Home » జనమే నారా ‘లొకేష’న్

జనమే నారా ‘లొకేష’న్

– మంగళగిరిలో ‘లోకేష్ గవర్నమెంట్’
– యువనేతకు ‘రెడ్డి’కార్పెట్
– వైసీపీపై రెడ్ల తిరుగుబాటు
– ఆర్-5 జోన్ ఎత్తివేతపై లోకేష్ హామీతో జోష్
– భూముల రేట్లు పడిపోవడంపై రెడ్ల అసంతృప్తి
– దానికి జగన్ విధానమే కారణమన్న ఆగ్రహం
– ఓడినా మంగళగిరిని వీడని లోకేష్‌పై జనం సానుభూతి
– ఎమ్మెల్యే ఆర్కే పనితీరుపై జనం అసంతృప్తి
– సొంత నిధులతో లోకేష్ అభివృద్ధి పనులపై సానుకూలత
– టీడీపీ వైపు ముస్లిం, క్రైస్తవులు, దళితుల మొగ్గు
– బీసీలో 60 శాతం లోకేష్ వైపే
– ప్రచారంలో ప్రతి అపార్టుమెంటులోనూ ప్రచారం
– గెలుపు ఖాయమే.. మెజారిటీనే ముఖ్యమంటున్న తమ్ముళ్లు
– లోకేష్ మంగళ‘గురి’
( మార్తి సుబ్రహ్మణ్యం)

పోయిన చోటే వెతుక్కోమన్న పెద్దల మాటను టీడీపీ యువనేత, మంగళగిరి టీడీపీ అభ్యర్ధి నారాలోకేష్ ఆచరణలో అమలుచేస్తున్నారు. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో ఓడిన లోకేష్, పట్టువదలని విక్రమార్కుడిలా మంగళగిరిలోనే తిరిగి తన అదృష్టం పరీక్షించుకోవడం విశేషం. నిజానికి గత ఐదేళ్ల నుంచి, ఒక ప్రణాళిక ప్రకారం పనిచేస్తున్న లోకేష్ పనితీరుకు వైసీపీ బెంబేలెత్తింది.

విజయసాయిరెడ్డి, సజ్జల, అయోధ్య రామిరెడ్డి వంటి పెద్ద తలలను రంగంలోకి దింపింది. టీడీపీ నేతలను పార్టీలో చేర్చుకుంది. ఇన్చార్జులను, చివరకు అభ్యర్ధులను కూడా మార్చింది. అయినా ఫలితం శూన్యం. అంటే జనక్షేత్రంలో లోకే ష్ ఏ స్థాయిలో మమేకమయ్యారో స్పష్టమవుతూనే ఉంది. అన్ని వర్గాల మద్దతు కూడగట్టుకోవడంలో ఐదేళ్ల లోకేష్ శ్రమ ఫలించింది. అది ఆయన ఎన్నికల ప్రచారంలో స్పష్టంగా కనిపించింది.

ప్రధానంగా గత ఎన్నికల్లో కులాభిమానంతో వైసీపీకి జై కొట్టిన రెడ్డి సామాజికవర్గం, ఇప్పుడు లోకేష్‌కు ఏకపక్షంగా దన్నుగా నిలవడం విశేషం. తాడేపల్లి, దుగ్గిరాల, ఇప్పటం, కాజా వంటి ప్రాంతాల్లో బలంగా ఉన్న రెడ్లు, ఈసారి వైసీపీని విడిచి టీడీపీకి బాహాటంగానే పనిచేస్తున్నారు. లోకేష్ ‘కరకట్ట కమలహాసన్’గా ముద్దుగా పిలిచే వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై, రెడ్లతో పాటు మైనారిటీల్లో ఉన్న భ్రమలు తొలగిపోయాయి. అది గ్రహించినందుకే ఆళ్ల ప్రచారంలో కనిపించలేదు. ప్రధానంగా మంగళగిరిలోని రెడ్లలో ఎక్కువశాతం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. వారి ప్రభావం ఆయా గ్రామాల్లో ఎక్కువే.

ఎన్నికల ముందు అమరావతి లోనే రాజధాని ఉంటుందన్న ఎమ్మెల్యే ఆళ్ల మాటలు బూటకమని, జగన్ నిర్ణయంతో తేలిపోయింది. రాజధాని అక్కడే ఉంటే భూముల రేట్లు పెరిగి, తాము ఆర్ధికంగా లాభపడవచ్చని రెడ్డివర్గం ఆశించింది. అయితే అందుకు విరుద్ధంగా.. జగన్ నిర్ణయాల వల్ల భూముల రేట్లు దారుణంగా పడిపోవడం, అసలు భూములు కొనేవారే లేకపోవడంతో రెడ్లు ఆర్ధికంగా దెబ్బతిన్నారు. దానితో వైసీపీకి ఓటు వేయకూడదని, టీడీపీ అధికారంలోకి వస్తే, అమరావతిలో భూముల రేట్లకు మళ్లీ రెక్కలు వస్తాయన్న ఆశతో లోకేష్‌కు జైకొడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దానికితోడు అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతిలో పనులు ప్రారంభిస్తామన్న లోకేష్ హామీ కూడా వారు టీడీపీ వైపు అడుగులు వేసేందుకు కారణమయింది.

