– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
గుడివాడ, డిసెంబర్ 29: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి గుడివాడ రూరల్ మండలం మల్లాయిపాలెం పరిధిలో ఇచ్చిన స్థలాల్లో 8, 912 టిడ్కో గృహాలను నిర్మిస్తున్నట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వర రావు (నాని) చెప్పారు.
కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్ర నగర్ లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని గుడివాడ రూరల్ మండలం మల్లాయిపాలేనికి చెందిన లబ్ధిదారుడు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కుటుంబానికి చెందిన కైలా లోకేశ్వరి పేరుమీద జి ప్లస్ త్రీ గృహం మంజూరు అయిందని తెలిపారు. అయితే మూడవ ఫ్లోర్ లో టి-5 నెంబర్ ప్లాట్ ను కేటాయించారని చెప్పారు. వయసు రీత్యా కింది అంతస్తులో ప్లాట్ ను కేటాయించేలా చూడాలని కోరారు.
అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు ప్లాట్ల కేటాయింపు జరుగుతుందన్నారు. తాను తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత 2007 వ సంవత్సరంలో గుడివాడ నియోజకవర్గంలో అర్హులైన పేదలకు 10 వేల ఇళ్ల పట్టాలు కేటాయించాలని హైదరాబాద్ వరకు పాదయాత్ర చేశానని తెలిపారు. అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిని కలిసి వినతి పత్రాన్ని అందజేశానని చెప్పారు. స్పందించిన వైయస్సార్ గుడివాడ పట్టణంలోని పేద ప్రజల ఇళ్ల స్థలాల కోసం 77 ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఇచ్చారని చెప్పారు. ఈ భూమిలో టిడ్కో గృహాలను నిర్మిస్తున్నామని, అర్హులైన లబ్ధిదారులకు త్వరలో అందజేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి వేగవంతం చేశారని చెప్పారు. ఇళ్ల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనపై అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలను నిర్వహిస్తున్నారని తెలిపారు.
మొదటి విడతలో 85 వేల టిడ్కో గృహాల నిర్మాణ పనులు పూర్తయ్యాయని వివరించారు. మౌలిక వసతులను కూడా కల్పిస్తున్నామని తెలిపారు. రెండవ విడతలో చేపట్టిన ఇళ్లను 2022 జూన్ నాటికి, మూడో విడతలో చేపట్టిన ఇళ్లను డిసెంబర్ నాటికి పూర్తయ్యేలా సీఎం జగన్మోహన్ రెడ్డి చర్యలు చేపట్టారని అన్నారు. నిర్దేశిత సమయంలోగా టిడ్కో గృహాలను పూర్తిచేసి వాటిని లబ్ధిదారులకు అందించడం జరుగుతుందని మంత్రి కొడాలి నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుడివాడ రూరల్ మండల అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్ తదితరులు పాల్గొన్నారు.