Suryaa.co.in

Andhra Pradesh

ఆధారాల్లేని కేసుల్లో జైలుకు పంపిన వైనాన్ని కేంద్రప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని గవర్నర్ ని కోరాం

• చంద్రబాబుపై వైసీపీ ప్రభుత్వం ఏఏ అంశాలపై అయితే తప్పుడు కేసులు పెట్టిందో, వాటన్నింటికి సంబంధించిన పూర్తి వాస్తవాలను టీడీపీ గవర్నర్ ముందు ఉంచింది
• స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్, ఫైబర్ నెట్ ప్రాజెక్ట్, ఇన్నర్ రింగ్ రోడ్ పై ప్రభుత్వం చేస్తున్న నిరాధార ఆరోపణలు..వాటిని తిప్పికొడుతూ టీడీపీ ఇప్పటికే ప్రజల ముందు ఉంచిన వాస్తవాలను గవర్నర్ కు అందించాం
– రాష్ట్ర గవర్నర్ ను కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీపీ సీనియర్ నేత, శాసనమండలిలో టీడీపీ పక్షనేత యనమల రామకృష్ణుడు
ఎగ్జిక్యూటివ్ హెడ్ అరాచకాలు, అకృత్యాలను నిరోధించాలని, ప్రజలకు సంక్రమించిన రాజ్యాంగ, ప్రజాస్వామ్యమైన హక్కుల్ని, రూల్ ఆఫ్ లాను కాపాడాలని, కాన్ స్టిట్యూషనల్ హెడ్ అయిన గవర్నర్ గారిని కోరాం : యనమల రామకృష్ణుడు

గవర్నర్ ను కలిసిన వారిలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, బొండా ఉమామహేశ్వరరావు, ఎం.ఏ.షరీఫ్ ఎమ్మెల్సీలు పంచుమర్తి అనురాధ, పరుచూరి అశోక్ బాబు, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు తదితరులు ఉన్నారు

జగన్మోహన్ రెడ్డి, అతని ప్రభుత్వం అనుసరిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక చర్యలతో పాటు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ఇతరవర్గాలపై ప్రభుత్వం చేస్తున్న దాడులు.. పోలీస్ వ్యవస్థను అడ్టుపెట్టుకొని సాగిస్తున్న దుర్మార్గాలను, రాజ్యాంగవ్యవస్థల్ని వ్యక్తి గత ప్రయోజనాల కోసం వినియోగిస్తున్న వైనాన్ని, ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై పెట్టిన తప్పుడు కేసులు…ఆయన్ని అన్యాయంగా జైలుకు పంపిన విధానాన్ని వాస్తవాలతో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కు విన్నవించినట్టు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తెలిపారు. బుధవారం సాయంత్రం టీడీపీనేతలతో కలిసి గవర్నర్ ని కలిసిన అనంతరం అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు వారి మాటల్లోనే…

“ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై అక్రమ కేసు పెట్టి, 40 రోజులుగా ఆయన్ని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో నిర్బంధించిన వైనాన్ని, ఆయన్ని ఉగ్రవాదిలా అరెస్ట్ చేసిన తీరుని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం.

పైసా అవినీతి కూడా జరగని స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కేసులో చంద్రబాబు రూ.370 కోట్ల అవినీతికి పాల్పడ్డాడని జగన్ రెడ్డి, అతని ప్రభుత్వం ఆరోపణలు చేసింది . తరువాత రూ.340కోట్లని విషప్రచారం చేశారు.. చివరకు దిగజారి రూ.27కోట్లనే స్థితికి దిగజారారు. కథ ముగింపుకు వచ్చేసరికి స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో కీలకంగా వ్యవహరించిన సంస్థ, కేంద్రప్రభుత్వానికి రూ.8..50 కోట్ల జీఎస్టీ చెల్లింపులు సరిగా చేయనందునే చంద్రబాబుపై కేసు పెట్టినట్టు జగన్ ప్రభుత్వం వాదిస్తోంది.

చంద్ర బాబునాయుడిపై వైసీపీ ప్రభుత్వం స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో అవినీతి జరిగింద ని తొలుత తప్పుడు కేసుపెట్టి అరెస్ట్ చేసింది. తరువాత ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ లో అవినీతి అని, ఇన్నర్ రింగ్ రోడ్ లో తప్పుజరిగిందని కేసులు పెట్టింది. ఈ మూడు అంశాలకు సంబంధించిన వాస్తవాల్ని ఇప్పటికే టీడీపీ ప్రజలముందు ఉంచింది. ప్రజల ముందు ఉంచిన వాస్తవాలనే నేడు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం.

తాము అందించిన సమాచారం మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, ఒక సవివరమైన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించాలని గవర్నర్ ని కోరాము. తాము చేసిన విజ్ఞప్తిపై గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సానుకూలంగా స్పందించారు. చంద్రబాబుపై పెట్టిన కేసులు.. వాటిపై కోర్టుల్లో జరుగుతున్న విచారణ అంతా తనకు తెలుసునని గవర్నర్ గారు తమతో చెప్పారు.

