Suryaa.co.in

Andhra Pradesh

పిల్లల బంగారు భవిష్యత్తు కోసం విద్యా వ్యవస్థలో కీలక సంస్కరణలు చేశాం

-విద్యారంగంపై ఈ నాలుగేళ్లలో రూ.రూ.60,329 కోట్లు ఖర్చు చేశాం
-పాఠశాల ప్రారంభమైన తొలిరోజే జగనన్న విద్యా కానుక అందిస్తున్నాం
-విద్యా కానుక కిట్‌లో క్వాలిటీకి ప్రాధాన్యమిస్తూ మెరుగైన మార్పులు తెచ్చాం
-విద్యా కానుక కిట్ల కోసం ఈ ఏడాది రూ.1,042 కోట్లు ఖర్చు చేశాం
-ఒక్కో కిట్‌ కోసం రూ.2400 ఖర్చు చేసి అందిస్తున్నాం
-అమ్మ ఒడి పథకానికి ఈ నాలుగేళ్లలో అక్షరాల రూ.19,674 కోట్లు ఖర్చు చేశాం-వి
ద్యా దీవెన పథకానికి ఇప్పటి వరకు అక్షరాల రూ.10,636 కోట్లు ఖర్చు
-జగనన్న వసతి దీవెన కోసం రూ.4,275 కోట్లు ఖర్చు
-5,18,740 ట్యాబ్‌ల కోసం రూ.685 కోట్లు ఖర్చు చేసి గత సంవత్సరం అందజేశాం
-ఈ ఏడాది నుంచి టోఫెల్‌ పరీక్షలకు సిద్ధం చేసే కార్యక్రమం చేపట్టాం
-ఇందుకోసం అమెరికాకు చెందిన సంస్థతో ఒప్పందం చేసుకున్నాం
-రాష్ట్రంలోని 52 మంది ఇంగ్లిష్‌ టీచర్లకు అమెరికాలో శిక్షణ ఇప్పించనున్నాం
-స్కూళ్లలో సీబీఎస్‌ఈ, ఇంగ్లిష మీడియం తీసుకొచ్చాం
-ఏఐ, ఏఆర్, వీఆర్, చాట్‌ జీపీటీ, వెబ్‌ 3.0పై ఇప్పటినుంచే అవగాహన
-3వ తరగతి నుంచే సబ్జెక్ట్‌ టీచర్లు, రోజుకో మెనూతో పౌష్టికాహారం
-గత ప్రభుత్వంలో ఇవన్నీ ఎందుకు లేవో ఒకసారి ఆలోచన చేయండి
-పేద పిల్లలు ఇంగ్లిష్‌ మీడియం చదివినా, ట్యాబ్‌లు పట్టుకున్న చంద్రబాబుకు నచ్చదు
-చంద్రబాబుది పెత్తందారీ మనస్తత్వం.. బాబు బతుకే ఓ పెద్ద మోసం, అబద్ధం
-బాబు పేరు చెబితే ఒక్క పథకం గుర్తురాదు.. గుర్తొచ్చేది వెన్నుపోటు, కుట్ర, దగా
-దుకాణం మూసేయడానికి సిద్ధంగా ఉన్న టీడీపీ.. డిక్లరేషన్‌ అంటూ కొత్త డ్రామాలు
-14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు గాడిదలు కాశాడా..?
-రాష్ట్రంలో పెత్తందారీ భావజలానికి–పేదల ప్రభుత్వానికి మధ్య యుద్ధం
-దుష్టచతుష్టయం, బీజేపీ నాకు అండగా ఉండకపోవచ్చు.. మీ జగనన్న నమ్ముకున్నది దేవుడి దయ, ప్రజల ఆశీస్సులు
-ఈ కురుక్షేత్ర సంగ్రామంలో నా బలం ప్రజలు, ఇంటింటికీ మనం చేసిన మంచి
-మీ ఇంట్లో మంచి జరిగితే మీరే మీ బిడ్డకు సైనికులుగా నిలబడి కదలండి
-జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం వైయస్‌ జగన్‌

