Suryaa.co.in

Andhra Pradesh

అక్రమ కేసులకు భయపడబోము

– ఆ ఘటన జరిగిన రోజు నేను బద్వేలులో ఉన్నాను
– మంగళగిరి పీఎస్‌లో విచారణకు హాజరైన వైయస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి
– విచారణ అనంతరం మంగళగిరి పీఎస్‌ వద్ద మీడియాతో మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి

మంగళగిరి: టీడీపీ ఆఫీస్‌ మీద దాడి కేసులో అక్రమంగా కేసులు బనాయించి, విచారణ పేరుతో దాదాపు నెలన్నరగా వైయస్సార్‌సీపీ నాయకులను వేధిస్తున్నారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.

ప్రజా పాలనను గాలికొదిలేసి కేవలం వైయస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడి చేస్తున్నారని.. నీచమైన అబద్ధపు కథనాలు సృష్టించి ప్రజల దృష్టి మరల్చడంతో పాటు, పార్టీ నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులను గురి చేసేందుకు తప్పుడు వాంగ్మూలాలు సృష్టిస్తున్నారని ఆయన ఆక్షేపించారు.

ఆ తర్వాత విచారణ పేరుతో పదే పదే పోలీస్‌ స్టేషన్లకు పిలిపించడం పరిపాటిగా మారిందని చెప్పారు. వైయస్సార్‌సీపీ నేతలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్‌ను విచారణ పేరుతో ఇప్పటికే మూడుసార్లు పిల్చారని.. ఇంకా మాజీ ఎంపీ, నందిగం సురేశ్‌ను జైలుకు పంపారని, ఆయనకు బెయిల్‌ దొరికితే, మరో కేసులో ఇరికించి జైల్లోనే ఉంచారని సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు.

ఏదైనా కేసులో విచారణ చేయాల్సి వస్తే నిబంధనల ప్రకారం పోవాలి తప్ప, వాళ్లు చెప్పారని.. వీళ్లు చెప్పారని వందల సంఖ్యలో నిందితుల లిస్టును పెంచుకుంటూ పోవడం, ప్రజల దృష్టి మరల్చడం, విచారణ పేరుతో వైయస్సార్‌సీపీ నాయకులను వేధించడం ప్రభుత్వానికి అలవాటుగా మారిందని చెప్పారు.

టీడీపీ ఆఫీసు మీద దాడి జరిగిన రోజున తాను బద్వేలు ఉపఎన్నిక ప్రచారంలో ఉన్నానని, ఈ విషయం టీడీపీ వారికి కూడా తెలుసని, అయినా తనను ఆ కేసులో 120వ నిందితుడిగా చేర్చారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇంకా లుక్‌ అవుట్‌ సర్క్యులర్‌ (ఎల్‌ఓసీ) జారీ చేసి, విదేశం నుంచి తిరిగి వస్తుండగా, ఎయిర్‌పోర్టులో ఆపి ఇబ్బంది పెట్టాలని చూశారని వెల్లడించారు. తాను స్వేచ్ఛగా తిరగకుండా వేధించాలన్నదే ప్రభుత్వ అభిమతంగా ఉందని అన్నారు.

ఈరోజు వారు మొదలుపెట్టిన ఈ విష సంస్కృతికి, భవిష్యత్తులో తప్పనిసరిగా తాము కూడా బదులు తీర్చుకోవాల్సి వస్తే పరిస్థితి ఏమిటని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. తమ ప్రభుత్వ హయాంలో ఏ కేసులో అయినా పక్కా దర్యాప్తు తర్వాత ఆధారాలుంటేనే చట్టపరంగా ముందుకు వెళ్లాం తప్ప, ఈ విధంగా తప్పుడు కేసులు బనాయించి, ఇలా వేధించలేదని స్పష్టం చేశారు.

ప్రతిపక్షం లేకుండా చేయాలనే భ్రమల్లో బ్రతికితే అంతకన్నా అవివేకం ఉండదన్న ఆయన, ఇప్పటికైనా సీఎం చంద్రబాబు వైఖరి మార్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో తాము పోలీసులను నిందించడం లేదని, కేవలం రాజకీయ దురుద్దేశాలు మాత్రమే ప్రశ్నిస్తున్నామని చెప్పారు. జగన్‌పై నానాటికీ పెరుగుతోన్న ప్రజాదరణ నుంచి అందరి దృష్టి మళ్లించడం కోసమే, ఈ విధంగా అక్రమ కేసులతో వేధిస్తున్నారని తేల్చి చెప్పారు.

ఇప్పుడు దాన్ని మరింత తీవ్రం చేసేందుకు కేసును సీఐడీకి అప్పగిస్తున్నారన్న ఆయన, దీని వల్ల మరిన్ని అక్రమ అరెస్టులు జరగొచ్చని చెప్పారు. వీటన్నింటివల్ల తమలో కసి, పట్టుదల మరింత పెరుగుతుంది తప్ప, అక్రమ కేసులకు ఏ మాత్రం భయపడబోమని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE