– జగనన్న ‘వేణు’గానం జర్నలిస్టులూ చేయాలట
( మార్తి సుబ్రహ్మణ్యం)
‘‘కొత్తా దేవుడండీ కోంగొత్తా దేవుడండీ
ఇతనే దిక్కని మొక్కనివాడికి దిక్కూమొక్కూ లేదండండీ
రండీ.. బాబూ.. శిశువా’’
చిన్నప్పుడెప్పుడో చూసిన ‘రాజాధిరాజు’ సినిమాలో నూతన్‌ప్రసాద్ పాడిన ఈ పాటను, ఇక భవిష్యత్తులో ఆంధ్రాలోని ప్రతి జర్నలిస్టు ‘జగన్మోహనరాగాన్ని’ భక్తిశ్రద్ధలు, తాదాత్మ్యంతో, అరమోడ్పుకన్నులతో పాడాల్సివస్తుందేమో? అలా పాడాలన్నది సమాచారశాఖ సచివుడి ఆశట. కాబట్టి ఇకపై ఆంధ్రదేశంలోని ప్రతి జర్నలిస్టు.. తన సెల్‌ఫోన్‌లో ఈ పాటను రింగ్‌టోన్‌గా పెట్టుకుంటే, పాలకులు ముందస్తుగా మురిసిపోతారు.
సాధారణంగా మనుషులకు వెన్ను వయసును బట్టి వంగుతుంటుంది. కానీ ఆత్మాభిమానం లేనివారికి పూర్తిగా వంగుతుంది. అసలు వారి ఆత్మాభిమానం చూసి ఒక్కోసారి వెన్నే విరగబడి ఈర్ష్యతో నవ్వుకుంటుంది. సరే.. ఇవన్నీ ఆత్మగౌరవం, స్వాభిమానం ఉన్న వారి గురించిన విషయాలు. అవి లేని వారి గురించి చర్చించడం వృధా.
ఇక ఆంధ్రా సమాచారశాఖ మంత్రిగా మొన్ననే పగ్గాలందుకున్న చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ .. తనకు మంత్రి పదవి దక్కిన సంబరంలో, పాత్రికేయలోకానికి కృష్ణభగవానుడు కూడా విస్తుబోయే ‘చెల్లుబోయిన గీతాసారం’ ఉపదేశించారు. ‘‘ జర్నలిస్టుల సమస్యలు తీరాలంటే జగన్‌ను ఆరాధించాలి. అంతేగానీ ఆరాలు తీయవద్దు’’ అని ఉపదేశించారు. అంతేనా.. తానెలా ఉద్ధారకుడయినదీ సచివులు సెలవిచ్చి, జర్నలిస్టులంతా తనను ఫాలో అవ్వాలని హితవు పలికారు. ‘‘సీఎం జగన్‌ను ఆరాధించాను కాబట్టే నాకు మంత్రి పదవి వచ్చింది. చిత్తశుద్ధితో మీరూ జగనన్నను ఆరాధిస్తే మీ కల కూడా నెరవేరుతుంద’ని గోపాలావతారం ఎత్తి మరీ బోధించారు. సంతోషం.
నిజమే. మంత్రి బోధనలో తత్వం లేకపోలేదు. ఆ ప్రకారంగా ఇకపై రేపటి నుంచి జర్నలిస్టులంతా ఎక్కడికక్కడ ‘కలం మీద నిలుచుకున్న జగనన్న’ విగ్రహాలు ఏర్పాటుచేసి ఆరాధిస్తేనయినా, జగనన్న జర్నలిస్టులను కరుణిస్తరేమో చూడాలి. అంటే ‘జగనన్న జర్నలిస్టు కరుణ’ పేరుతో కొత్త స్కీము ప్రారంభించినా ప్రారంభించవచ్చేమో?! ఇప్పటివరకూ ఈ రహస్యాన్ని పాత మంత్రి పేర్ని నాని కూడా చెప్పకపాయె. పోనీలెండి. కనీసం ఇప్పటికయినా వేణన్న అసలు రహస్యం చెప్పడం మంచిదయింది. ఆయన చెప్పినట్లు జర్నలిస్టులంతా జగనన్న ఆరాధకులయితే, అటు పాత్రికేయలోకం పుణ్యం కూడా పుచ్చిపోతుంది.
