Suryaa.co.in

Andhra Pradesh

మూడేళ్లలో వైద్యరంగంలో 45 వేల ఉద్యోగాలు భర్తీచేశాం..

– రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం పెద్దపీట.
– రాష్ట్రంలో 2,400 ఆసుపత్రుల్లో ‘వైఎస్సార్ ఆరోగ్యశ్రీ‘ అమలు..
– రూ.16,255 కోట్లతో వైద్యరంగంలో మౌలిక సదుపాయాల కల్పన, ఆసుపత్రుల
అభివృద్ది.
– వైద్యరంగంలో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీచేస్తున్నాం..
– వివరాలను వెల్లడించిన వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టీ. కృష్ణబాబు

పేద, మధ్య తరగతి ప్రజలందరికీ మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పిస్తూ వైద్య రంగంలో అనేక సంస్కరణలను తీసుకొచ్చి వినూత్న మార్పులకు ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టీ కృష్ణబాబు తెలిపారు. గత మూడేళ్లలో వైద్య శాఖలో 45 వేల ఉద్యోగాలు భర్తీ చేసామన్నారు. విజయవాడ ఆర్ అండ్ బీ బిల్డింగ్ లోని బుధవారం రాష్ట్రంలో ప్రజలకు అందిస్తున్న ఆరోగ్య, వైద్య సేవల వివరాలను మీడియా ప్రతినిధులకు వివరించారు.

ఈ సందర్భంగా ఎం.టీ. కృష్ణబాబు మాట్లాడుతూ… ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైద్యరంగంలో ఏర్పడిన ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తున్నామని, ఇప్పటికే 45 వేల మందిని నియమించామని తెలిపారు. కొత్తగా 5వేల మందిని నియమించడానికి నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. వైద్యరంగంలో నాడు-నేడు కింద రూ.16,255 కోట్లతో ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలు, అన్నిస్థాయిల్లో వైద్య పరికరాలు, ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న 11 మెడికల్ కాలేజీలతో పాటు మరో 16 క్రొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు చేస్తున్నామని.. వీటిలో 5 మెడికల్ కాలేజీలు 2023 నాటికి సిద్దం చేస్తున్నామని, మిగతా కాలేజీలు 2024 నాటికి పూర్తిచేస్తామని ఆయన తెలిపారు. అలాగే గ్రామస్థాయి నుంచి ప్రజలకు వైద్యసేవలను మరింత చేరువచేస్తూ వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు చేశామన్నారు. ప్రతి గ్రామంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎంతో కలిపి మొత్తం 5 మంది వైద్యసిబ్బంది ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. ప్రతి గ్రామానికి నెలలో రెండుసార్లు మొబైల్ మెడికల్ యూనిట్ ద్వారా వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. అలాగే ప్రతీ మండలంలో 2 పీహెచ్‌సీలను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ప్రతి పీహెచ్‌సీ నుంచి టెలి మెడిసిన్‌ సదుపాయం కల్పించి అందరికీ వైద్య సహాయం అందిస్తున్నామన్నారు. జిల్లా స్థాయిలో ఒక మెడికల్ హాబ్ ఏర్పాటు చేసి, స్పెషలిస్ట్ డాక్టర్లు ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. గ్రామ స్థాయి నుంచి.. ప్రతి పీహెచ్‌సీలో 67 రకాల మందులు, 14 రకాల టెస్టులు అందుబాటులో​ ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. పీహెచ్‌సీలో గర్భిణీలు, బాలింతలకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్న ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాలకనుగుణంగా ప్రతి గర్బిణీకి రెండు సార్లు స్కానింగ్ చేయిస్తున్నామని, బాలింతలను తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌తో వారిని క్షేమంగా ఇంటికి చేరవేస్తున్నామని తెలిపారు. గర్భిణీలు, బాలింతలకు డాక్టర్, ఆశా, ఏఎన్ఎంల ద్వారా సలహాలు, సూచనలు అందిస్తూ ఎప్పటికప్పుడు వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యం అందిస్తున్నప్పటికీ 1, 2 శాతం లోపాలను కొన్ని మీడియా సంస్థలు ఎత్తిచూపుతున్నాయని, ప్రభుత్వం చేస్తున్న మంచిని కూడా ప్రచారం కల్పించి ప్రజలకు మరింత మేలు కలిగేలా వారు బాధ్యత తీసుకోవాలని ఆయన కోరారు.

రాష్ట్రంలో 2,400 ఆసుపత్రుల్లో, ఇతర రాష్ట్రాల్లో 238 ఆసుపత్రుల్లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం సమర్థవంతంగా అమలు జరగుతుందని ఎం.టి. కృష్ణబాబు తెలిపారు. జూలై నెల వరకూ ఆరోగ్యశ్రీ అన్ని బిల్లుల చెల్లింపులు పూర్తి చేశామన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 83,400 మంది ఆరోగ్యశ్రీలో వైద్యసేవలు పొందారని, వీరికి ప్రభుత్వం 85 కోట్లు ఖర్చు చేసిందని, ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లోనే 40 కోట్లు ప్రభుత్వం వెచ్చించి ఈ పథకం కింద వైద్య సేవలు అందించామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 25 శాతం వరకూ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తున్నామని, దీనిని 50 శాతానికి పెరిగేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ భవ, ఆరోగ్యశ్రీ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. మారుమూల ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు అందించే ప్రొత్సాహకాలతో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామన్నారు. రిమోట్ ప్రాంతాల్లో పని చేయటానికి నిపుణులు, వైద్యులు ముందుకు రావటం లేదనే కారణంతో అటువంటి ప్రాంతాల్లో పని చేయటానికి వచ్చే స్పెషలిస్టులకు 50 శాతం, ఎంబీబీఎస్ వైద్యులకు 30 శాతం అదనపు ప్రయోజనాలు ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. స్పెషలిస్టుల కొరత తీర్చేందుకు ఏడాది పాటు పీజీ విద్యార్థులకు రూరల్ ఏరియాలో సర్వీస్ చేసేలా ప్రణాళికలు సిద్దం చేశామన్నారు. కొన్ని ఆసుపత్రుల్లో స్పెషలిస్ట్ ల కొరత ఉందన్నారు. పులివెందులలో 17 మంది డాక్టర్లు ఉన్నారని, మిగతా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేశామన్నారు. బయోమెట్రిక్ హాజరు పెట్టిన తర్వాత డాక్టర్ల పనితీరు మెరుగుపడిందన్నారు. వైద్య రంగంలో ప్రస్తుతం ఉన్న ఖాళీలను సెప్టెంబర్ చివరి నాటికి భర్తీ చేస్తామన్నారు.

పాడేరు ప్రాంతంలో ఏడుగురిలో ఆంత్రాక్స్ లక్షణాలు కనిపించాయని, కానీ పరీక్షల్లో నెగటివ్ రిపోర్ట్స్ వచ్చాయని వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ జె. నివాస్ తెలిపారు. అయినా టిష్యూ కల్చర్ కోసం శాంపుల్స్‌ ను విశాఖకు పంపించామని, గురువారం ఫలితాలు వచ్చే అవకాశం ఉందని నివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ వినోద్ కుమార్, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రాఘవేంద్రరావు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE