హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు హిందూ దేవాలయాల పై దాడులు పెరిగిపోతున్నాయని.. వాటిని అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోందని విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆందోళన వ్యక్తం చేస్తుంది.
దేవాలయాలకు రక్షణ కల్పించాలని.. హిందువుల మనోభావాలను గౌరవించాలని.. దేవతామూర్తుల విగ్రహాలను ధ్వంసం చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 19వ తేదీన (శనివారం) రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది.
శనివారం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో భారీ ధర్నాలు నిర్వహిస్తున్నట్లు విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు నరసింహమూర్తి , బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివ రాములు తెలియజేశారు.
ధర్నా అనంతరం ఆయా జిల్లా కేంద్రాలలో కలెక్టర్లను కలిసి వినతిపత్రం సమర్పిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలపై జరుగుతున్న దాడుల వివరాలను అందజేస్తామని పేర్కొన్నారు.
హిందూ బంధువులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ధర్నా కార్యక్రమాలను విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు కక్కుర్తి పడిన రాష్ట్ర ప్రభుత్వం.. హిందువుల మనోభావాలు తీవ్రంగా గాయపరుస్తోందని విమర్శించారు.
భాగ్యనగరంలో వరుసగా హిందూ దేవాలయాలపై , దేవతామూర్తులపై దాడులు చేసి, ధ్వంసం చేస్తున్న కూడా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి లేదా సంబంధిత దేవాదాయ శాఖ మంత్రి, హోం మంత్రి మరెవరు దేవాలయాలపై దాడుల విషయంలో నోరుమెదకపోవడం హిందూ వ్యతిరేక కార్యకలాపాలలో భాగమేనని బజరంగ్ దళ్ నేతలు తీవ్రంగా దుయ్యబట్టారు.
శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే నిరసన కార్యక్రమాలలో రాజకీయాలకు అతీతంగా భారీ ఎత్తున హాజరుకావాలని హిందువులకు పిలుపునిచ్చారు.