Suryaa.co.in

Andhra Pradesh

మాట ఇచ్చాం… నిలబెట్టుకున్నాం

– ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం
– సూపర్‌ సిక్స్‌లో భాగమైన ఉచిత గ్యాస్‌ పంపిణీ చేస్తున్నాం
– ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌

రాజమహేంద్రవరం : ఎన్నికల సమయంలో సూపర్‌ సిక్స్‌ పథకాల ద్వారా సంక్షేమ పాలన అందిస్తామంటూ రాష్ట్ర ప్రజలకు మాట ఇచ్చాం… ఆ మాట నిలబెట్టుకుంటున్నామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు) అన్నారు. సూపర్‌ సిక్స్‌ పథకంలో భాగంగా ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పథకాన్ని శుక్రవారం ఆయన గోదావరి గట్టున ఉన్న రజక కల్యాణ మండపంలో జాయింట్‌ కలెక్టర్‌ చిన్న రాముడు, ఆర్డీవో కృష్ణ నాయక్‌, కూటమి నాయకులు, అధికారులతో కలిసి అర్హులకు ఉచిత గ్యాస్‌ సిలెండర్లు అందచేసి ప్రారంభించారు.

అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగమైన సూపర్‌ సిక్స్‌లో ప్రధానమైన దీపం పథకం-2 క్రింద లబ్ధిదారులకు గ్యాస్‌ సిలిండర్‌లను పంపిణీ చేస్తూ ఇచ్చిన హామీని నిలబెట్టుకుందన్నారు. ఎన్నికల ముందు లబ్ధిదారులకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీల్లో ఒక్కొక్కటిగా చిత్తశుద్ధితో అమలు చేస్తున్నమన్నారు.

ప్రభుత్వం సంవత్సరానికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఇస్తుందని ముందుగా లబ్ధిదారులు సిలిండర్‌ కి అవసరమైన డబ్బును చెల్లిస్తారని, అనంతరం రెండు రోజుల్లో తిరిగి వారి ఖాతాలకు ప్రభుత్వం జమ చేస్తుందన్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు విధి విధానాలు వివిధ మాధ్యమాలు ద్వారా అధికారులు తెలియజేయడం జరిగిందన్నారు. అప్పు చేసి హామీలను నెరవేర్చే కంటే, సంపద సృష్టించి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాన ఉద్దేశం అని ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వం ఆర్థికపరమైన క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ చేస్తున్న ఈ కార్యక్రమాలకు ప్రజలు అండదండలు ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఉచిత ఇసుక విధానం వలన భవన నిర్మాణ కార్మికులు, అన్న క్యాంటీన్లు నిర్వహణ కారణంగా వివిధ బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలు, పరిశ్రమల అభివృద్ధి వలన వ్యాపార వేత్తలు, చెత్త పన్ను నిర్మూలన వలన ప్రజలందరూ ఆనందంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

సంక్షేమ అభివృద్ధి ఫలాలను చూసి ఓర్వలేని గత ప్రభుత్వ నాయకులు ఈర్ష ద్వేషాలను వెళ్ళగక్కుతూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రభుత్వమే భరాయిస్తుందని, విద్యుత్‌ చార్జీలను పెంచబోమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా సోషల్‌ మీడియాలో ఎవరు పోస్ట్‌ చేసిన లేదా షేర్‌ అటువంటి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కాశి నవీన్‌ కుమార్‌, అత్తి సత్యనారాయణ, బుడ్డిగ రాధా, యిన్నమూరి దీపు, నిమ్మలపూడి గోవింద్‌, సప్పా వెంకట రమణ, కడలి రామకృష్ణ, దాస్యం ప్రసాద్‌, పెంటపాటి సుభాష్‌, చాపల చిన్న రాజు, ముద్రగడ జయరామ్‌, గొర్రెల రమణి, అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE