తమరు కొత్తగా సాధించిందేమిటి?

Spread the love

మాన్య ముఖ్యమంత్రి గారు నూతన సంవసత్సర మొదటిరోజు పెన్షన్లు పెంచి పంచడానికి ప్రత్తిపాడు వచ్చి సభలో ప్రసంగించడం జరిగింది. ఆలస్యంగానైనా పెన్షన్లు పెంచడం అభినందనీయం.వారి ప్రసంగంలోని నాలుగు అంశాలు అభ్యంతరకరంగా నాకు తోచినాయి.

1.”పేద పిల్లలకు ఇంగ్లీష్ చదువులు చెప్పించాలని ఆలోచన చేస్తే అడ్డుకుంటున్నారు”
2.”అమరావతి అని చెబుతున్న రాజధానిలో పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని ఆరాటపడితే కులాలమధ్య మార్పులు చేర్పులు వస్తాయని కోర్టులో పిటిషన్లు వేస్తారు”.
3.”పేదవాడికి అందుబాటు రేటుకు వినోదం అందించాలని సినిమా టికెట్ల ధరలు నిర్ణయిస్తే దానిపై రాద్దాంతము చేస్తున్నారు”.
4.ఇంతకంటే దౌర్భాగ్యమైన నాయకులు ఉంటారా? వీళ్లు పేదల గురించి ఆలోచన చేస్తారా? వీళ్ళు శత్రువులు కాదా?

చర్చ:1.చదువు విషయంలో అందరికీ బోధనాంశము, బోధనా మాధ్యమం ఒకేరీతిగా ఉంటుంది. పేదలకు ఒకరకంగాను, ధనికులకు మరోవిధంగాను ఉండదు.
ప్రాధమిక విద్య మాతృభాషలో నేర్పిన దేశాలే మంచి అభివృద్ధి సాధింఛాయని చరిత్ర చెబుతున్న సత్యం. కనుక ప్రాధమిక విద్య మాతృభాషలో ఉండాలని సర్వుల అభిప్రాయం. ఇంగ్లీష్ భాషను నేర్పవద్దని ఎవరూ అనలేదు.

ప్రస్తుతం పాఠశాలలలో ఉన్న ఉపాధ్యాయులలో 95 శాతం ఇంగ్లీష్ భాషమీద పట్టు లేనివారు. వారు ఇంగ్లీషులో చేసే బోధన నిష్ఫలంగా ఉందని ఇటీవల విద్యాశాఖ నిర్వహించిన సర్వేలో వివరించారు. ఉపాధ్యాయులకు విద్యార్థులకు మధ్య అంతరం పెరిగిపోతుందని కూడా వారు అభిప్రాయపడ్డారు.తగిన భాషా ప్రావీణ్యం లేని వారితో బోధన చేయించడం విద్యార్దులకు నష్టమేగదా!
ఏది ఉత్తమమైన విధానమో ప్రజలకు అర్ధమైనది.ప్రభుత్వమే అర్ధం చేసుకోవాలి.

2.అమరావతి అని చెబుతున్న రాజధానిలో అనడంలొనే తేడా ఉన్నది. నిండు సభలో అమరావతిని రాష్జరాజధానిగా అంగీకరించి, నాలుగు సంవత్సరాలు గడిచి, అధికారం రాగానే మాటమార్చి, మూడు రాజధానులు నాటకాన్ని నడిపిన చేదు జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి.
పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వజూపినారా!ఎవరికి? ఎక్కడెక్కడో గ్రామాలకు చెందినవారికి రాజధానిలో స్థలాన్ని ఇవ్వడమేమిటి? వారివారి గ్రామాలలో ఇవ్వవద్దని ఎవరూ అనలేదే!
పేదలమీద అంత ప్రేమగల మీరు ఇప్పటికే నిర్మించబడిన టిడ్కో గృహాలను లబ్దిదాలకు ఇంతవరకూ ఇవ్వకపోవడం వెనుక కారణం ఏమిటి? రాజధాని పేదలకు నెలకు రూ. 5000/-పెన్షన్ ఇస్తామని వాగ్దానం చేసి, అమలు చేయలేదేందుకు? కనీసం పాత విధానంలో ఇచ్చే రూ 2500/- చెల్లింపులో ఆరేడు నెలల జాప్యం చేయడం కూడా పేదలపై మీకు ప్రేమవున్నదని చెప్పదానికి నిదర్శనమేనా!
రైతులు రాజధాని నిర్మాణార్ధం ఇచ్చిన భూమిలో నిర్మాణాలను నిలుపుదలచేసి ఎవరికో కట్టబెడతానంటే కోర్టులకు వెళ్లకుండా చూస్తూ ఊరుకుంటారా!

3.పన్నులమోత, నిత్యావసరాల రేట్ల పెరుగుదల, డీసెల్,పెట్రోలు, వంట గ్యాస్ ధరలు సగటు మనిషి నడ్డి విరుస్తున్నాయి. అవసరమైన వీటి ధరలు తగ్గించకపోగా వినోదం గుర్తుకు రావడం విడ్డూరం కాదా?
4.ప్రతిపక్ష పార్టీలు పేదల గురించి ఆలోచిస్తాయా అనడం ‘గుడ్డు వచ్చి పిల్లనెక్కిరించిందట’ అన్న సామెతలా ఉంది.

ఏనాడో అమ్మ ఇందిరమ్మ పేదలకు “కూడు,గూడు,గుడ్డ” సమకూర్చాలని పథకాలు రచించి, దేశవ్యాప్తంగా అమలు చేసిన సంగతి మరిచారా? పేదల కొరకు కోట్లాది గృహాలు నిర్మించారు.రాయితీలో బట్టలు సమకూర్చారు. చౌక ధరలలో ఆహార ధాన్యాలను సరఫరా చేయించారు.తదుపరి పాలన చేసిన ప్రభుత్వాలు అదేబాటలో నడిచాయి.తమరేదో కొత్త ఘనత సాధించినట్లు చెప్పుకోవడం హాస్యాస్పదం.ప్రతిపక్షాలు పేదలకు శత్రువులు అనడం ప్రజల మధ్య ద్వేషభావాలు ప్రేరేపించడం అవుతుంది.మిగిలిన విషయాలను నేను ప్రస్తుతం ప్రస్తావించదలచలేదు.

– జీఎన్‌ఆర్

Leave a Reply