జనసేనలో జోగయ్య జగడం!

– సొంత అజెండా రుద్దుతున్న హరిరామజోగయ్య
– జోగయ్య వెనుక ఎవరున్నారు?
– చిరంజీవి పాలకొల్లులో ఓటమికి కారణమెవరంటున్న జనసైనికులు
– పాలకొల్లులో చిరంజీవికి వెన్నుపోటు పొడిచిందెవరన్న వాదన
– కాపు ఉద్యమంలో జోగయ్య పాత్ర ఏమిటన్న ప్రశ్నలు
– రిజర్వేషన్ల ఉద్యమంలో ఎక్కడున్నారు?
– పీఆర్పీ గుణపాఠం మర్చిపోకూడదంటున్న నేతలు
– సైంధవుల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిక
– జోగయ్య వ్యాఖ్యలపై జనసైనికుల ఆగ్రహం
– జోగయ్య వ్యాఖ్యలు వైసీపీకి పాలుపోసినట్లేనా?
– మూడు పార్టీలు విడిగా పోటీ చేస్తే లాభమెవరికన్న చర్చ
– జనసేనలో జోగయ్య వ్యాఖ్యల రచ్చ
( మార్తి సుబ్రహ్మణ్యం)

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ దారి తప్పడానికి కారణమయిన అంశాలు… అందుకు కారకులయిన నాయకుల సలహాలతో కుప్పకూలిన పీఆర్పీ పతనాన్ని, పవన్‌ కల్యాణ్‌ మర్చిపోవడంపై జనసైనికుల్లో విస్మయం వ్యక్తమవుతోంది. అప్పుడు యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్న పవన్‌.. ఇప్పుడు జనసేన అధ్యక్షుడి హోదాలో, మళ్లీ చిరంజీవి దారిలోనే పయనించడంపై పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జనసేన-టీడీపీ పొత్తును విచ్ఛిన్నం చేసేందుకు కులనేతలు రంగప్రవేశం చేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

వృద్ధ రాజకీయ నేత హరిరామజోగయ్య చేసిన వ్యాఖ్యలు, జనసేన-కాపువర్గాల్లో కలవరం సృష్టిస్తున్నాయి. టీడీపీ-వైసీపీకి వ్యతిరేకంగా జనసేన యుద్ధం చేయాలని, జనసేనను బలహీనపరిచేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందంటూ జోగయ్య చేసిన వ్యాఖ్యలపై .. జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జోగయ్య వ్యాఖ్యలు ఏ పార్టీకి పాలుపోస్తున్నాయో, ఎవరికి నష్టం కలిగిస్తున్నాయో స్పష్టమవుతూనే ఉందని జనసేన సీనియర్లు చెబుతున్నారు.

అంగ-ఆర్ధికబలం ఉన్న వైసీపీని.. విస్తృతమైన యంత్రాంగం-పార్టీ నిర్మాణం ఉన్న టీడీపీనే తట్టుకోలేని పరిస్ధితి ఉంటే.. పవన్‌ ఆలోచనలు-ఫ్యాన్స్‌ హడావిడి తప్ప, పెద్దగా పార్టీ నిర్మాణం లేని తామెలా ఎదుర్కొంటామని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన-టీడీపీ కలసి పోటీచేయడం వల్ల, ఉభయ గోదావరి జిల్లాల్లో సత్ఫలితాలిచ్చిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు. తమ పార్టీకి పవన్‌ తప్ప, రెండవ స్ధాయి నేత ఎవరూ లేరని గుర్తు చేస్తున్నారు. కనీసం ఓ 50 నయోజకవర్గాల్లో నియోజకవర్గ స్థాయి నేతలు కూడా లేని తమ పార్టీ, ఒంటరిగా వైసీపీని ఎదుర్కోవాలన్న జోగయ్య వ్యాఖ్యలు విస్మయం కలిగిస్తున్నాయంటున్నారు.