పల్నాడు: ‘‘మన పిల్లలు ప్రపంచంతో పోటీపడాలి. ప్రపంచంలోనే అగ్రగామిగా మన పిల్లలు ఎదగాలి. మన పిల్లలు ఏ స్థాయికి వెళ్లినా ప్రపంచాన్ని ఏలే పరిస్థితిలో ఉండాలి. విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చి పిల్లల చదువుల కోసం, వారు వేసే ప్రతి అడుగునూ నిశితంగా పరిశీలిస్తూ.. ఆ ప్రతి అడుగులోనూ వారి సక్సెస్‌ను కోరుకుంటూ మీ మేనమామ ప్రభుత్వం అడుగులు వేయిస్తుంది’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కేవలం ఈ నాలుగేళ్ల పాలనలోనే విద్యారంగం మీద, పిల్లల కోసం మనందరి ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.60,329 కోట్లు అని చెప్పడానికి సంతోషిస్తున్నానని సీఎం వైయస్‌ జగన్‌ చెప్పారు. పల్నాడు జిల్లా క్రోసూరులో వరుసగా నాల్గవ ఏడాది జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. క్రోసూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఉద్దేశించి సీఎం వైయస్‌ జగన్‌ ప్రసంగించారు.

సీఎం వైయస్‌ జగన్‌ పూర్తి ప్రసంగం..
‘‘బయట చూస్తూ తీవ్రమైన ఎండలు, అయినా కూడా ఏమాత్రం ఖాతరు చేయని చిరునవ్వులు. ఇంతటి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు చూపిస్తున్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, నా చిట్టి పిల్లలకు కూడా రెండు చేతులు జోడించి పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

వేసవి సెలవులు ముగిసిన తరువాత నేటి నుంచి బడి తలుపులు తెరుకుంటున్నాయి. బడిగంటమోగక ముందే బడికి వెళ్లే పిల్లలందరికీ కానుకల గంటలను మన ప్రభుత్వం ఈ రోజే మోగిస్తోందని చెప్పడానికి సంతోషిస్తున్నా. ఈరోజు స్కూళ్లు తెరవగానే పుస్తకాల కోసం, యూనిఫాం కోసం ఏ ఒక్క పాప, బాబు, వారి తల్లిదండ్రులు ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతో వరుసగా నాల్గవ ఏడాది కూడా జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమం ప్రతి ప్రభుత్వ స్కూల్, ఎయిడెడ్‌ స్కూళ్లలో ఒకటి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న ప్రతి విద్యార్థికీ ప్రభుత్వ ఉచితంగా విద్యా కానుక కిట్‌ను అందజేయనుంది. ఈ కిట్‌లో ప్రతి విద్యార్థికీ కుట్టుకూలితో సహా 3 జతల యూనిఫాం, ఒక స్కూల్‌ బ్యాగ్, బైలింగ్వల్‌ పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, వర్క్‌బుక్స్, ఒక జత షూ, రెండు జతల సాక్స్, ఒక బెల్ట్‌ ఇవన్నీ కాకుండా పిల్లలందరికీ ఇంగ్లిష్‌ నుంచి తెలుగుకు అనువదించడానికి మంచి డిక్షనరీ.. ఇవన్నీ పిల్లలకు విద్యా కానుక కిట్‌ ద్వారా ఇవ్వనున్నాం.

పిల్లల చదువులు, వారి బడులు, వసతులు, చివరకు బడి తెరిచే సమయానికల్లా వారికి విద్యా కానుక కిట్, వీటన్నింటిపై ధ్యాస పెడుతూ, క్వాలిటీని కూడా మరింత మెరుగుపరుస్తూ ఈ ఏడాది విద్యా కానుక కిట్‌లో మెరుగైన మార్పులు తీసుకొచ్చాం. యూనిఫాం క్లాత్‌ గతేడాది కంటే ఈ సంవత్సరం ఎక్కవ క్లాత్‌ ఇస్తున్నాం. పిల్లలందరూ చక్కగా కనిపించాలని యూనిఫాం డిజైన్‌లో ఈ సంవత్సరం మెరుగైన మార్పులు తీసుకువచ్చాం. గత సంవత్సరం వచ్చిన ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా బ్యాగ్‌ సైజ్‌ను కూడా పెంచి మరింత మెరుగైన బ్యాగ్‌ను, షూస్‌ ఇవ్వడం జరుగుతుంది. బైలింగ్వల్‌ పాఠ్యపుస్తకాలను కూడా మరింత మెరుగుపరుస్తూ ఇవ్వడం జరుగుతుంది.

ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యా కానుక కిట్ల పంపిణీ పండుగ వాతావరణంలో జరుగుతుంది. చిన్న పిల్లలు ఓటర్లు కాదు.. వీరి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనే పరిస్థితి గతం.. కానీ ఈ రోజు ఆ పిల్లల జగన్‌ మామ ప్రభుత్వంలో విద్యా కానుక పండుగ కార్యక్రమంలో ప్రతి స్కూల్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులంతా పాలుపంచుకుంటారని చెప్పేందుకు పిల్లలకు మంచి మేనమామగా సంతోషిస్తున్నాను.

