– రోడ్డెక్కిన వైకాపా వర్గ పోరు
విశాఖ జిల్లా ఎస్.రాయవరం మండలం అడ్డరోడ్డు కూడలి వద్ద పోలీసులు, వైకాపా నాయకుల మధ్య తోపులాట జరిగింది. ఎంపీపీ బొలిశెట్టి శారదాకుమారి వర్గీయులు స్థానిక ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు
వ్యతిరేకంగా పెద గుమ్ములూరు నుంచి అడ్డరోడ్డు వరకు సుమారు 1000 మంది నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీ చేపట్టారు.
జాతీయ రహదారి కూడలి వద్దకు రాగానే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, వైకాపా నాయకుల మధ్య తోపులాట జరగింది. పోలీసులను దాటుకుని వైకాపా నాయకులు జాతీయ రహదారిపై
బైఠాయించారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు వచ్చి నాయకులకు సర్దిచెప్పడంతో అక్కడి నుంచి పాత జాతీయ రహదారి కూడలి వద్దకు చేరుకుని మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు.
ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ‘జగన్ ముద్దు.. ఎమ్మెల్యే వద్దు’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ సభ్యురాలు కాకర దేవి మాట్లాడుతూ పార్టీలో కష్టపడిన ఎంపీటీసీలు, సర్పంచులకు ప్రాధాన్యత ఇవ్వకుండా డబ్బు, కులాలకు ఎమ్మెల్యే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. దీనిపై అధిష్ఠానం దృష్టి సారించి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరారు.