– అరాచక పాలనపై ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకే ఎంతకైనా దిగజారుతున్నారు
– టీడీపీ ఎమ్మెల్యే స్వామి ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి యత్నం ఘటనను ఖండిస్తున్నాం
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు
వైసీపీ అరాచకాలపై ప్రశ్నిస్తున్న టీడీపీ నేతలపై ఆ పార్టీ గూండాలు దాడులకు తెగబడటం హేయం. ప్రకాశం జిల్లాలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి బీ ట్యాక్స్ వసూళ్లను బయటపెట్టినందుకు టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి ఇంటిపై దాడి చేసేందుకు వైసీపీ గూండాలు యత్నించడం దారుణం. ప్రజా సమస్యలను గాలికొదిలేసి రాష్ట్రాన్ని వైసీపీ నేతలు దోచుకుంటుంటే మేం చూస్తూ ఊరుకోవాలా ?
ఆర్థిక సంక్షోభం, కోర్టు మొట్టికాయలు, భూ కబ్జాలపై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతతో ముఖ్యమంత్రి మొదలు వైసీపీ కార్యకర్తల వరకూ తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఏం చేయాలో పాలుపోక ప్రత్యర్థులను వేధిస్తూ వారి ఇళ్లపై దాడులు చేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. మూడేళ్లు మంత్రిగా పనిచేసిన బాలినేని ఒక్క ప్రజా ఉపయోగకరమైన పని చేశారా? సొంత జిల్లా ప్రకాశంలో అభివృద్ది పనులు ఏమైనా చేపట్టారా?
రాష్ట్రవ్యాప్తంగా జే ట్యాక్స్ వసూలు చేస్తుంటే ప్రకాశం జిల్లాలో బాలినేని ట్యాక్స్ వసూలు చేస్తోంది నిజం కాదా? మీరు చేసినవే చెప్తే అంత ఉలుకెందుకు? వైసీపీ కార్యకర్తలు దాడులు చేయాల్సింది టీడీపీ నేతల ఇళ్లపై కాదు. మచ్చుకైనా అభివృద్ధి చేయకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పన్నులతో ప్రజలను హింసిస్తున్న నేతలపై తిరగబడండి. మూడేళ్లలో ఏం సాధించారని ప్రశ్నించండి. ఎమ్మెల్యే స్వామి ఇంటికి దాడికి యత్నించిన వైసీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేయాలి. మరోసారి ఇలాంటిపనులు చేయకుండా వార్నింగ్ ఇవ్వాలి.