తున్నారా? కీడు చేస్తున్నారా?
– పార్టీ వర్గాల్లో బూమెరాంగ్ అవుతున్న ‘పెద్దరెడ్ల’ వ్యాఖ్యలు
– వారి నియోజకవర్గాలను దృష్టిలో ఉంచుకుంటే ఎలా?
– తలపట్టుకుంటున్న వైసీపీ సీనియర్లు
– వైసీపీలో రివర్సవుతున్న నాన్‌లోకల్ స్లో‘గన్’
( మార్తి సుబ్రహ్మణ్యం)

‘ఇంతకూ నన్ను తిడతాన్రా.. పొగడ్తాన్రా’.. ఇది అప్పుడెప్పుడో విడుదలైన ప్రతిఘటన సినిమాలో, కోట శ్రీనివాసరావు డైలాగ్. వేదికపై ఉన్న నేతను ఒకవైపు పొగుడుతూనే.. మరోవైపు తెగిడే మాటలు విని, సదరు నేత అయోమయంతో విసిరిన డైలాగులవి. అప్పట్లో ఈ డైలాగు బాగా పాప్యులారిటీ అయింది.

ఇప్పుడు అచ్చం అలాంటి పరిస్థితే.. ఏపీలో వైసీపీ అధినేత-కమ్ సీఎం జగన్‌ది. పార్టీలో కీలక వ్యక్తులే అడ్డగోలుగా మాట్లాడి, పార్టీ పుట్టిముంచుతున్నారన్నది వైసీపీ నేతల గగ్గోలు. వారిపై అధినేతకు నియంత్రణ లేకపోవడంతో ఎన్నికల్లో పార్టీ మూల్యం చెల్లించుకోకతప్పదని పార్టీ సీనియర్ల హెచ్చరిక. మొన్న వైవి సుబ్బారెడ్డి ఉమ్మడి రాజధానిపై మాట్లాడి పార్టీ పరువుతీశారు. ఇప్పుడు మంత్రి పెద్దిరెడ్డి-ఎంపి సాయిరెడ్డి లేవనెత్తిన నాన్‌లోకల్ స్లో‘గన్’ గురి తప్పి, సొంత పార్టీలోనే పేలడం చర్చనీయాంశంగా మారింది.

రాజకీయాల్లో ఒక అంశం ప్రస్తావించేముందు, దాని ప్రభావం సొంత పార్టీపై ఏ మేరకు పడుతుందని ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. ఎందుకంటే ఆ అస్త్రం తిరిగి తమ పార్టీకే ఎదురుతిరగకూడదు కాబట్టి. అందుకే ఏ పార్టీలో అయినా సీనియర్లు, ఆయా అంశాలపై కూలంకషంగా చర్చిస్తారు. కానీ వైసీపీలో అలా చర్చించే అలవాటు, తొలి నుంచీ లేదు.

బోలెడుమంది తలపండిన సీనియర్లు ఉన్నా, వారితో చర్చించే అలవాటు లేదు. కేవలం ఇద్దరు మాత్రమే వాటిని నిర్ణయిస్తే, మిగిలిన వారు అమలుచేస్తుంటారు. అందుకే వైసీపీ నేతల వ్యాఖ్యలు బూమెరాంగవుతుంటాయి. ఇప్పుడూ అంతే. స్థానిక-స్థానికేతర నినాదం తెరపైకి తెచ్చిన మంత్రి పెద్దిరెడ్డి-ఎంపి విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు, పార్టీ పుట్టిముంచే పరిస్థితికి తెచ్చాయన్నది సీనియర్ల గగ్గోలు.

