Suryaa.co.in

Telangana

తెలంగాణ వచ్చినా.. ప్రజల ఆకాంక్షలు నేరవేరలేదు

అందుకే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఇచ్చింది
కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణకు విముక్తి కల్పించాలి
కల్యాణ లక్ష్మి కింద లక్ష రూపాయలతో పాటు.. తులం బంగారం
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

తెలంగాణ ఇస్తామని కరీంనగర్ గడ్డపై ఇచ్చిన మాటను సోనియా గాంధీ నేరవేర్చారని, కానీ తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరటం లేదన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. అందుకే ఆరు గ్యారంటీలు అమలు చేసి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని కాంగ్రెస్ నిర్ణయించుకుందని తెలిపారు. గిరిజనులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని.. గిరిజనులకు న్యాయం చేసేది రాబోయే కాంగ్రెస్ సర్కారే అని రేవంత్ రెడ్డి అన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన విజయభేరి బస్సు యాత్రలో భాగంగా బుధవారం ములుగు నియోజకవర్గం రామానుజపురంలో నిర్వహించిన సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. తెలంగాణను కేసీఆర్ కుటుంబం నుంచి విముక్తి చేసేందుకు గాంధీ కుటుంబం వచ్చిందన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఇచ్చి 60 ఏళ్ల ఆకాంక్షలను నెరవేర్చింది కాంగ్రెస్‌ పార్టీ మాత్రమేనని.. కేసీఆర్ కుటుంబం నుంచి ఇప్పటికైనా తెలంగాణకు విముక్తి కల్పించాలని ప్రజలను రేవంత్‌రెడ్డి కోరారు.

తెలంగాణలో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ సర్కార్ చేసిందేమి లేదని మండిపడ్డారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను కేసీఆర్ నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. అమరులు, నిరుద్యోగుల ఆశలను కేసీఆర్ అడియాసలు చేశారని రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు.

ఎందరో విద్యార్థులు, యువత త్యాగాలు చేసి తెలంగాణ సాధించుకున్నారని.. అమరుల త్యాగాలతో సాకారమైన తెలంగాణను ఒక కుటుంబం చెరపట్టిందని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ చూసిన అవినీతి, అరాచకం తాండవిస్తోందన్నారు. కేసీఆర్ లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారు. ఈ అవినీతి పాలనను పాతాలంలోకి తొక్కాలి అన్నారు రేవంత్ రెడ్డి.

రాజకీయంగా నష్టపోతున్నా ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ కలను సోనియా గాంధీ సాకారం చేసినా తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరటం లేదన్నారు. అందుకే ఆరు గ్యారంటీలు అమలు చేసి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని కాంగ్రెస్ నిర్ణయించుకుందని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో భాగంగా మహాలక్ష్మి గ్యారంటీ స్కీమ్ మహిళల కోసం సోనియా గాంధీ తెచ్చారు. ప్రతినెల మహిళలకు 2500 ఇచ్చేందుకు సోనియా ముందుకు వచ్చారు. ప్రతీ నెల 1వ తేదీన రూ. 2,500 ఆడబిడ్డల ఖాతాలో జమ చేస్తాం. రూ. 500లకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే భాద్యత సోనియా గాంధీ తీసుకున్నారు. ప్రతీ ఇంటికి 200 యూనిట్ల లోపు వరకు ఫ్రీ కరెంట్ అందిస్తాం. రైతులకు మద్దతు ధరతోపాటు క్వింటాల్ కు రూ. 500 బోనస్ ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది.

యువతకు యువ వికాస్ పథకం క్రింద 5 లక్షలు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ భరోసా కింద రైతులకు, కౌలు రైతులకు ఏటా రూ.15 వేలు, ఉపాధి హామీ పథకంలో నమోదు చేసుకున్న భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి రూ. 12 వేల సాయం అందిస్తాం. కల్యాణ లక్ష్మి కింద లక్ష రూపాయలతో పాటు.. తులం బంగారం ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించిందని రేవంత్ రెడ్డి ప్రకటించారు.

ఈ సంక్షేమ పథకాలు అమలు కావాలంటే మనం ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవాలి అని రేవంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయి. మన బతుకులు బాగుపడాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలి. ఈ ఎన్నికల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మేలు చేసే వారికే ఓటు వేయాలి. ములుగులో సీతక్కను, భూపాలపల్లిలో గండ్ర సత్యనారాయణ రావును 50 వేల మెజారిటీతో గెలిపించాలి అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ లో చేరిన మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి బుధవారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రతాపసింగారంలోని సుధీర్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన్ను కలిసి కండువా కప్పి పార్టీలోకి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సుధీర్ రెడ్డి గొప్ప నిర్ణయం తీసుకున్నారు.. వారిని మనస్పూర్తిగా కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నా అన్నారు. నన్ను గల్లీ నుంచి ఢిల్లీకి పంపించడంలో ఈ నియోజకవర్గ ప్రజల శ్రమ ఉందని పేర్కొన్నారు. ఇక్కడి ప్రజలకు.. ఈ ప్రాంతానికి నేను ఎంతో రుణపడి ఉన్నా అన్నారు.

పాలు అమ్ముకునే వాడొకడు.. సీట్లు అమ్ముకునేవాడొకడు…మామ, అల్లుళ్లకు బుద్ది చెప్పి నన్ను ఇక్కడి ప్రజలు ఎంపీగా గెలిపించారని వ్యాఖ్యానించారు. మాల్కాజిగిరి పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి అని రేవంత్ రెడ్డి అకాంక్షించారు. జవహర్ నగర్ డంప్ యార్డు నుంచి విముక్తి కల్పించే బాధ్యత మాది అన్నారు. అంతర్జాతీయ ఐటీ కంపెనీలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని ఐటీ హబ్ గా మారుస్తాం మెట్రో రైలును ఈ ప్రాంతానికి పొడగించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత సుధీర్ రెడ్డిగారికి రాజకీయంగా సముచిత గౌరవం కల్పిస్తామని హామీ ఇచ్చారు. టికెట్ రానివారి ఆవేదనను నేను అర్ధం చేసుకోగలను ఎవరిపై మాకు ద్వేషం లేదన్నారు. అందరినీ కలుపుకుని పని చేయాలి. ముందున్న లక్ష్యాన్ని చూడండి.. కార్యకర్తల కష్టాలు చూడండి కాంగ్రెస్ ను గెలిపించండని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

కొండగల్ నుంచి చేరికలు

కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండలానికి చెందిన పలువురు నాయకులు, దౌల్తాబాద్ మండలం చల్లాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన 100 మంది నాయకులు బుధవారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి వారిని రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు.

LEAVE A RESPONSE