విద్యా కానుక కిట్స్‌ కోసం అయ్యే ఖర్చు అక్షరాల రూ.1042 కోట్లు. మన పిల్లలందరికీ మంచి చేయడానికి వారి మేనమామ ముందుకొచ్చాడు. 43.10 లక్షల మంది పిల్లలకు మంచి జరిగిస్తూ విద్యా కానుక ఒకొక్క కిట్‌ కోసం రూ.2400 ఖర్చు చేసి పిల్లలకు అందజేస్తున్నామని ఆ తల్లులందరికీ మంచి అన్నయ్యగా ఈ విషయాన్ని చెప్పడానికి సంతోషిస్తున్నాను. విద్యా కానుక పథకం మీదనే ఈ నాలుగు సంవత్సరాల కాలంలో అక్షరాల రూ.3366 కోట్లు ఖర్చు చేసిందని చెప్పడానికి గర్వపడుతున్నాను. కేవలం విద్యా కానుక పథకం మీద చేసిన ఖర్చు ఇది.

విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల గురించి మరికొన్ని విషయాలు..
పాఠశాల స్థాయి నుంచే పేద పిల్లలు ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ మరింత మెరుగుపడాలని ఆలోచన చేశాం. మన పిల్లలు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి.. ఆ ప్రపంచాన్ని ఏలే పరిస్థితిలో ఉండాలి కానీ, తక్కువగా చూడబడే పరిస్థితిలో ఉండకూడదని అడుగులు వేశాం. మన పిల్లలు ఎక్కడైనా ఎదిగేందుకు వీలుగా టోఫెల్‌ పరీక్షలకు వారందరినీ సిద్ధం చేసే కార్యక్రమం ఈ సంవత్సరం నుంచి మొదలవుతుంది. ఇందుకోసం ప్రపంచంలోనే ఎంతోపేరున్న ఎడ్యుకేషనల్‌ టెస్టింగ్‌ సర్వీసెస్‌తో (ఈటీఎస్‌) ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ప్రిన్స్‌టన్‌లోని టోఫెల్‌ అనే ఇంటర్నేషనల్‌ సర్టిఫికెట్‌ మన పిల్లలకు ఇవ్వడం జరుగుతుంది. ఈ టోఫెల్‌ పరీక్ష ద్వారా పిల్లలకు తర్ఫీదు ఇస్తూ వెళ్లే కార్యక్రమం చేస్తున్నాం.

మూడో తరగతి నుంచి 5వ వరకు టోఫెల్‌ ప్రైమరీ, 6 నుంచి 9 వరకు టోఫెల్‌ జూనియర్‌ అని చెప్పి రెండు పరీక్షలు నిర్వహించి టోఫెల్‌ ఇంటర్నేషనల్‌ సర్టిఫికెట్‌ ఇవ్వడం జరుగుతుంది. తద్వారా ఇంగ్లిష్‌ వినడమే కాకుండా ఇంగ్లిష్‌లో మాట్లాడటం.. అమెరికన్‌ యాక్సంటే కాకుండా మన పిల్లలు గొప్పగా మాట్లాడే పరిస్థితి వస్తుంది. టోఫెల్‌ను కూడా ఈ సంవత్సరం నుంచి ప్రవేశపెడుతున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాను.

అంతేకాకుండా రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ చూపించిన గవర్నమెంట్‌ స్కూల్స్‌లో ప్రతి జిల్లాలో ఒక గవర్నమెంట్‌ హైస్కూల్, ఒక ప్రైమరీ స్కూల్‌.. వెరసి 26 జిల్లాల్లోని 52 స్కూళ్లకు సంబంధించిన ఇంగ్లిష్‌ నేర్పించే టీచర్లకు స్ఫూర్తినిస్తూ.. మరింత మెరుగైన ఓరియంటేషన్‌ కోసం వారిని ప్రోత్సహిస్తూ.. అమెరికాలో ప్రిన్స్‌టన్‌కు పంపించడం జరుగుతుంది.