మంగళగిరిలో టీడీపీ యువనేత లోకేష్‌ను ఓడించేందుకు… రంగంలోకి దిగిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, తాజాగా లోకేష్‌పై స్థానికేతర అంశం సంధించారు. ‘మంగళగిరి శాసనసభ్యునిగా స్థానికంగా ఉండే వ్యక్తి కావాలా? లేక స్థానికేతరుడు కావాలో మీరే నిర్ణయించుకోండి’ అని సాయిరెడ్డి చేసిన ట్వీట్, వైసీపీ కొంపముంచేలా ఉందని ఆ పార్టీ సీనియర్లు తలపట్టుకుంటున్నారు. ఇక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా.. ‘ఏపీతో సంబంధం లేని సత్యకుమార్ ఏపీలో ఎలా పోటీ చేస్తారు?’ అని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ను ప్రశ్నించి, మరో తేనెతుట్టె కదిపారు.

హిందూపురం బీజేపీ ఎంపీగా పోటీకి సిద్ధమవుతున్న సత్యకుమార్ దూకుడుకు బ్రేకులు వేయడమే ఆ నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి పెద్దిరెడ్డి లక్ష్యంగా కనిపిస్తోంది. ఇప్పటికే సత్యకుమార్ పొత్తులతో సంబంధం లేకుండా హిందూపురంలో చాపకింద నీరులా శరవేగంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బహుశా పెద్దిరెడ్డి కలవరానికి ఇది కూడా ఒక కారణం కావచ్చంటున్నారు.

వీరిద్దరి వ్యాఖ్యలు బూమెరాంగయి.. అవి అటు తిరిగి ఇటు తిరిగి పార్టీకే తగలడంతో, సీనియర్లు తలపట్టుకుంటున్నారు. ఇప్పటికే మంత్రి విడదల రజని, ఉషాశ్రీచరణ్, నాగార్జున, సురేష్ ..ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, అన్నా రాంబాబు, నాగార్జున రెడ్డిని జిల్లాలు-నియోజకవర్గాలే మార్చిన వైనాన్ని, పెద్దిరెడ్డి-సాయిరెడ్డి మర్చిపోవడమే విచిత్రం. ఇప్పుడు వారిద్దరి వ్యాఖ్యలు నియోజకవర్గాలు మారిన అభ్యర్ధులకు ప్రాణసంకటంలా పరిణమించాయి.

తనపై పెద్దిరెడ్డి చేసిన విమర్శకు, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఘాటుగా స్పందించారు. ‘గత ఎన్నికల్లో విజయమ్మ స్థానికురాలని విశాఖ నుంచి పోటీ చేయించారా’? అంటూ ప్రశ్నించడంతో, వైసీపీ శిబిరం నుంచి దానికి జవాబు కరవయింది. వైఎస్ జీవించిన సమయంలో సోనియాగాంధీని.. ఉమ్మడి రాష్ట్రం నుంచి పోటీ చేయాలని అభ్యర్ధించిన వైనం, ఇప్పుడు సాయిరెడ్డి-పెద్దిరెడ్డి వ్యాఖ్యల పుణ్యమాని తెరపైకి వచ్చింది. అసలు భారతీయురాలే కాని సోనియాగాంధీని ఆనాడు ఏపీ నుంచి పోటీ చేయమని వైఎస్ కోరడం కూడా పెద్దిరెడ్డి-సాయిరెడ్డి దృష్టిలో తప్పేనా? అన్న ప్రశ్న తెరపైకి వచ్చింది.

ఇక వైసీపీలో ప్రాధమిక సభ్యత్వం కూడా లేని, ఇతర రాష్ట్రానికి చెందిన పరిమళ నత్వానీ, ఆర్.కృష్ణయ్యకు రాజ్యసభ సభ్యత్వం ఎలా ఇచ్చారు? వాళ్లు ఏపీకి సంబంధించిన వారు కాదు కదా? అన్న చర్చ సహజంగానే తెరపైకి వచ్చింది. పైగా వైఎస్ మృతి వెనుక రిలయన్స్ హస్తం ఉందని ఆనాడు వైఎస్ కుటుంబం రోడ్డెక్కి కూడైకూసింది. రిలయన్స్ షాపులను వైఎస్ అభిమానులు ధ్వంసం చేశారు. మరి అదే రిలయన్స్‌కు చెందిన నత్వానీకి రాజ్యసభ సీట్లు ఎలా ఇచ్చారు?

