– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
గుడివాడ, సెప్టెంబర్ 16: ఒకే సభ్యుడి కోసం బియ్యం కార్డులను ప్రభుత్వ నిబంధనల మేరకు ఇవ్వడం జరుగుతోందని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. గురువారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన ఏడిద రవికుమార్ కలిశారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ తన తల్లిదండ్రులు గతంలోనే మరణించారని, ఇప్పటి వరకు వివాహం కాలేదన్నారు. ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నానని, తనకు ప్రత్యేకంగా బియ్యం కార్డు లేదన్నారు. తన అన్నయ్య బియ్యం కార్డులోనే తన పేరు ఉందని, అక్కడి నుండి తొలగించి ప్రత్యేకంగా బియ్యం కార్డును మంజూరు చేయాలని గత ఆగస్టు 23 వ తేదీన కొవ్వూరు మండల తహసీల్దార్ కు స్పందన కార్యక్రమంలో అర్జీని అందజేశానని చెప్పారు. దీనిపై మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు ఒంటరి మహిళ, పురుషులకు బియ్యం కార్డులను మంజూరు చేస్తున్నామన్నారు. వివాహం కాని 50 ఏళ్ళు పైబడిన వారు, విడాకులు తీసుకున్నవారు, ట్రాన్స్ జెండర్లు, కుటుంబ సభ్యులెవరూ లేనివారికి బియ్యం కార్డులను అందజేస్తున్నామని చెప్పారు. ఈ కార్డుల కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. కుటుంబ సభ్యుల బియ్యం కార్డుల్లో పేర్లు ఉన్నవారికి వేరుగా బియ్యం కార్డును మంజూరు చేసే విషయాన్ని ప్రత్యేకంగా చూడాల్సి ఉంటుందని, ఈ విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారు. బియ్యం కార్డుల్లో బయోమెట్రిక్ కు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందన్నారు. ఒకే సభ్యుడు ఉండే బియ్యం కార్డులకు సంబంధించి బయోమెట్రిక్ పడకపోతే వాలంటీర్ల బయోమెట్రిక్ తో రేషన్ సరుకులను ఇస్తున్నామన్నారు. ఒకే సభ్యుడు ఉండి వేలిముద్ర పడకపోతే సరుకులను కోల్పోతున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి కొడాలి నాని తెలిపారు.