మన పిల్లలు ఇంకా బాగా ఎదగాలని, అంతర్జాతీయంగా విద్యారంగంలో వస్తున్న మార్పులను అధ్యయనం చేసి, మారుతున్న ప్రపంచంలో చదువులకు సంబంధించిన మార్పుల్లో మన పిల్లలు అందరి కంటే ముందడుగులో ఉండాలని, రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మిషన్‌ లెర్నింగ్, లాంగ్వేజ్‌ లెర్నింగ్‌ మాడ్యుల్స్, డేటా అనలటిక్స్‌తో మొదలు చాట్‌ జీపీటీ వరకు కూడా అన్నింటినీ మన సిలబస్‌లోకి ఎలా అనుసంధానం చేయాలని, మన పిల్లలను ముందు వరుసలో ఎలా నిలబెట్టాలనే దానిపై అధ్యయనం చేయడానికి వేగంగా ఆలోచనలు చేస్తున్నామని చెప్పడానికి గర్వపడుతున్నా..

విద్యారంగంలో విపరీతమైన మార్పులు మన కళ్లెదుటే కనిపించేలా ఈ నాలుగు సంవత్సరాల పాలన ఉంది. ఇప్పటికే మన బడి నాడు–నేడు కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గవర్నమెంట్‌ బడులన్నీ కూడా రూపురేఖలు మారుతూ మన కళ్ల ఎదుటనే కనిపిస్తున్నాయి. స్కూళ్లలో సీబీఎస్‌ఈ సిలబస్‌ తీసుకొచ్చాం, ఇంగ్లిష్‌ మీడియం తీసుకొచ్చాం. సీబీఎస్‌ఈ, ఇంగ్లిష్‌ మీడియం ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్నాయని చెప్పడానికి గర్వపడుతున్నాను.

ప్రభుత్వ పాఠశాలల్లో మీడియం ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ఇంగ్లిష్‌ అని చెప్పడానికి ఇంకా గర్వపడుతున్నాను. గతంలో క్లాస్‌ టీచర్లు లేని పరిస్థితి నుంచి మూడో తరగతి నుంచి ఏకంగా సబ్జెక్ట్‌ టీచర్లు ఈ రోజు మన ప్రభుత్వ పాఠశాలల్లో ఉండేలా అడుగులు పడ్డాయి. నాలుగో తరగతి నుంచి మన కరికుళంకు అనుసంధానం చేస్తూ పేద పిల్లలందరికీ బైజూస్‌ కంటెంట్‌ను తీసుకొచ్చి గవర్నమెంట్‌ బడిపిల్లలకు ఉచితంగా ఇవ్వడం జరిగిందని చెప్పడానికి సంతోషిస్తున్నా.. ఈరోజు రోజుకో మెనూతో పౌష్టికాహారంగా గోరుముద్ద అందిస్తున్నాం. అంగన్‌వాడీల్లో సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నా.

75 శాతం హాజరుకు ముడిపెడుతూ దేశంలో ఎక్కడా జరగని విధంగా జగనన్న అమ్మ ఒడి అనే కార్యక్రమం ద్వారా పిల్లలను బడికి పంపించే తల్లులను ప్రోత్సహిస్తూ ప్రతి ఏటా రూ.15 వేలు తల్లుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమం మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరుగుతుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. అమ్మ ఒడి కార్యక్రమానికి మాత్రమే అక్షరాల రూ.19,674 కోట్లు ఖర్చు చేశామని చెప్పడానికి సంతోషిస్తున్నాను.

8వ తరగతి పిల్లలకు ఆఫ్‌లైన్‌లో కూడా పనిచేసేలా ప్రీలోడెడ్‌ బైజూస్‌ కంటెంట్‌తో ట్యాబ్‌లు పంపిణీ చేశాం. పిల్లలతో పాటు టీచర్లకు కూడా ట్యాబ్‌లు ఇవ్వడం జరిగింది. అక్షరాల 5,18,740 ట్యాబ్‌లు రూ.685 కోట్లు ఖర్చు చేసి గత సంవత్సరం అందజేశాం. మళ్లీ ఈ సంవత్సరం మీ జగన్‌ మామయ్య పుట్టినరోజున డిసెంబర్‌ 21న 8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌లు ఇవ్వడం జరుగుతుంది.

ప్రతి క్లాస్‌ రూమ్‌ రూపురేఖలు మారుతున్నాయి. గవర్నమెంట్‌ బడుల్లో నాడు–నేడు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. నాడు–నేడు పనులు పూర్తయిన పాఠశాలల్లో 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్‌రూమ్‌లో ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్స్‌ తీసుకొస్తున్నాం. పిల్లలందరికీ డిజిటల్‌ బోధనను అందుబాటులోకి తీసుకొచ్చి చదువులు సులభవంగా అర్థమయ్యేలా చేస్తున్నాం.

