• శానసమండలి ప్రశ్నోత్తర సమయంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
• 2024-25లో బీసీ కార్పొరేషన్ ద్వారా 89,686 మందికి లబ్ధి చేకూరేలా లక్ష్యం
• రూ.1,793.72 కోట్ల మేర రుణాల అందజేత
• ఎన్బీసీఎఫ్డీసీ పథకాల కింద మరో రూ.207.90 కోట్ల ఆర్థిక సాయం
• మొత్తం రూ.957.86 కోట్ల మేర సబ్సిడీ వర్తింపు
– బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవిత
అమరావతి : ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వెనుబడిన తరగతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.39,007 కోట్లు కేటాయించిందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. శాసనమండలిలో గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీలు రాజగొల్ల రమేష్ యాదవ్, దువ్వాడ శ్రీనివాస్, కృష్ణరాఘవ జయేంద్ర భరత్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సవిత స్పందించారు.
వెనుకబడిన తరగతుల సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దీనిలో భాగంగా వ్యక్తిగతంగా, గ్రూపులుగా లబ్ధి చేకూరేలా వివిధ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా బడ్జెట్ లో బీసీల సంక్షేమానికి రూ.39,007 కోట్లు కేటాయించామన్నారు.
2024-25 ఆర్థిక సంవత్సరంలో బీసీ కార్పొరేషన్ ద్వారా పలు పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఎన్బీసీఎఫ్డీసీ పథకాల కింద 2,227 మంది బీసీ లబ్ధిదారులకు ప్రయోజనం కలిగేలా రూ.207.90 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీ ఏ, బీ, డీ, ఈ సామాజిక వర్గాలకు చెందిన 89,686 మంది లబ్ధిదారుల అభివృద్ధికి రూ.896.86 కోట్లు కేటాయించామన్నారు.
బ్యాంకుల నుంచి మరో రూ.896.86 కోట్లను జత చేస్తూ మొత్తం రూ.1,793.72 కోట్లను బీసీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు రుణాలు అందజేయనున్నామన్నారు. ఇలా ఎన్బీసీఎఫ్డీసీ పథకాలకు రూ.61 కోట్లు, బీసీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే రుణాలకు రూ.896.86 కోట్లు సబ్సిడీ…ఇలా మొత్తం రూ.957.86 కోట్ల మేర సబ్సిడీ అందివ్వనున్నామని మంత్రి సవిత స్పష్టంచేశారు.