పవన్‌ సభలకు డబ్బు ఖర్చు పెట్టకపోయినా.. సభలు సక్సెస్‌ అవుతున్నప్పటికీ, తాము అన్ని నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్ధులను, ఇప్పటివరకూ తయారుచేసుకోలేకపోయామని జనసేన నేతలు అంగీకరిస్తున్నారు. ఈ దశలో క్షేత్రస్థాయి వాస్తవాలు తెలియకుండా, రెండు పెద్ద పార్టీలపై యుద్ధం చేయమని జోగయ్య ఇచ్చిన సలహా… వైసీపీకి బాగా లాభం కలిగించేదేనని విశ్లేషిస్తున్నారు. నేలవిడిచి సాము చేయడం పాత తరం నేతలకు అలవాటేనని, పవన్‌ కల్యాణ్‌ వారి సలహాలు పాటిస్తే రాజకీయంగా దెబ్బతినడం ఖాయమంటున్నారు.

‘జోగయ్యకు 90 ఏళ్లు వచ్చాయి. రాజకీయాల్లో ఇంకా ఆయన అప్‌డేట్‌ అయినట్లు లేరు. ఎప్పుడో పాతకాలం ఆలోచనలను మా పార్టీపై రుద్దుతున్నట్లు కనిపిస్తోంది. నిజంగా జోగయ్యకు సొంత బలం ఉంటే, పాలకొల్లులో చిరంజీవి పోటీ చేస్తే ఎందుకు ఓడిపోతారు? చిరంజీవిని జోగయ్య ఎందుకు గెలిపించలేకపోయారు? పోనీ, తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల్లో పీఆర్పీ కాపు అభ్యర్థులంతా ఎందుకు గెలవలేదు? అప్పుడు పీఆర్పీ ఒంటరిగానే పోటీ చేసింది కదా?’ అని ఓ నేత ప్రశ్నించారు. అసలు పాలకొల్లులో చిరంజీవి ఓటమికి కారణం ఎవరు? ఏ నాయకుడు తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం, చిరంజీవిని వెన్నుపోటు పొడిచారని పవన్‌ ఓసారి విశ్లేషించుకోవాలని కాపు నేతలు స్పష్టం చేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ మంచిదా? కాదా? ఆ పార్టీతో పొత్తు పార్టీకి ప్రయోజనమా? కాదా? అన్న చర్చ పక్కకుపెడితే, ఇప్పటి పరిస్థితిలో ఆ పార్టీతో కలసి పోటీ చేయటం రాజకీయంగా అవసరమా? కాదా? వైసీపీని గద్దె దింపాలన్న పవన్‌ ఆలోచనలకు అది ఉపయోగపడుతుందా? లేదా? అన్న కోణంపై జోగయ్య సలహాలివ్వకపోవడమే ఆశ్చర్యంగా ఉందంటున్నారు.

తమ పార్టీ అధినేత పవన్‌ ఓవైపు.. వైసీపీని గద్దె దింపేందుకు, అవసరమైతే ఒక అడుగు వెనక్కి తగ్గేందుకూ సిద్ధమని చెబుతుంతే, హరిరామజోగయ్య మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడటడమే వింతగా ఉందంటున్నారు. పవన్‌-చంద్రబాబు కలిసినప్పటి నుంచీ జనసేన పేరుతో టీడీపీ మీద- టీడీపీ నేతల పేరుతో జనసేన మీద సోషల్‌మీడియాలో జరుగుతున్న ఆరోపణలు-విమర్శలు-సవాళ్ల ప్రచార మర్మం గ్రహించే వయసు, జోగయ్యకు దాటిపోయిందన్న వ్యాఖ్యలు జనసైనికుల్లో వినిపిస్తున్నాయి.