పెద్దిరెడ్డి-సాయిరెడ్డి మాటల ప్రకారమైతే… వారిద్దరికీ ఎంపీ పదవులిచ్చిన జగన్ నిర్ణయం తప్పని ఇప్పుడు చెబుతున్నారా? మరి ఆ రకంగా సత్యకుమార్‌ను విమర్శించిన పెద్దిరెడ్డి, సొంత పార్టీ అధినేతని ఇరికించినట్లే కదా? గత ఎన్నికల్లో పులివెందులకు చెందిన విజయమ్మను విశాఖ ఎంపీగా నిలబెట్టిన జగన్‌ను కూడా, సాయిరెడ్డి విమర్శించినట్లే లెక్క అన్నది వైసీపీ సీనియర్ల ఉవాచ.

ఇప్పటికి 7 జాబితాలతో 80 మందిని మార్చారు. అందులో 30 మందికి టికెట్లు ఇవ్వలేదు. మిగిలిన వారిని అటు ఇటూ మారుస్తున్నారు. మంత్రి విడదల రజని, ఉషాశ్రీచరణ్, నాగార్జున, సురేష్… ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, అన్నా రాంబాబు, నాగార్జునరెడ్డిని వేరే నియోజకవర్గాలకు ఎమ్మెల్యే-ఎంపీ అభ్యర్ధులుగా పంపిస్తున్నారు. ఇంకా విడుదలయ్యే జాబితాల్లో ఎంతమందిని మారుస్తారు? ఇతర నియోజకవర్గాలకు ట్రాన్స్‌ఫర్ చేస్తారో తెలియదు.

ఆ లెక్కన నియోజకవర్గాలు మారే వీరంతా స్థానికేతరులేనన్నది సుస్పష్టం. మరి నియోజకవర్గాలు మారిన స్థానికేతర వైసీపీ అభ్యర్ధులందరినీ ఓడించమని పిలుపునివ్వడమే, పెద్దిరెడ్డి-సాయిరెడ్డి లక్ష్యమా? అన్న ప్రశ్నలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

నిశితంగా పరిశీలిస్తే వీరంతా పార్టీ అధినేత జగన్ నిర్ణయాలు ప్రశ్నించలేక.. నేరుగా విమర్శించలేక.. ప్రత్యర్ధులను విమర్శించే పనిలో, వారికి కావాలనే అస్త్రాలు అందిస్తున్నారన్న వ్యాఖ్యలు సీనియర్ల నుంచి వినిపిస్తున్నాయి. ఆ రకంగా చూస్తే వైవి సుబ్బారెడ్డి- పెద్దిరెడ్డి-సాయిరెడ్డి- అంబటి రాంబాబు వంటి నేతల వ్యాఖ్యలు, జగన్‌ను నిండా ముంచుతున్నాయని స్పష్టం చేస్తున్నారు.

ఇక ఇటీవలి కాలంలో మంత్రి అంబటి రాంబాబు చేస్తున్న ట్వీట్లు.. సోషల్‌మీడియాలో ప్రత్యర్థులు, జగన్‌ను తిట్టించేలా ఉన్నాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. టీడీపీ యువనేత లోకేష్‌ను అంబటి విమర్శించిన ప్రతిసారీ టీడీపీ సోషల్‌మీడియా సైన్యం, దానిని జగన్‌కు ఆపాదిస్తూ పెడుతున్న వీడియోలు, జగన్ ఇమేజీని దారుణంగా డ్యామేజీ చేస్తున్నాయి.

లోకేష్ భాషపై అంబటి ట్వీట్ చేసిన ప్రతిసారీ.. తెలుగులో తప్పులు మాట్లాడిన జగన్ వీడియోలు, సోషల్‌మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. ‘జగన్ గారూ.. అంబటి మిమ్మల్నే విమర్శిస్తున్నారు చూసుకోండి’ అంటూ, సోషల్‌మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.

LEAVE A RESPONSE