ఇంతకూ జర్నలిస్టులోకమంతా మతం మారినట్లు… అంత కష్టపడి జగన్ ఆరాధికులుగా మారితే, వారికి ఏం వస్తుందన్నది కూడా సచివులు సెలవిస్తే బాగుండేది. ఎటూ యాజమన్యాల నుంచి ఠంచనుగా నెలవారీ జీతాలు, పీఎఫ్, ఈఎస్‌ఐలు ఇప్పించే దమ్ము ఇప్పటివరకూ పనిచేసిన ఏ సమాచారశాఖ మంత్రికీ లేదన్నది, ఉండదన్నదీ మెడమీద తల ఉన్న ఎవరికయినా తెలుసుకాబట్టి, అంత పేరాశకు పోవలసిన పనిలేదు. వేజ్‌బోర్డును అమలుచేయించే ధైర్యం ఏ ప్రభుత్వాలకూ లేదనీ తెలుసు. కాబట్టి దానిజోలికి పోనవసరం లేదు. ఇక ఇవేమీ అమలుకానప్పుడు సచివులు సెలవిచ్చినట్లు.. జర్నలిస్టులంతా జగనన్నను గుడి గుండెలో కట్టుకుని, ఊరారా అలసిసొలసి భజన చేస్తే వచ్చే ఫాయిదా ఏమిటి? అక్రెడిటేషన్ కార్డులా!
మాయదారి జర్నలిస్టు యూనియన్లు గ్రామీణప్రాంత విలేకరులపై విసిరే ఈ అందమైన అక్రెడిటేషన్ కార్డుల వల వల్ల ఉపయోగం ఏమిటన్నది, ఇప్పటిదాకా ఏ జర్నలిస్టూ బుర్ర పెట్టి ఆలోచించకపోవడమే వింత. జర్నలిస్టు అనేవాడికి ఆ కార్డు ఒక ఆత్మానందం. అదేమీ అదనపు హోదా కాదు. ఆర్టీసీ బస్సుల్లో రాయితీకి తప్ప, మరోదానికి అక్కరకు రాని కార్డది. పోనీ వైద్య సేవలకు అక్కరకు వస్తుందా అనుకుంటే… 99 శాతం గ్రామీణ ప్రాంత విలేకరులకు ఎలాగూ తెల్లకార్డు ఉంటుంది కాబట్టి, ప్రైవేటు ఆసుపత్రులకు అది ఆరోగ్యశ్రీగా పనికివస్తుంది.
ఇక ఇళ్ల స్థలాలిస్తారన్న ఆశ ఉండవచ్చు. ఎలాగూ ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యేలతో ఉన్న సంబంధాల వల్ల వారికి ఎప్పుడో అవి వచ్చేసి ఉండాలి. ఎటొచ్చీ నష్టపోయేది కంపెనీల నుంచి జీతాలు తీసుకునే స్టాఫ్‌రిపోర్టర్లు, డెస్కుల్లో పనిచేసే సబ్ ఎడిటర్లు. వీరిలో స్టాఫ్ రిపోర్టర్లలో చాలామందికి, ఏదో ఒక జిల్లాల్లో
పనిచేసినప్పుడు అవి వచ్చే ఉండాలి. ఇక ‘వేణన్న ప్రవచిన జగనన్న భజన’ ఎవరి కోసం? ఎందుకోసం? ఫలితం దక్కని వ్రతం చేయడమెందుకన్నది బుద్ధిజీవుల వాదన. కాకపోతే జిల్లాల్లో వీఐపీల పర్యటనకు అక్రెడిటేషన్ ప్రాతిపదిన పెట్టినందున ఇబ్బందులు పడేది జిల్లా రిపోర్టర్లే.
సరే.. ఇటీవలి కాలంలో కొన్ని పత్రికలు ఫ్రాంచైజీలు ఇచ్చేస్తున్నాయి. అంటే సబ్ లీజు మాదిరి అన్నమాట. వేలం పాటలో ఒక్కో జిల్లాను లీజుకు ఇస్తున్నాయి. సదరు సబ్ లీజు దారుడు, వేలంలో నియోజకవర్గాలను ఇంకొకరికి లీజుకు ఇస్తుంటారు. అక్రెడిటేషన్ ఆశ చూపి ఖరీదు నిర్ణయిస్తాడు. ఇటీవలికాలంలో వాట్సాప్‌లు చూస్తుంటే ‘ఫలానా పత్రిక, ఫలానా చానెల్ అమ్మబడును. అక్రెడిటేషన్ సౌకర్యం కూడా ఉంది’ అని చూస్తున్న దౌర్భాగ్యం దాపురించింది. ఈ గ‘లీజు’ బాగోతాన్ని ప్రోత్సహించి, వారి తరఫున సమాచారశాఖ అధికారుల వద్ద వాదించేది యూనియను వస్తాదులు.