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటినుంచీ సీఐడీని, పోలీస్ వ్యవస్థను జేబుసంస్థలుగా మార్చుకొని టీడీపీనేతలపై, గిట్టని మీడియా సంస్థలపై, వాటి యాజమాన్యాలపై ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టిస్తున్నాడో, ఎలా కక్షసాధింపులకు పాల్పడుతున్నాడో చూస్తూనే ఉన్నాం. తప్పుడు కేసులు పెట్టడం.. తర్వాత వాటిని విచారించకుండా, వాస్తవాలు బయటకు రానివ్వకుండా ఈ ప్రభుత్వం ఎలా తొక్కిపెడుతోందో చూస్తూనే ఉన్నాం.

అలానే ప్రజల్ని వేధిస్తున్న తీరుని కూడా గమనిస్తున్నాం. ముఖ్యంగా దళితులు, బీసీలు, మైనారిటీలపై వైసీపీనేతలు, ముఖ్యమంత్రి సాగిస్తున్న దారుణాలు, దుర్మార్గాలను కూడా గవర్నర్ గారికి తెలియ చేశాం.” అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

ఎగ్జిక్యూటివ్ హెడ్ అరాచకాలు, అకృత్యాలను నిరోధించాలని, ప్రజలకు సంక్రమించిన రాజ్యాంగ, ప్రజాస్వామ్యమైన హక్కుల్ని, రూల్ ఆఫ్ లాను కాపాడాలని, కాన్ స్టిట్యూషనల్ హెడ్ అయిన గవర్నర్ని కోరాం : యనమల రామకృష్ణుడు

“జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటినుంచీ తన క్రిమినల్ కేరక్టర్ తో, రాజకీయ కక్షసాధింపులతో పాల్పడుతున్న చర్యలను గవర్నర్ గారి దృష్టికి తీసు కెళ్లాం. అలానే చంద్రబాబుపై పెట్టిన తప్పుడు కేసులు.. వాటివెనకున్న రాజకీయ కారణాల్ని కూడా ఆయనకు తెలియచేశాం.

రాష్ట్రంలో గవర్నర్ కాన్ స్టిట్యూషనల్ హెడ్ గా ఉంటే, ముఖ్యమంత్రి ఎగ్జిక్యూటివ్ హెడ్ గా ఉంటారు. ఎగ్జిక్యూటివ్ హెడ్ గా ఉన్న వ్యక్తి ప్రజలపై కనికరం, ప్రతిపక్షాలపై గౌరవం లేకుండా, రూల్ ఆఫ్ లా అనేది విస్మరించి తనకు నచ్చినట్టు వ్యవహరిస్తున్న తీరుని గవర్నర్ గారికి తెలియచేశాం. ఎగ్జిక్యూటివ్ హెడ్ రాజకీయాలే ప్రధాన ధ్యేయంగా, తన స్వార్థప్రయోజనాలే పరమావధిగా వ్యవహరిస్తూ, రాజ్యాంగ వ్యవస్థల్ని గుప్పిట్లో పెట్టుకొని చేస్తున్న అక్రమాలు..అకృత్యాలు.. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పై కాన్ స్టిట్యూషనల్ హెడ్ దృష్టిపెట్టాలి. ఈ విషయం రాజ్యాంగమే చెప్పింది. లెజిస్లేచర్ వ్యవస్థను కూడా ముఖ్యమంత్రి ఏవిధంగా అవమానించారో, ఆ విషయాన్నికూడా గవర్నర్ గారికి తెలియచేశాం.

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిగా గవర్నర్ చంద్రబాబుపై ఉన్న కేసుల గురించి, న్యాయస్థానాల్లో జరుగుతున్న విచారణపై స్పందించకూడదు. అదే విషయం ఆయన మాతో చెప్పారు. కానీ ప్రతిపక్షనేతపై పెట్టిన తప్పుడు కేసులు… జరుగుతున్న విషయాలన్నీ తనకు తెలుసునని గవర్నర్ తమతో చెప్పారు.

గవర్నర్ కి మేం విన్నవించుకునేది ఏమిటంటే ప్రజలకు సంక్రమించిన రాజ్యాంగ పరమైన హక్కుల్ని, ప్రజాస్వామ్యం ద్వారా సంక్రమించిన హక్కుల్ని కాపాడమని, ప్రభుత్వ వేధింపుల్ని ఆపాలని, రూల్ ఆఫ్ లా ను కాపాడాలని. మేం చేసిన విజ్ఞప్తుల పై చేయగలిగింది చేస్తానని గవర్నర్ గారు తమతో చెప్పారు. రాజ్యాంగపరమైన, ప్రజా స్వామ్యపరమైన హక్కుల పరిరక్షణ, రూల్ ఆఫ్ లా అమలు అనేది గవర్నర్ పరిధిలో ని అంశమే. వాటిపై ఆయన కచ్చితంగా జోక్యం చేసుకోవాలి. రాజ్యాంగసంస్థల్ని ముఖ్యమంత్రి తన సొంత సంస్థలుగా మార్చుకున్న తీరుని గవర్నర్ కి ఆధారాలతో సహా తెలియచేశాం.” అని రామకృష్ణుడు తెలిపారు.

LEAVE A RESPONSE