Suryaa.co.in

Editorial

షర్మిలక్క పార్టీ ఆంధ్రాలో పక్కా!

– చెప్పకనే చెప్పేసిన షర్మిల
– వైసీపీలో సర్వత్రా చర్చ
– నిజం కానున్న జెసి జోస్యం?
( మార్తి సుబ్రహ్మణ్యం)

కొద్దినెలల క్రితం రాయలసీమ సీనియర్ నేత జెసి దివాకర్‌రెడ్డి చెప్పిస జోస్యమే నిజమవనుంది. షర్మిల పెట్టిన తెలంగాణ పార్టీ ట్రయిల్ మాత్రమేనని, అసలు సినిమా ఆంధ్రాలోనే ఉందని, ఆమె ఆంధ్రాలో పార్టీ పెట్డడం ఖాయమని జెసి చేసిన ఏనాడో చేసిన వ్యాఖ్యలను నిజం చేసేలా షర్మిల తాజా వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలను కొత్త మలుపు తిప్పనున్నాయి. షర్మిల వ్యాఖ్యలు అటు వైసీపీలోనూ చర్చనీయాంశంగా మారాయి.

‘రాజకీయ పార్టీ ఎక్కడైనా పెట్టవచ్చు. పెట్టకూడదనే రూల్ ఏమీ లేదు కదా’ అని లేటెస్ట్‌గా షర్మిలక్క చేసిన నర్మగర్బ వ్యాఖ్యలతో, ఏపీలో షర్మిలక్క పార్టీ పెట్టడం పక్కా అని తేలిపోయింది. నిజానికి షర్మిల పార్టీకి తెలంగాణలో పెద్ద ఆదరణ కనిపించడం లేదు. రేవంత్‌రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి కట్టబెట్టిన తర్వాత రెడ్డి సామాజిక వర్గం మొత్తం, సహజంగా కాంగ్రెస్ వైపే చూస్తుంది. ఇక రెడ్డి వర్గ ప్రభావం ఉన్న జిల్లాల్లో ఇప్పటికే టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లో బలమైన రెడ్లు ఉండగా, కొన్ని జిల్లాల్లో బీజేపీలోనూ బలమైన రెడ్డి నేతలు చేరారు. ఫలితంగా రెడ్డి కార్డుతో అదృష్టం పరీక్షించుకుందామనుకున్న షర్మిలక్క ప్లాన్ పెద్దగా వర్కవుటయ్యే అవకాశం కూడా కనిపించడం లేదు.

Sharmila-Anil-Kumarఇక భర్త బ్రదర్ అనిల్ కష్టంతో.. ఏపీలో మాదిరిగా క్రైస్తవులంతా షర్మిల పార్టీకి గంపగుత్తగా ఓటేసే పరిస్థితి కూడా తెలంగాణలో కనిపించడం లేదు. తెలంగాణలోని 70 శాతం దళితులు మతం మారారన్న ప్రచారం ఉన్నప్పటికీ, ఇప్పుడు బీఎస్పీలో చేరిన మాజీ ఐపిఎస్ అధికారి ప్రవీణ్ ప్రభావం వారిలో ఎక్కువగా కనిపిస్తోంది. కాబట్టి షర్మిలక్కకు రెడ్డి+క్రైస్తవ కార్డులు అక్కరకొచ్చే అవకాశాలు కనిపించడం లేదన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. మొత్తంగా ఇప్పటికే అన్ని కులాలు, మతాలు ఆయా పార్టీలకు మానసిక మద్దతుదారుగా మారినందున, ఇక షర్మిలక్కయ్య పార్టీ తెలంగాణలో సాధించేదేమీలేదన్నది రాజకీయ వర్గాల నిశ్చితాభిప్రాయం.

అనిల్ ఇమేజే ఆలంబన
ఈ నేపథ్యంలో ఏపీలో పార్టీ స్థాపనపై షర్మిల చేసిన వ్యాఖ్య సహజంగానే చర్చనీయాంశంగా మారింది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కూతురిగా రెడ్డి వర్గంలో షర్మిలకు సానుభూతి ఉందన్నది కొట్టిపారేయలేని అంశం.
anil-ys అయితే క్రైస్తవులు, దళిత క్రైస్తవులలో అంతకుమించి, భర్త బ్రదర్ అనిల్‌కు ఇమేజ్ అధికమన్నదీ అంతే నిజం. గత ఎన్నికల ముందు జగన్ అధికారంలోకి వచ్చేందుకు అనేక అంశాలు కలసివచ్చినప్పటికీ, బ్రదర్ అనిల్ రెక్కల కష్టమే ఎక్కువ. క్రైస్తవమత ప్రచారకులతో కలసి ఆయన చేసిన కార్యక్రమాలు క్రైస్తవులు- దళిత క్రైస్తవులు వైసీపీకి చేరువచేశాయన్నది మనం మనుషులం అన్నంత నిజం.

ఆంధ్రప్రదేశ్‌లో ఒక సర్వే నివేదిక ప్రకారం 80 శాతం దళితులు క్రైస్తవ మతం మారారన్నది ఒక అంచనా. భవిష్యత్తులో షర్మిల పార్టీ స్థాపిస్తే ఆ వర్గంలో మెజారిటీ శాతం ఆమె వైపే ఉండటంతోపాటు.. ఇప్పుడు వైసీపీకి మద్దతుదారుగా ఉన్న రెడ్డి వర్గంలో కూడా చీలిక వచ్చి, షర్మిల పార్టీకి ఓటుబ్యాంకుగా మారినా ఆశ్చర్యం లేదని రాజకీయ వర్గాల విశ్లేషణ.

వైసీపీలో కొత్త చర్చ
షర్మిల తాజా వ్యాఖ్యల నేపథ్యంలో అధికార వైసీపీలో కొత్త చర్చకు తెరలేచింది. నిజంగా షర్మిల పార్టీ పెడితే, వైఎస్ కుటుంబంలో తాము ఎటు వైపు ఉండాలన్నది ఇప్పుడు వినిపిస్తున్న ఆసక్తిరకమైన చర్చ. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తానన్న జగన్‌కు సర్వేలు నిర్వహిస్తున్న ప్రశాంత్ కిశోర్ బృందం, ముప్పావుభాగం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇచ్చే అవకాశం లేదన్న చర్చ గత మూడు నెలల నుంచి వైసీపీ వర్గాల్లో జరుగుతోంది. ఒకవేళ అదే నిజమైతే టికెట్లు రాని సిట్టింగ్ ఎమ్మెల్యేలు, షర్మిల పార్టీలో చేరే అవకాశాలు కొట్టివేయలేమన్న చర్చ ప్రారంభమయింది.

ప్రధానంగా వైఎస్ కుటుంబ ప్రభావం అధికంగా ఉండే కడప జిల్లాలో ..షర్మిల పార్టీ పెడితే పార్టీ నేతలు ఎటువైపు ఉండాలన్న నిర్ణయం కత్తిమీదసాములా మారడం ఖాయం. షర్మిలను జగన్ దూరంగా పెట్టినప్పటికీ, కడపకు చెందిన చాలామంది వైసీపీ నేతలు షర్మిల, ఆమె తల్లి విజయమ్మకు టచ్‌లోనే ఉంటున్నారన్నది బహిరంగ రహస్యమే. వారిద్దరూ ఇడుపులపాయకు వచ్చినప్పుడు కడప నేతలు వారిని కలుస్తున్న విషయం తెలిసిందే.

 

LEAVE A RESPONSE