ఈ బాపతు పేపర్లు ప్రింటవుతాయో లేవో తెలియదు. కొద్దికాలం క్రితమే ఆంధ్రా సమాచార కమిషనర్ జీఎస్టీ, రెగ్యులారిటీ నిబంధన పెట్టి వీరి తోక కోసినందున, ఇప్పుడు అక్రెడిటేషన్ల పంచాయితీ తగ్గిపోయింది. క్లుప్తంగా ఇదీ ఆంధ్రాలో జర్నలిస్టులు పెద్ద సమస్యగా ఫీలవుతున్న అక్రెడిటేషన్ల కథ. కాబట్టి కమిషనరే వీటిని వడపోసి, ఒక దారిలో పెట్టినందున, కొత్త మంత్రి చెప్పిన జగన్ భజన వల్ల వచ్చే అదనపు లాభమేమిటన్నది ప్రశ్న.
యాజమాన్యాలతో కొట్లాడి జర్నలిస్టులకు జీతాలు, సౌకర్యాలు ఇప్పించలేని.. డజన్ల సంఖ్యలో ఉద్యోగులపై అర్ధంతరంగా వేటు వేస్తే, యాజమాన్యాల మెడ వంచి ఉద్యోగాలు నిలబెట్టకుండా.. నవరంధ్రాలూ మూసుకునే యూనియన్లకు తేరగా దొరికేది ప్రభుత్వాలే కాబట్టి, వారి పోరాటవీరత్వం గురించి ఎంత తక్కువ చెబితే జర్నలిస్టుల ఆరోగ్యానికి అంత మంచిది. ఇప్పుడు వేణన్న ఆలపించాలంటున్న జగన్మోహనరాగం వల్ల జర్నలిస్టుల విలువ పెరుగుతుందా? ఇప్పటికే సొంత మీడియా సంస్థలు ఎలాగూ జగన్మోహనరాగమే ఆలపిస్తున్నందున, మిగిలిన మీడియా సంస్థలు కూడా తన మాదిరిగానే ‘జగన్మోహనరాగం’ ఆలపించి జర్నలిస్టులు తమ కల నెరవేర్చుకోవాలన్నది వేణన్న కవిహృదయం.
అయినా వేణన్న పిచ్చి, చాదస్తం కాకపోతే.. ఇప్పుడు మీడియా ఎవరి భజన ఎందుకు చేస్తుందనే విషయం, స్కూలు పోరగాడికీ తెలిసిపోయింది. ఒక సంఘటనను ఎవరికి వారు అనుకూలంగా మలచుకోవడం, అస్మదీయులయితే ఒకరకంగా- తస్మదీయులయితే ఆ వార్తను మరొకరకంగా మార్చుకోవడం, సర్కారు కొంపలుముంచే వార్తయితే.. దానిని సాధ్యమైనంత రాకుండా చూడటం, మరీ మొహమాటం, విలువల ముసుగులుంటే దాని తీవ్రతను చంపేసి, జాగత్త్రగా ఎవరూ చదవని పేజీల్లోకి పంపేస్తాయన్న విషయం, మీడియాను ఫాలో అయ్యే మెడ మీద తల ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు.
కాబట్టి వేణన్న ఎలాగూ సమాచారశాఖ మంత్రి అయ్యారు కాబట్టి.. జగనన్న ఆరాధన-భజన చేసే విధంబెట్టిదనిన’ అన్న అంశంపై మండలాలు-జిల్లాల వారీగా జర్నలిస్టులకు ఆయనే స్వయంగా క్లాసులిస్తే సరిపోతుంది. భజన వార్తలు ఎలా రాయాలి? అవి ఏ మోతాదులో ఉండాలి? ఎలా ఉంటే అన్న ఆనందిస్తాడు? అవి జిల్లా పేజీల్లో ఏ తరహాలో ఉండాలి? మెయిన్ పేజీల్లో ఏ తరహాలో ఉండాలి? అన్నది సర్కారీ మీడియాతో సిలబస్ తయారుచేయించి.. వీలయితే పత్రిక ఎడిటర్లు, బ్యూరోచీఫ్‌లను కూడా క్లాసులకు పిలిపిస్తే, వేణన్న కలలు గన్న ‘జగనన్న ఆరాధన’ ఫలిస్తుందేమో. తర్వాత ఓ ఆర్నెల్లకో, ఏడాదికో వేణన్న కష్టం ఫలిస్తే.. అప్పుడు ‘త్యాగరాజ ఆరాధనోత్సవాల’ మాదిరిగా ‘జగనన్న ఆరాధనోత్సవాలు’ నిర్వహిస్తే, వేణన్న పేరు చరిత్రలో నిలిచిపోవడం ఖాయం.