– సీఎం నిర్ణయానికి తిరుగులేదని శిరసావహించాల్సిందే
– ఉన్నది జగన్ గ్రూప్ ఒక్కటే
– ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్
ముఖ్యమంత్రి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని శాసన మండలిలో ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్ చెప్పారు. సిఎం నిర్ణయానికి తిరుగులేదని, ప్రతి కార్యకర్త, నాయకులు శిరసావహించాల్సిందేనని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు ప్రాంతంలోని వైసిపి గ్రామ అధ్యక్షులు కన్నూరి జక్కరయ్య ఇంటివద్ద ఆయన విలేకర్లతో మాట్లాడారు.
రైతు పక్షపాతిగా, గ్రామీణ ప్రాంత వాసిగా రాజధాని రైతుల మేలు కోసం కృషి చేస్తామన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు మేలు ఎలా జరుగుతుంది? వారి భూముల ధరలు ఎలా పెరుగుతాయని అనే అంశాలను పరిశీలిస్తామని, రైతులు అంగీకరిస్తే వారితో, ఎమ్మెల్యే శ్రీదేవితో కలిసి మాట్లాడటానికి సిద్ధమని ప్రకటించారు. అయితే రైతులు రాజకీయాలకు అతీతంగా ముందుకు వస్తేనే తాను మాట్లాడతానన్నారు. రైతులతో పాటు రాజధానిలో ఎస్‌సి, ఎస్‌టి, బిసి ఇతర పేదలకు భూముల సమస్యల పరిష్కారంతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే శ్రీదేవితో రెండు మూడ్రోజుల్లో మాట్లాడతా…
వచ్చే ఎన్నికల్లో తాడికొండ అసెంబ్లీ స్థానాన్ని గెలవడమే లక్ష్యంగా అందరం కలసి కట్టుగా పనిచేస్తామని డొక్కా తెలిపారు. ఇందుకోసం అందర్నీ సమన్వయం చేసుకొని పని చేస్తామని, పార్టీలో గ్రూపులేమీ లేవని, ఉన్నది జగన్ గ్రూప్ ఒక్కటేనని అన్నారు. రెండు మూడ్రోజుల్లో ఎమ్మెల్యే శ్రీదేవితో మాట్లాడతానని, కార్యకర్తల్లో, నాయకుల్లో ఏమైనా అపోహలుంటే తొలగిపోతాయని చెప్పారు.
నియోజకవర్గంలో పార్టీ పటిష్టత కోసం, జగన్మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని మరింత శక్తివంతం చేసేందుకు పార్టీ అధిష్టానం తనను అదనపు సమన్వయకర్తగా నియమించిందని చెప్పారు. 2024 ఎన్నికల్లో టికెట్ డొక్కాకు ఇవ్వడానికే అదనపు సమన్వయకర్తగా నియమించారనే ప్రచారంపై ప్రస్తావించగా పార్టీ అధిష్టానం తనకు అలాంటి సంకేతాలేమీ ఇవ్వలేదని, తాను అలాంటి కోరిక వ్యక్తం చేయలేదని ఆయన తెలిపారు