అనపర్తి మళ్లీ టీడీపీకే?

– దాని బదులు గోపాలపురం కోరుతున్న బీజేపీ
– బీజేపీ నుంచి పోటీ చేయమని నల్లమిల్లిని కోరిన బీజేపీ?
– తిరస్కరించిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి?
– అనపర్తిపై రాజమండ్రి ఎంపీ సీటు ప్రభావం
– అనపర్తిలో తక్కువ ఓట్లు వస్తే ఎంపీ సీటు గోవిందా
– ఆ ఆందోళనతోనే అనపర్తి మార్చుకోవాలని బీజేపీ యోచన?
– గోపాలపురం సీటు మార్పిడికి టీడీపీ అంగీకరిస్తుందా?
– బీజేపీకి ‘రాజమండ్రి’ ఫీవర్
( మార్తి సుబ్రహ్మణ్యం)

బీజేపీకి ‘రాజమండ్రి’ ఫీవర్ పెరుగుతోంది. రాజమండ్రి బీజేపీ ఎంపీ అభ్యర్ధిగా బరిలో ఉన్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి, అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం విజయాన్ని నిర్దేశించే స్థానం. గతంలో కూడా అనపర్తిలో తక్కువ ఓట్లు రావడం, వైసీపీకి కలసివచ్చింది. ఆ రకంగా టీడీపీకి బలమైన నియోజకవర్గమైన అనపర్తి టీడీపీ అభ్యర్ధిగా నల్లమల్లి రామకృష్ణారెడ్డిని ప్రకటించింది. అయితే ఈలోగా మార్పు చేర్పుల్లో భాగంగా బీజేపీ ఆ సీటును తీసుకోవడంతో వివాదం రగిలింది.

అనపర్తి సీటును స్థానికంగా కించిత్తు కూడా బలం లేని బీజేపీకి కేటాయించడంతో భగ్గుమన్న తమ్ముళ్లు రోడ్డెక్కారు. నల్లమిల్లికి మద్దతుగా కార్యకర్తలు నిరసన కొనసాగిస్తున్నారు. తనకు జరిగిన అన్యాయానికి నిరసనగా, నల్లమిల్లి తన తల్లిని రిక్షాలో కూర్చోబెట్టుకుని ప్రదర్శించిన నిరసన ఆయనకు సానుభూతి తెచ్చిపెట్టింది. జిల్లా టీడీపీ అగ్రనేతలు ఎంతమంది నచ్చచెప్పినా ఆయన తన నిరసన విరమించుకోవడం లేదు.

ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లు.. ఈ పరిణామాలు రాజమండ్రి ఎంపీ బీజేపీ అభ్యర్ధి విజయావకాశాలను దెబ్బతీసే స్థాయికి చేరాయి. స్థానిక పరిస్థితులను తెలుసుకున్న ఆర్‌ఎస్‌ఎస్ సైతం, నష్టనివారణకు రంగంలో దిగింది. రాజమండ్రిలో అనపర్తి, గోపాలపురం నియోజకవర్గాల్లో కూటమి దెబ్బతింటే, ఆ ప్రభావం రాజమండ్రి ఎంపీపై పడి తీరుతుంది. ఆ ఆందోళనతోనే రంగంలోకి దిగిన బీజేపీ నాయకత్వం.. రామకృష్ణారెడ్డి ముందు ఒక ప్రతిపాదన ఉంచినట్లు తెలుస్తోంది.

ఆ ప్రకారంగా ఆయనను బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేయాలని ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే తాను టీడీపీ అభ్యర్ధిగానే పోటీ చేస్తానని స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అనపర్తి టీడీపీకి ఇచ్చి, గోపాలపురం (ఎస్సీ) నియోజకవర్గాన్ని తీసుకోవాలన్నది బీజేపీ యోచనగా ఉంది. ఈ ప్రతిపాదనకు బీజేపీ నేతలు సుముఖంగానే ఉన్నప్పటికీ.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దానిని ఎంతవరకూ ఆమోదిస్తారో చూడాలంటున్నారు.

ఇకపై మార్పులకు బాబు అంగీకరించకపోవచ్చని, ఒకవేళ అంగీకరించినా అనపర్తి బదులు గోపాలపురం ఇవ్వకపోవచ్చంటున్నారు. అప్పుడు బీజేపీ 9 అసెంబ్లీ స్థానాలతో సర్దుకుపోవలసి ఉంటుంది. అయితే బీజేపీ రాష్ట్ర నాయకత్వం, టీడీపీతో దీనిపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి రెండురోజుల క్రితం బీజేపీ అగ్రనేతలు నిర్వహించిన ఒక వీడియో కాన్ఫరెన్సులో చర్చ జరిగినట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అనపర్తిలో బలమైన అభ్యర్ధిని నిలబెట్టకపోతే, అక్కడ రాజమండ్రి ఎంపీ అభ్యర్ధికి దాదాపు లక్షపైన ఓట్లు మైనస్ వచ్చే ప్రమాదం ఉందని బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ఏకైక పరిష్కారం అనపర్తి సీటును టీడీపీకి తిరిగి ఇచ్చివేయడమేనని స్థానిక పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. అసలు క్యాడర్ లేని రాజమండ్రిని ఎంపిక చేసుకోవడంలో, పార్టీ వ్యూహాత్మక తప్పిదం చేసిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అనపర్తిలో సర్కారుపై క్షేత్రస్ధాయి పోరాటాలు నిర్వహిస్తూ, చివరకు జైలుకు సైతం వెళ్లిన నల్లమిల్లికి విపరీతమైన సానుభూతి ఉంది. ఆయన స్థానాన్ని బీజేపీకి కేటాయించడంతో ఆ సానుభూతి మూడింతలయింది. పైగా అక్కడ టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. బీజేపీకి అనపర్తిలో బలం శూన్యం. అయినా ఆ సీటు కోరుకుని ఇప్పుడు కష్టాలు పడుతోంది. ఆ సీటు టీడీపీకి ఇవ్వకపోతే రాజమండ్రి ఎంపీ సీటుపై కూటమి ఆశలు వదలుకోవాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

Leave a Reply