– తెలుగుదేశం పార్టీ బీసీ సెల్
ఏపీలో సొంత సామాజికవర్గానికి నిధులు, విధులు ఉన్న పదవులు కేటాయించి బీసీలను అవమానపరిచారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర మండిపడ్డారు. బీసీ కార్పొరేషన్ను నిర్వీర్యం చేశారన్న కొల్లు రవీంద్ర.. అవసరమైతే పస్తులుంటాం తప్పా ఆత్మాభిమానాన్ని చంపుకుని బీసీలెవ్వరూ జగన్కు దాసోహం అనరని స్పష్టం చేశారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో పార్టీ బీసీ సెల్ సమావేశమైంది.
ఏపీలో దుర్మార్గమైన పాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి బీసీలను అన్ని విధాలా వంచించారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. బీసీ కార్పొరేషన్ ద్వారా నామమాత్రపు పదవులే తప్పా ఏ ఒక్కరికీ న్యాయం జరగలేదని ఆయన విమర్శించారు. సొంత సామాజిక వర్గానికి నిధులు, విధులు ఉన్న పదవులు కేటాయించి బీసీలను అవమానపరిచారని మండిపడ్డారు.
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో బీసీ నేతలు సమావేశమయ్యారు. వైకాపా ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు ఇచ్చిన హామీల అమలు, నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు జరిగిన అన్యాయం, సక్రమంగా అమలు కాని రిజర్వేషన్లు వంటి అంశాలపై చర్చించారు. నిధులు-విధులు లేని కార్పొరేషన్ పదవులు కేటాయించారని మండిపడ్డారు. బీసీలపై జరుగుతున్న దాడులు, వేధింపుల అంశాలపై నేతలు చర్చించారు.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బీసీలకు కేటాయించిన నామినేటడ్ పదవులన్నింటినీ జగన్ సొంత సామాజికవర్గానికి ఇచ్చుకున్నారని, బీసీ కార్పొరేషన్ నిర్వీర్యం చేశారని కొల్లు రవీంద్ర ఆరోపించారు. అవసరమైతే పస్తులుంటాం తప్పా ఆత్మాభిమానాన్ని చంపుకుని బీసీలెవ్వరూ జగన్కు దాసోహం అనరని కొల్లు స్పష్టం చేశారు. అంతకు ముందు మహాత్మ జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా నేతలు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, ఇతర బీసీ నాయకులు హాజరయ్యారు.