‘హెరిటేజ్’ పై హైడ్రామా

– హెరిటేజ్ డాక్యుమెంట్ల దగ్ధంపై రగడ
– తాను చూశానన్న టీడీపీ నేత బ్రహ్మం చౌదరి
– కాలుస్తుండగా వీడియో తీసిన టీవీ 5
– రఘురామిరెడ్డి ఆదేశాలతోనే కుట్ర అని టీడీపీ ఆరోపణ
– డీజీపీ, సీఎస్, కొల్లిని తప్పించాలని ఈసీకి ఫిర్యాదు
– మాకుటుంబంపై సీఐడీ కుట్ర అని లోకేష్ ఫైర్
– అవి కీలక డాక్యుమెంట్లని హెరిటేజ్ లేఖ
– అవి పనికిరానివేనన్న సీఐడీ
– మరి స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు ప్రదర్శిస్తారా?
– కాల్చిన డాక్యుమెంట్లు ఎవరివి?
– మరో వివాదంలో ఏపీ పోలీసులు
( మార్తి సుబ్రహ్మణ్యం)

టీడీపీ అధినేత-మాజీ సీఎం చంద్రబాబునాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్ కంపెనీ నుంచి సీఐడీ స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లను దగ్ధం చేశారన్న వార్తలు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. తాడేపల్లి సిట్ ఆఫీసులో తమ సంస్థ నుంచి స్వాధీనం చేసుకున్న కీలక డాక్యుమెంట్లను దహనం చేశారన్న వార్తలపై, ఆ కంపెనీ సెక్రటరీ ఉమాకాంత్ ఏపీ సీఐడీ అడిషినల్ ఎస్పీకి రాసిన లేఖతో కే సు కొత్తమలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది.

విచారణ సందర్భంగా ఒరిజినల్ డాక్యుమెంట్లు, మినిట్స్ పుస్తకాలను అధికారుల కోరిక మేరకు ఇచ్చిన విషయాన్ని పోలీసులకు గుర్తు చేశారు. ఇప్పుడు వాటిని తగులబెట్టారన్న వార్తలపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, వాటి భద్రత గురించి ప్రశ్నించారు. అయితే తాము దగ్ధం చేసింది హెరిటేజ్ డాక్యుమెంట్లు కాదని, వేస్ట్‌పేపర్లు మాత్రమేనని సీఐడీ తర్వాత వివరణ ఇచ్చింది.

తాము వేసిన 5 చార్జిషీట్లలో కొన్ని వేల పేపర్లు జిరాక్సు తీయాల్సి వస్తుందని, అందులో కొన్ని సరిగా రావని, వాటిని వేస్టు పేపర్లుగా పరిగణిస్తామన్నారు. ఫొటోస్టాట్ వేడెక్కడం వల్ల ఇంకులు సరిగా పడక వేస్టవుతాయని చెప్పారు. వాటినే తగులబెట్టామన్నారు. హెరిటేజ్ రిటర్న్సును తాము చట్టబద్ధంగానే పొందామని, వాటిని కోర్టులో సమర్పించామన్నారు. జరుగుతున్న ప్రచారం తమ నైతిక స్థైర్యం దె బ్బతీయడానికేనన్నారు.

అయితే హెరిటేజ్ అని స్పష్టంగా కనిపిస్తున్న కాగితాల సంగతేమిటని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి నిలదీశారు. టీడీపీ అధికారంలోకి వస్తుందన్న భయంతోనే తెలంగాణలో మాదిరిగా, ఇక్కడ కూడా రికార్డులు తగులబెడుతున్నారని పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. దీన్ని బట్టి సెక్రటేరియేట్, ఇతర కీలక శాఖలకు చెందిన రికార్డులను కూడా తగులబెట్టే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సీఐడీ ద్వారా తమ కుటుంబంపై కుట్ర చేస్తున్నారని అటు టీడీపీ యువనేత లోకేష్ ఆరోపించారు.