అసలు కాపు ఉద్యమంలో ఏనాడూ ప్రత్యక్షంగా పాల్గొనని జోగయ్య.. కాపు సంక్షేమం గురించి మాట్లాడటమే ఆశ్చర్యంగా ఉందని అటు జనసైనికులు, ఇటు కాపు సంఘ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. వంగవీటి రంగా నుంచి మొన్నటి ఉద్యమం వరకూ.. జోగయ్య ఏ ఉద్యమంలోనూ కనిపించలేదని, అలాంటి వ్యక్తి పవన్‌కు సలహాలివ్వడమే వింతగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. రంగా హత్య, అంతకుముముందు కాపు ఉద్యమంలో జోగయ్య ఎక్కడున్నారు? చంద్రబాబు కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత, దాని అమలుకోసం జోగయ్య చేసిన పోరాటాలేమిటి? అని కాపు నేతలు నిలదీస్తున్నారు. ప్రస్తుత కాపు తరం… కాలం చెల్లిన సిద్ధాంతాలతో మనుగడ సాగిస్తున్న, జోగయ్య- ముద్రగడ పద్మనాభం వంటి నేతలను ఎప్పుడో మర్చిపోయిందని స్పష్టం చేస్తున్నారు.

ఈ వయసులో కూడా కాపుల్లో తన ఉనికి చాటుకునేందుకు.. జోగయ్య వంటి కాలం చెల్లిన ఆలోచనలున్న నేతల సలహాల వల్ల, తమ పార్టీకి ఎలాంటి ప్రయోజనం ఉండదని కాపు నేతలు స్పష్టం చేస్తున్నారు. నిజానికి తాజాగా జోగయ్య చేసిన వ్యాఖ్యలు, పరోక్షంగా అధికార వైసీపీకి లాభమని జనసేన నేతలు స్పష్టం చేశారు. జోగయ్య తన పుస్తకంపై అనేకసార్లు యు టర్ను తీసుకున్నారని, ఇటీవల టీడీపీతో జనసేన పొత్తు ఉండాలని చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

మళ్లీ ఇప్పుడు టీడీపీ-వైసీపీపై జనసేన యుద్ధం చేయాలంటున్న జోగయ్య సలహాలను, సీరియస్‌గా పట్టించుకోవలసిన పనిలేదంటున్నారు. 90 ఏళ్లు దాటిన వృద్ధుల మాదిరిగానే జోగయ్య మాట్లాడుతున్నారు తప్ప, సీనియర్‌ రాజీయ నేత మాదిరిగా మాట్లాడటం లేదని జనసైనికులు విశ్లేషిస్తున్నారు. వృద్ధాప్యం వల్ల మతిమరుపు సహజమని, అందువల్ల గతంలో ఏం మాట్లాడారో తెలియకపోవడం కూడా అంతే సహజమని వ్యాఖ్యానిస్తున్నారు.

‘జనసేన ఒంటరిగా వైసీపీ-టీడీపీతో యుద్ధం చేయాలని చెప్పడమంటే వైసీపీని గెలిపించి, మళ్లీ జనసేనను ఓడిపొమ్మని పరోక్షంగా చెప్పడమే. విపక్షాలఓట్లు, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోతే, పవన్‌ కోరుకున్నట్లు వైసీపీ ఎందుకు ఓడిపోతుంది? మరి ఆయన పోరాటానికి అర్ధమేమిటి? ఓట్లు చీలిపోతే వైసీపీకే లాభం గానీ, జనసేన-టీడీపీ ఎలా లాభపడతాయి? 90 ఏళ్లు వచ్చిన జోగయ్య ప్రస్తుత రాజకీయాలు, సోషల్‌మీడియా ప్రభావాన్ని ఫాలో అవుతున్నట్లు లేదు. ఆయన కొడుకుకు పాలకొల్లు సీటు కావాలంటే ఆ విషయాన్ని పవన్‌ను నేరుగా అడగవచ్చు. కానీ, ఇలా కాలం చెల్లిన సిద్ధాంతాలు-సమీకరణలు- సొంత అజెండాను పవన్‌పై రుద్ది, జనసేనను మరో ప్రజారాజ్యంగా మారుస్తామంటే మేమెందుకు అంగీకరిస్తాం’ అని ఓ సీనియర్‌ నేత ఆవేశపడ్డారు.

Leave a Reply