నాడు–నేడు పూర్తయిన దాదాపు మొదటి ఫేస్‌లో 15750 స్కూళ్లలో 6 నుంచి పైతరగతులు దాదాపు 30,230 క్లాస్‌రూమ్‌లలో డిజిటల్‌ బోధనను జూలై 12వ తేదీన ప్రారంభిస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. రెండో ఫేస్‌లో మరో 22 వేల స్కూళ్లలో, మరో 16 వేల యూనిక్‌ స్కూల్స్‌లో డిసెంబర్‌ 21వ తేదీన మరో 31,700 ఐఎఫ్‌బీ ప్యానల్స్‌ను కూడా బిగిన్‌ చేయడం జరుగుతుంది. దీనితో ఈ డిసెంబర్‌ 21వ తేదీ కల్లా నాడు–నేడు కింద ఫేస్‌–1, ఫేస్‌–2 పూర్తిచేసుకున్న దాదాపుగా 33 వేల స్కూల్స్‌లో 6వ తరగతి పైక్లాస్‌ రూమ్‌లన్నీ మొత్తంగా డిజిటల్‌ బోధనవైపు అడుగులు వేయడం జరుగుతుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను.

ఆడపిల్లలకు మరింతగా అండగా నిలుస్తూ బడుల్లో నాడు–నేడు కార్యక్రమం చేయడమే కాకుండా టాయిలెట్ల నిర్మాణంతో పాటు వారి నిర్వహణపై కూడా ప్రత్యేక ధ్యాసపెట్టి మొట్టమొదటి సారిగా రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా టాయిలెట్‌ మెయింటైనెన్స్‌ ఫండ్, స్కూల్‌ మెయింటైనెన్స్‌ ఫండ్‌ అని ఇవి కూడా తీసుకొచ్చాం.

బడికి వెళ్లే ఏ చిట్టి తల్లి కూడా ఇబ్బందులు పడకూడదనే సంకల్పంతో వారి కోసం స్వేచ్చ పథకం కూడా అమలు చేస్తున్నాం. ఇవన్నీ కూడా పిల్లల చదువుల కోసం, వారు వేసే ప్రతి అడుగులోనూ నిశితంగా పరిశీలించి, గమనించి ఆ ప్రతి అడుగులోనూ వారు సక్సెస్‌ కావాలని అడుగులు వేయిస్తున్న మీ మేనమామ ప్రభుత్వం అని చెప్పి పిల్లాడికి తెలియజేస్తున్నాను.

హయ్యర్‌ ఎడ్యుకేషన్‌లో కూడా మార్పులు తీసుకువచ్చాం. జగనన్న విద్యా దీవెన ద్వారా కాలేజీ ఫీజు ఎంతైనా సరే, ఇంట్లో ఎంతమంది పిల్లలను చదివించినా సరే.. సంవత్సరంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి నేరుగా ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి జగనన్న విద్యా దీవెన కింద నగదు నేరుగా జమ చేయడం జరుగుతుంది. జగనన్న విద్యా దీవెన ఒకే ఒక్క పథకంతో అక్షరాల ఇప్పటి వరకు మన ప్రభుత్వం రూ.10,636 కోట్లు ఖర్చు చేశామని చెప్పడానికి గర్వపడుతున్నా..

అంతేకాకుండా పెద్ద చదువులు చదివే పిల్లలందరూ ఇబ్బందులు పడకూడదని, భోజనం, వసతి ఖర్చుల కోసం పిల్లలు, వారి తల్లిదండ్రులు ఇబ్బందులు పడకూడదని, ఒక్కో పిల్లాడికి సంవత్సరానికి రూ.10 నుంచి 20 వేల వరకు ఖర్చు చేస్తూ జగనన్న వసతి దీవెన పథకాన్ని తీసుకొచ్చాం. ఇప్పటి వరకూ ఆ పథకం ద్వారా రూ.4,275 కోట్లు ఖర్చు చేశామని చెప్పడానికి సంతోషిస్తున్నాను.

మన పిల్లలు దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబడాలనే తపన, తాపత్రయంతో టాప్‌ గ్లోబల్‌ కాలేజీల్లో ఏ పిల్లాడికి సీటు వచ్చినా కూడా రూ.కోటి 25 లక్షల వరకు అయినా పర్వాలేదు.. ఆ పిల్లలందరినీ పూర్తి ఉచితంగా మీ జగన్‌ మామయ్య చదివిస్తాడని చెప్పడానికి సంతోషిస్తున్నాను.

ఈరోజు టాప్‌ 50 యూనివర్సిటీల్లో మన పిల్లలు 213 మంది చదువుతున్నారు. ఇంతవరకు జగనన్న విదేశీ విద్య పథకానికి రూ.20 కోట్లు ఖర్చు చేశామని చెప్పడానికి సంతోషిస్తున్నాను.

