– అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం
* బడ్జెట్ పై చర్చలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
* వాళ్లవన్నీ అబద్ధాలే…
* శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీపై మంత్రి సవిత ఫైర్
అమరావతి : గత జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చుకుంటూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళిశాఖామాత్యులు ఎస్.సవిత తెలిపారు. గురువారం శాసనమండలిలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, వైసీపీ సభ్యులు తమ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, అబద్ధాలు వల్లివేస్తున్నారని, అసత్యాలు మాట్లాడుతున్నారని, ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని మండిపడ్డారు.
అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబునాయుడు మెగా డీఎస్సీ నిర్వహణపై మొదటి సంతకం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. పెన్షన్లు పెంచామని, అన్న క్యాంటీన్లు ప్రారంభించామని, మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామన్నారు.
గత జగన్ ప్రభుత్వం సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పి పట్టించుకోడం మానేసిందన్నారు. పెన్షన్లు మూడు వేలకు పెంచుతామని, అయిదేళ్ల పాటు వాయిదాల రూపంలో పెంచారని ఎద్దేశా చేశారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు తమ ప్రభుత్వం తీరుస్తూ… అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, సంపద సృష్టిస్తున్నామని మంత్రి సవిత తెలిపారు.