అంతకుముందు.. టీడీపీ యువనేత నాదెండ్ల బ్రహ్మం చౌదరి ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. తాను అటు వైపు వెళుతుండగా డాక్యుమెంట్లను పోలీసులు తగులబెట్టడం చూశానని మీడియాకు చెప్పారు. ఆ విషయాన్ని తాను టీవీ5 రిపోర్టరుకు ఫోన్ చేయడం, ఆయన రికార్డు చేయటం జరిగిందన్నారు. టీవీ 5 రిపోర్టరు కూడా హెరిటేజ్ పత్రాలను తగులబెట్టడాన్ని చూశానని స్వయంగా వెల్లడించారు.

టీవీ 5 రిపోర్టరు తాము ఎవరో అక్కడి పోలీసులకు తెలియకపోవడంతో, అక్కడున్న పోలీసులు జరిగినదంతా తమకు చెప్పారన్నారు. తగులబెడుతున్న వీడియోను పంపించాలని చెప్పడంతో.. వీడియో తీస్తున్నామని పోలీసులు వారిద్దరికీ చెప్పినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

అయితే అధికారులు చె ప్పిన దానికి, ఆ వీడియోలో కనిపిస్తున్న దానికి ఎక్కడా పొంతన కనిపించకపోవడం మరిన్ని అనుమానాలకు తెరలేపింది. తగులబెట్టిన పేపర్లలో హెరిటేజ్ అని ఉన్న లెటర్‌హెడ్ వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఇది వివాదానికి కారణమయింది. జిరాక్సు సరిగా రానివన్నీ హెరిటేజ్‌వేనా అని పట్టాభి ప్రశ్నాస్త్రం సంధించారు.

కాగా ఈ అంశంపై హెరిటేజ్ సంస్థ మరింత లోతుకు వెళితే… పోలీసులు ఇరుక్కోవడం ఖాయమని, న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి. తాము సమర్పించిన ఒరిజినల్ డాక్యుమెంట్లు, మినిట్స్‌బుక్స్, ఇతర ఒరిజినల్ డాక్యుమెంట్లపై హెరిటేజ్ కోర్టుకు వెళితే.. అక్కడైనా పోలీసులు దానికి సమాధానం చెప్పాల్సి వస్తుందని న్యాయవాదులు వివరించారు. హెరిటేజ్ నుంచి స్వాధీనం చేసుకున్న ఒరిజినల్ డాక్యుమెంట్లన్నీ, తమ వద్దనే భద్రంగా ఉన్నాయని పోలీసులు కోర్టుకు చూపాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.

అయితే అంతకుముందే సీఐడీ అధికారులు ప్రెస్‌మీట్ పెట్టి, హెరిటేజ్ ఒరిజినల్ డాక్యుమెంట్లు, చంద్రబాబుకు సంబంధించిన డాక్యుమెంట్లు తాము తగలబెట్టలేదని నిరూపించుకుంటే ఎలాంటి సమస్య ఉండదని సీనియర్ పోలీసు అధికారులు చెబుతున్నారు. ఆ మేరకు ప్రెస్‌మీట్‌లోనే ఆ డాక్యుమెంట్లు ప్రదర్శించడం ద్వారా తమ చిత్తశుద్ధి నిరూపించుకోవచ్చంటున్నారు.

సహజంగా అయితే ఇలాంటి కీలకమైన కేసు పత్రాల విషయంలో ఇంత అశ్రద్ధ చేయరు. బయటకు తీసుకువచ్చి తగులబెట్టడం కూడా ఉండదు. చేసినా పగలు చేయడమే ఆశ్చర్యంగా ఉంది. మరి ఎవరు ఆదేశాలిచ్చారో తెలియదు’’ అని ఓ సీనియర్ ఐపిఎస్ అధికారి వివరించారు.

Leave a Reply