కల్యాణమస్తు, షాదీతోఫా అనే మరో పథకాన్ని తీసుకొచ్చాం. పెళ్లీళ్లు చేసేటప్పుడు కచ్చితంగా వధూవరులిద్దరికీ 10 తరగతి సర్టిఫికెట్‌ ఉండాలనే నిబంధన తీసుకొచ్చాం. దీని వల్ల ప్రతి తల్లిదండ్రి వారి పిల్లలను చదివించేందుకు ప్రేరణ పొందుతారని ఆశిస్తూ కల్యాణమస్తు, షాదీతోఫా అనే పథకంతో చదువులను ప్రోత్సహించేందుకు అడుగులు కూడా ముందుకువేయడం జరిగింది.

ఇలా ఈ నాలుగేళ్లలో కేవలం ఈ పథకాల కోసమే విద్యారంగం మీద మన ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.60,329 కోట్లు అని చెప్పడానికి సంతోషిస్తున్నాను. అంటే ఎంతగా పిల్లల చదువుల కోసం ఆ అక్కచెల్లెమ్మలకు మంచి అన్నగా, తమ్ముడిగా, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఎంతగా మీ బిడ్డ ఆలోచన చేస్తున్నాడో ఆలోచన చేయాలని కోరుతున్నాను.

తేడా ఒకసారి గమనించండి అని కోరుతున్నా..
గత ప్రభుత్వంలో చంద్రబాబుకు ఇవన్నీ చేయాలనే మనసే లేని పరిస్థితిని చూశాం. గతంలో చంద్రబాబుకు ఆలోచనలు వేరే.. ఆయన మనస్తత్వం పూర్తిగా వేరు. పేదలు, పేద పిల్లలు, పేద కుటుంబాలు చదువుకుంటే, అందులోనూ ఇంగ్లిష్‌ మీడియంలో చదువుకుంటే.. గవర్నమెంట్‌ బడుల్లో డిజిటల్‌ బోధన వస్తే.. పేద పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు కనిపిస్తే తట్టుకోలేని మనస్తత్వం ఆ చంద్రబాబుదని గుర్తుపెట్టుకోండి.

అన్ని విషయాల్లోనూ చంద్రబాబుది ఇదే వ్యవహారం, ఇదే బుద్ధి. పేదలకు వ్యతిరేక బుద్ధి, పేదలు బాగుపడకూడదన్న దుర్బుద్ధి. కారణం.. వారిది పెత్తందారి మనస్తత్వం, వారు పేదలకు వ్యతిరేకం అని గుర్తుపెట్టుకోండి.

మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఎక్కడా లంచాలకు, వివక్షకు చోటు ఉండకూదని గ్రామాల్లో ఉన్న అవ్వాతాతలకు పెన్షన్‌ దగ్గర్నుంచి, అక్కచెల్లెమ్మలకు రేషన్‌ సరుకుల దగ్గర్నుంచి, రైతన్నలు, అక్కచెల్లెమ్మలకు ఎటువంటి ఇబ్బందులు, లంచాలు, వివక్ష ఉండకూడదని మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే వలంటీర్‌ వ్యవస్థను తీసుకొచ్చాం.. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తెచ్చాం. ఆ వెంటనే ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్‌ను తీసుకొచ్చాం. నాడు–నేడుతో స్కూళ్లలో మార్పులు తెచ్చాం ఇలా అనేక వ్యవస్థలను వరుసగా గ్రామస్థాయిలో ఏర్పాటు చేయగలిగింది మనందరి ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వం.

మరి ఇవే ఆలోచనలు గతంలో చంద్రబాబు బుర్ర‌కు ఎందుకు తట్టలేదని ఒక్కసారి ఆలోచన చేయండి. కారణం పెత్తందారి మనస్తత్వం.. కారణం వారు పేదలకు వ్యతిరేకం అని గుర్తుపెట్టుకోండి.

ఈ నాలుగు సంవత్సరాల్లోనే ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణం, అక్కచెల్లెమ్మలకు అమ్మ ఒడి, ఆసరా, చేయూత, సున్నావడ్డీ, దిశ యాప్‌ ఇటువంటివన్నీ తీసుకొచ్చాం. భారతదేశ చరిత్రలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా నిలబడనంత అండగా నా అక్కచెల్లెమ్మలకు ఈరోజు మీ జగనన్న ప్రభుత్వం తోడుగా నిలబడింది.

