సీట్ల ట్విస్ట్

-మళ్లీ మారిన జాబితా
– కొత్తగా తెరపైకి విజయనగరం, తిరుపతి?
– హిందూపురం, రాజంపేట, ఏలూరు మాయం?
– రాజమండ్రి, అరకు, అనకాపల్లి, నర్సాపురం, తిరుపతి, విజయనగరంలో బీజేపీ పోటీ?
– జనసేన నుంచి బీజేపీకి మరో ఎంపీ సీటు దక్కే చాన్స్?
– రెండో ఎంపీ సీటుకు జనసేనలో కనిపించని బలమైన అభ్యర్ధి
– పొత్తుల్లో పవన్ పెద్దన్నపాత్ర
– ముస్లిం జనాభా కారణంతో హిందూపురం రాజంపేట స్థానాలు మార్పు?
– బీజేపీ అభ్యర్ధిగా తెరపైకి రఘురామకృష్ణంరాజు
– పది అసెంబ్లీలో మూడు నియోజకవర్గాలు పెండింగ్?
– బద్వేలు, పాడేరు, తిరుపతి, జమ్మలమడుగు, విశాఖ, కైకలూరు, ధర్మవరం అసెంబ్లీ స్థానాలు ఖరారు?
( మార్తి సుబ్రహ్మణ్యం)

టీడీపీ-జనసేనతో పొత్తు ఖరారు చేసుకున్న బీజేపీ.. ఆ మేరకు తన ఎంపీ-ఎమ్మెల్యే స్థానాలపైనా తాజాగా టీడీపీ-జనసేన భేటీలో చర్చించినట్లు సమాచారం. ఆ ప్రకారంగా రాజమండ్రి నుంచి పురందేశ్వరి, అరకు నుంచి గీత, అనకాపల్లి నుంచి సీఎం రమేష్, నర్సాపురం నుంచి రఘురామకృష్ణంరాజు, తిరుపతి నుంచి రత్నప్రభ పేర్లు ఖరారయినట్లు పార్టీ వర్గాలు వె ల్లడించాయి. అయితే కొత్తగా విజయనగరం ఎంపీ స్థానం కూడా అనూహ్యంగా తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది.

కాగా బాబు నివాసంలో చర్చలు జరిగినప్పటికీ, ఢిల్లీలోనే ఎంపీల అభ్యర్ధులపై తుది నిర్ణయం తీసుకుని, నేడో రేపో ఆ జాబితా ప్రకటిస్తారని చెబుతున్నారు. ఒకటి రెండు సీట్లు మారినా ఆశ్చర్యంలేదంటున్నారు. జనసేన అధినేత పవన్ అసెంబ్లీకి బదులు లోక్‌సభకు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆ మేరకు రెండో ఎంపీ సీటుకు సరైన అభ్యర్ధి కనిపించడం లేదు. ఆ క్రమంలో ఆ ఎంపీ సీటును కూడా బీజేపీకి కేటాయించడం ద్వారా, పవన్ పెద్దన్న పాత్ర పోషించినా వింతలేదంటున్నారు.

తాజాగా చర్చల్లో రాజంపేట, హిందూపురం లోక్‌సభ నియోకవర్గాలపై చర్చ జరిగినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఆ రెండు నియోజకవర్గాల్లో ముస్లింల సంఖ్య ఎక్కువగా ఉన్నందున, అక్కడ బీజేపీ పోటీ సురక్షితం కాదన్న అభిప్రాయం వ్యక్తమయినట్లు తెలుస్తోంది. రెండు నియోజకవర్గాల్లో రెండున్నర లక్షల మంది చొప్పున ముస్లిములు ఉన్నట్లు వారి చర్చల్లో తేలిందట. అయితే ఇప్పటివరకూ అసలు చర్చలకే రాని విజయనగరం సీటు తాజా భేటీలో వచ్చినట్లు చెబుతున్నారు. అక్కడ అభ్యర్ధి ఎవరన్నది ఇంకా స్పష్టం కాలేదు.

ఇక ఇప్పటివరకూ నర్సాపురం టీడీపీ అభ్యర్ధిగా పరిశీలన-చర్చల్లో ఉన్న సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణంరాజు, తాజా చర్చల తర్వాత అనూహ్యంగా బీజేపీ అభ్యర్ధిగా మారినట్లు సమాచారం. దానితో ఏలూరు స్థానం బీజేపీకి దక్కనట్లు పార్టీ వర్గాలు వివరిస్తున్నాయి. నిజానికి నిన్నటివరకూ పశ్చిమ గోదావరిలోని ఏలూరు-నర్సాపురం రెండూ బీజేపీకి ఇవ్వడం సాధ్యం కానందున.. ఏలూరు బీజేపీకి, నర్సాపురం టీడీపీకి కేటాయించాలని భావించారు. కానీ తాజా చర్చల్లో నర్సాపురం ఎంపీ టీడీపీ వెళ్లి, ఏలూరు స్థానంలో విజయనగరం చేరినట్లు చెబుతున్నారు.

ఇక బీజేపీ తిరుపతి, బద్వేలు, పాడేరు, జమ్మలమడుగు, విశాఖ, కైకలూరు, ధర్మవరం స్థానాల్లో పోటీకి దిగుతున్నట్లు సమాచారం. వైసీపీకి రాజీనామా చేసిన శ్రీనివాస్ తొలుత జనసేన నుంచి పోటీ చేస్తారని భావించినప్పటికీ, తాజా భేటీ తర్వాత ఆయన తిరుపతి బీజేపీ అభ్యర్ధిగా తెరపైకొచ్చినట్లు తెలుస్తోంది. మిగిలిన 3 స్థానాలు పెండింగ్‌లో ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Leave a Reply