ముఖ్యంగా భూములు కొనడం-అమ్మడాన్ని నిషేధిస్తూ రూపొందించిన, ఆర్-5 జోన్‌ను ఎత్తివేస్తామని లోకేష్ ఇచ్చిన హామీతో, రెడ్డి వర్గం గంపగుత్తగా సైకిల్ ఎక్కేందుకు కారణమవుతోంది. అదీగాక గత ఎన్నికలో..్ల కులాభిమానంతో ఆర్కేకు ఓటు వేసిన రెడ్లు, ఈసారి ఆయన స్థానంలో బీసీకి ఇవ్వడంతో వైసీపీకి వైపు ఆసక్తి ప్రదర్శించడం లేదు. ప్రధానంగా జగన్ అమరావతిని దెబ్బతీసి తమను నష్టపరిచారన్న ఆగ్రహం మంగళగరి రెడ్లలో బలంగా నాటుకుపోయింది.

ఇక లోకేష్ తన ప్రచారంలో నియోజకవర్గంలోని ఒక్క అపార్టుమెంటునూ కూడా విడిచిపెట్టకుండా ప్రచారం నిర్వహించి, వారితో ముఖాముఖి మాట్లాడారు. నిజానికి అపార్టుమెంటు వాసులు, బయటకు వచ్చేందుకు ఏమాత్రం ఇష్టపడరు. అలాంటిది లోకేష్ ఏర్పాటు చేసిన ప్రతి సమావేశానికి హాజరవడంతోపాటు, తమ సమస్యలను కూడా ఏకరవుపెట్టారు. అంటే వారికి లోకేష్ ఏ స్థాయిలో దగ్గరయ్యారో స్పష్టమవుతోంది.

నిజానికి లోకేష్ మంగళగిరిలో ఓడిపోయిన తర్వాత, సొంత నిధులతో అనేక అభివృద్ధి పనులు చేశారు. సహజంగా ఓడినవారెవరూ సొంత ఖర్చులతో పనులు చేయరు. మహా అయితే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పనులు చేయిస్తుంటారు. కానీ లోకేష్ అందుకు విరుద్ధంగా సొంత ఖర్చులతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయడం, నియోజకవర్గ ప్రజలు ఆయనకు దగ్గరయేందుకు కారణమయింది.

నియోజకవర్గంలో ఎక్కడ చూసినా లోకేష్ ఉచితంగా ఇచ్చిన తోపుడుబండ్లు, కిళ్లీషాపులు, వీల్‌చైర్లు, ఐస్‌క్రీమ్ బండ్లే కనిపిస్తాయి. సెలూన్లకు కుర్చీలు, గ్రామాలకు మినరల్ వాటర్ ప్లాంట్లు, సంజీవని ఉచిత ఆరోగ్య కేంద్రాలు, సంజీవని రథం, ఉచిత టైలరింగ్ శిక్షణా కేంద్రాలు, మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ, క్రికెట్-వాలీబాల్ టోర్నమెంట్ల నిర్వహణతోపాటు.. సొంత ఖర్చులతో స్టేడియం నిర్మించడం ద్వారా యువకులకు చేరువయ్యారు.

ఇక పేదలందరికీ 2 రూపాయలకే అన్నక్యాంటీన్లు, దళిత కుటుంబాల ఇళ్లలో జరిగే పెళ్లిళ్లకు మంగళసూత్రాల పంపిణీ, తనను పెళ్లికి ఆహ్వానించిన ప్రతి ఒక్కరికీ పెళ్లికానుక, బంగారం పనిచేసే కార్మికులకు హెల్త్ స్కీం, రంజాన్‌తూఫా, ఉగాది కానుకలు, క్రిస్మస్ కానుకలు, నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో ఉన్న చేనేతలకు నూలు వడికే రాట్నాల పంపిణీ, చనిపోయిన కుటుంబాలకు మట్టి ఖర్చులు, పేదలకు వైద్య ఖర్చులు భరిస్తున్నారు.

ఒక్కముక్కలో చెప్పాలంటే.. ఎమ్మెల్యే కాకపోయినా.. పార్టీ అధికారంలో లేకపోయనా లోకేష్ మంగళగిరిలో చిన్న సైజు ప్రభుత్వం నడుపుతుండటమే ఆశ్చర్యం. ఈవిధంగా నియోజకవర్గంలో ఏ ఒక్క వర్గాన్నీ విడిచిపెట్టకుండా సొంత నిధులతో అందరి సంక్షేమాన్ని కాపు కాస్తున్న లోకేష్ గెలవడం ఖాయం. మెజారిటీ ఎంతన్నదే ముఖ్యమన్నది ఇప్పుడు మంగళగిరి మాట.

Leave a Reply