మరి గతంలో చంద్రబాబు అక్కచెల్లెమ్మలకు ఏం చేశాడంటే.. ఎన్నికలకు ముందు వాగ్దానం చేశాడు.. ఎన్నికలు అయిపోయిన తరువాత మోసం చేశాడు. ఇదే చంద్రబాబు రైతన్నలకు ఏం చేశాడంటే.. ఎన్నికలకు ముందు వాగ్దానం చేశాడు.. ఎన్నికల తరువాత మోసం చేశాడు. యువతకు ఏం చేశాడంటే.. ఎన్నికలకు ముందు వాగ్దానం చేశాడు.. ఎన్నికలు అయిపోయిన తరువాత మోసం చేశాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, అగ్రవర్ణాల్లోని నిరుపేదలకు ఏం చేశాడని చూస్తే.. ఎన్నికల ముందు వాగ్దానం చేశాడు.. ఎన్నికలు అయిపోయిన తరువాత చంద్రబాబు మోసం చేశాడని మనందరికీ కళ్ల ఎదుట కనిపిస్తున్న సత్యం. కారణం చంద్రబాబు బతుకే మోసం.. చంద్రబాబు బతుకే పెద్ద అబద్ధం.. చంద్రబాబుది పెత్తందారీ మనస్తత్వం, పేదలకు వ్యతిరేకం అనేది మర్చిపోవద్దు.

14 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్క సంక్షేమ పథకం, ఏ ఒక్క మంచి కూడా మనకు గుర్తురాదు. చంద్రబాబు పేరు చెబితే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఆయన పేరు చెబితే గుర్తుకొచ్చేది వెన్నుపోట్లు, మోసం, కుట్ర, దగా మాత్రమే గుర్తొస్తాయి.

ఇన్ని విషయాల్లో ఇంత దారుణంగా ప్రజలందరినీ మోసం చేస్తున్నా కూడా అన్ని విషయాల్లోనూ బాబును వెనకేసుకురావడానికి బాబు వల్ల బాగా వెనకేసుకున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు.. ఈ గజదొంగల ముఠా, దుష్టచతుష్టయం మాత్రమే ఈ చంద్రబాబుకు తోడుగా ఉంది. కానీ, బాబు పాలన వల్ల తమకు మేలు జరిగిందని చెప్పే ఒక్క సామాజిక వర్గం కానీ, ఒక ప్రాంతం కానీ, పేదలు కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా ఆయనకు తోడుగా లేరని చెబుతున్నా..

కాబట్టే మూసేయడానికి సిద్ధంగా ఉన్న టీడీపీ దుకాణంలో పక్కరాష్ట్రాల్లోని మేనిఫెస్టోను తీసుకొచ్చి దాన్ని బిస్బిల్లా బాత్‌గా వండుతున్నారు. మన ప్రభుత్వం అమలు చేసి చూపించిన పథకాలన్నింటినీ కిచిడి చేసి పులిహోరగా వండే కార్యక్రమం చేస్తున్నారు. చంద్రబాబు అనే వ్యక్తి నిజంగా ఎంత సిగ్గులేకుండా ఉన్నాడంటే.. సీఎం అయిన 28 సంవత్సరాల తర్వాత 14 సంవత్సరాలు సీఎంగా చేసిన తర్వాత ఈరోజు అంటాడు.. రాయలసీమ డిక్లరేషన్‌ అంటూ మొదలుపెడుతున్నాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏమి గాడిదలు కాశావయ్యా చంద్రబాబూ అని నిలదీస్తున్నాను. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన తరువాత బీసీ డిక్లరేషన్‌ అని మొదలెట్టాడు.. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ అంటూ ఈరోజు మొదలెట్టాడు.. మైనార్టీ డిక్లరేషన్‌ అని మొదలెట్టాడు.. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన తరువాత ఈ రోజు అక్కచెల్లెమ్మలు, రైతన్నలు.. చివరకు గ్యాస్‌ సిలిండర్ల డిక్లరేషన్‌ అంటూ మొదలెట్టాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఏమి గాడిదలు కాశావయ్యా అని అడుగుతున్నాను.

ప్రజలను మోసం చేస్తూ.. మరోసారి అధికారం ఇస్తే మయసభ నిర్మిస్తానని అంటున్నాడు, మరోసారి అవకాశం ఇస్తే ఇంటింటికీ కేజీ బంగారం ఇస్తానంటున్నాడు, మరోసారి అధికారం ఇస్తే ఇంటింటికీ బెంజ్‌ కారు కొనిస్తానంటున్నాడు. ఈ కొత్త డ్రామాలు నమ్మొద్దు. కనీసం ఇప్పటికైనా చంద్రబాబు మరోసారి మోసానికి తెరదీయడం ఆపేస్తాడని ఆశిద్దాం. చంద్రబాబు బతుకంతా గమనిస్తే.. వాగ్దానాలు, వెన్నుపోట్లు.. మళ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు మళ్లీ వాగ్దానాలు, మళ్లీ వెన్నుపోట్లు. ఈ చక్రమే చంద్రబాబు సైకిల్‌ చక్రం.

చంద్రబాబు పెత్తందారీ భావజాలానికి – మనందరి పేదల ప్రభుత్వానికి మధ్య యుద్ధం జరుగుతుంది. గమనించండి, ఆలోచన చేయండి.. ఇది చంద్రబాబు దోచుకో, పంచుకో, తినుకో అనే డీపీటీ భావజాలానికి – మన రూ.2.16 లక్షల కోట్ల డీబీటీ పద్ధతికి మధ్య యుద్ధం జరుగుతుంది. ఆలోచన చేయండి.. చంద్రబాబు మాదిరిగా దోచుకో, పంచుకో, తినుకో డీపీటీ కావాలా..? మీ జగనన్న ప్రభుత్వంలో మాదిరిగానే నేరుగా బటన్‌ నొక్కే డీబీటీ కావాలా..? ఆలోచన చేయండి.

ఇది వారి సమాజిక అన్యాయానికి, మన సామాజిక న్యాయానికి మధ్య జరుగుతున్న యుద్ధం. ఇదే రాష్ట్రంలో, ఇదే బడ్జెట్‌లో వారు చేసిన స్కామ్‌లకు, అదే బడ్జెట్‌లో మనం అందిస్తున్న మంచి స్కీమ్‌లకు మధ్య జరుగుతున్న యుద్ధం.

ఇది వారి ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 చేస్తున్న విష ప్రచారాలకు – ఇంటింటికీ మనం చేసిన కనిపిస్తున్న మంచికి మధ్య జరుగుతున్న యుద్ధం. ఈ కురుక్షేత్ర మహాసంగ్రామంలో దుష్టచతుష్టయానిది పేదలతో యుద్ధం. ఈ యుద్ధంలో చంద్రబాబుకు మాదిరిగా మీ జగనన్నకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు అండగా లేకపోయినా, మీ జగనన్నకు బీజేపీ అనే పార్టీ అండగా ఉండకపోవచ్చు.. మీ జగనన్న వీరిని నమ్ముకోలేదు.. మీ జగనన్న నమ్ముకున్నది దేవుడి దయను, ప్రజల చల్లని ఆశీస్సులను మాత్రమే నమ్ముకున్నాడు. ఈ కురుక్షేత్ర మనసంగ్రామంలో నా ధైర్యం మీరు, నా బలం ఇంటింటికీ మనందరి ప్రభుత్వం చేసిన మంచి అని చెప్పడానికి ఈ సందర్భంగా మీ బిడ్డగా గర్వపడుతున్నాను.

దుష్టచతుష్టయం చేస్తున్న దుష్ప్రచారాలను నమ్మకండి.. మీ ఇంట్లో మంచి జరిగిందా.. లేదా అనేది మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మీ జగన్‌ వల్ల మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడాలని కోరుకుంటున్నా. ఈ యుద్ధంలో చివరకు ఎప్పుడైనా మంచి గెలుస్తుందని మనసారా నమ్ముతూ.. మంచి చేస్తున్న మనందరి ప్రభుత్వానికి దేవుడి చల్లని దీవెనలు ఉండాలని, ప్రజలందరి చల్లని ఆశీస్సులు కలకాలం ఉండాలని కోరుకుంటూ.. నా అక్కచెల్లెమ్మలకు మంచి అన్నగా, తమ్ముడిగా, మీ పిల్లలంతా ఇంకా బాగా చదువుకోవాలని, ప్రతి కుటుంబం నుంచి ఒక మంచి ఇంజినీర్‌ రావాలని, డాక్టర్‌ రావాలని, సైంటిస్ట్‌ రావాలని, సాఫ్ట్‌వేర్‌ సీఈఓ రావాలని, మంచి ఎకానమిస్ట్‌ రావాలని, ప్రతి పేద కుటుంబం నుంచి ఒక మంచి లీడర్‌ రావాలని కోరుకుంటూ దేవుడు ఇంకా మీకు మంచి చేసే అవకాశం ఇవ్వాలని మనసారా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను.

LEAVE A RESPONSE