Suryaa.co.in

Features

మనం ఎన్నుకొన్న మార్గంలో మనమే దీపాలు వెలిగించాలి

– మనకు మార్గదర్శకులుగా మనమే ఉండాలి

అంబేద్కర్ గారు తన భార్యకు రాసిన ఉత్తరం చదివితె కన్నీళ్ళు ఆగవు.
రమా, ఎలా వున్నావు రమా?
నాకు ఈరోజు నువ్వు మరియు యశ్వంత్ చాలా ఎక్కువగా గుర్తుకొస్తుండడంతో మనసంతా చాలా దిగులుగా వుంది. ఈ మధ్య కాలంలో నేను చేసిన ప్రసంగాలు అత్యంత చర్చనీయ అంశాలుగా వార్తల్లో నిలిచాయి. రౌండ్ టేబుల్ సమావేశంలోని నా ప్రసంగాలు బాగున్నాయని, ప్రేరణాత్మకంగా ఉన్నాయని ఇక్కడి వార్తాపత్రికలు రాశాయి. దీనికంటే ముందుగా, రౌండ్ టేబుల్ సమావేశంలో నా పాత్ర గురించి ఒకసారి అవలోకనం చేసుకుంటే…..తరతరాలుగా అణచివేతకు గురవుతున్న ప్రజల దీనమైన ముఖాలు నా కళ్ళముందు కదలాడాయి.

వేల సంవత్సరాలుగా నా ప్రజలు పేదరికంలోను, వేదనలోను మగ్గుతున్నారు. అనునిత్యం వారు అనుభవిస్తున్న బాధలనుండి వారికి విముక్తి లభించదని, వారి కష్ఠాలకు అంతం లేదని వారు గాఢంగా నమ్ముతున్నారు. ఈ విషయం నన్ను తీవ్ర విస్మయానికి గురిచేస్తోంది రమా, కానీ ఈ దురాగతంపై పోరాడేందుకు అవసరమైన మేధస్సుని నేను సాధించాను. బహుశా నా మనసులో చాలా వేదన వుంది మరియు నా హృదయంలో ఎన్నో భావోద్వేగాలున్నాయి.

నాకు చాలా నిరాశానిస్పృహగా వుంది. నేను మన ఇంటిని, మిమ్మల్నందరిని చాలా మిస్సవుతున్నాను. నాకు నువ్వు, యశ్వంత్ పదేపదే గుర్తుకురావడంతో మిమ్మల్ని మిస్సయ్యాను అన్న బాధ నన్ను తీవ్రంగా కలచివేస్తోంది. నాకు వీడ్కోలు చెప్పేందుకు నీవు నౌక దగ్గరకు వచ్చావు. నౌక వద్దకు నన్ను సాగనంపేందుకు రావద్దని నేను నిన్ను వారించినా కూడా ఉండబట్టలేక నా మాట పెడచెవిన పెట్టి నువ్వు అక్కడికొచ్చావు.

నేను రౌండ్ టేబుల్ సమావేశాలకు పయనమవుతుండగా, అక్కడ చుట్టూ వున్నవారు నాకు జేజేలు పలకడం నీ కళ్ళ ముందరే జరిగింది మరియు అందుకు నువ్వే ప్రత్యక్ష సాక్షివి. ఆ సన్నివేశాన్ని నీ కళ్ళతో వీక్షించాక నీ హృదయం ఆనందంతో నిండిపోయిందని నాకు అర్థమైంది. మాటలతో నీ సంతోషాన్ని నువ్వు చెప్పలేకపోయావు కానీ నువ్వు వ్యక్తం చెయ్యాలనుకున్న సంతోషమంతా నీ కళ్ళు సుస్పష్టంగా వ్యక్తపరిచాయి. నీ మాటల కంటే నీ మౌనమే ఎక్కువ భావాలను పలికించింది. నీ నోటి నుండి వచ్చిన మాటల కన్నా, నీ కళ్ళ నుండి రాలిన కన్నీళ్లే అంత్యంత భావయుక్త్తంగా గోచరించాయి.

ఇక్కడ లండన్లో ఉదయం నిద్ర లేవగానే నాకు ఈ ఆలోచనలతో మనసంతా బాధతో నిండిపోయి దుఃఖం తన్నుకు వస్తోంది. నువ్వు ఎలా వున్నావు రమా? మన యశ్వంత్ ఎలా వున్నాడు? వాడు నన్ను మిస్సవుతున్నాడా? వాడికి కీళ్ల నొప్పులు తగ్గాయా? వాడిని జాగ్రత్తగా చూసుకో రమా. మన నలుగురు పిల్లల్ని మనం కోల్పోయాం. ఇక మనకు మిగిలింది మన యశ్వంత్ ఒక్కడు మాత్రమే. నీ మాతృత్వానికి వాడు ప్రతీక. మనం వాడిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. యశ్వంత్ ని ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడి తనకి విద్యాబుద్ధులు నేర్పించు. రాత్రి వేళలో నిద్ర లేపి చదివించు.

మా నాన్న నన్ను అర్థరాత్రి నిద్రలేపి చదివించడం కోసం, తాను అర్థరాత్రి వరకు మేల్కొని నన్ను నిద్రలేపి తాను అప్పుడు పడుకునేవాడు. నేను చదవడానికి ఉపక్రమించిన తరువాతే అయన నిద్రపోయేవాడు. నాకు అలవడిన ఈ క్రమశిక్షణ అయన నేర్పినదే. మొదట్లో అర్థరాత్రి నిద్రలేచి చదవాలంటే సోమరితనం వల్ల నాకు చాలా కష్టంగా అనిపించేది. ఎందుకంటే అర్థరాత్రి నిద్రలేచి చదవడం కంటే హాయిగా ముసుగుతన్ని నిద్రపోవడం సుఖంగా ఉండేది. కానీ ఒక్కసారి వెనుతిరిగి చూసుకుంటే ఆలా చదువు కోసం నిద్రను త్యాగం చేయడం నా జీవితానికి ఎంతో ఉపయోగపడింది.

ఈ విజయంలో సింహభాగం మా నాన్నకే చెందుతుంది. నన్ను ఉన్నత చదువులు చదివించడం కోసం మా నాన్న ఎన్నో త్యాగాలు చేశాడు. నా జీవితంలో వెలుగులు నింపడం కోసం మా నాన్న రేయింబవళ్లు ఎంతో కష్టపడ్డాడు. ఆయన ఆనాడు పడిన శ్రమకు ఫలితం ఈరోజ నా కళ్ళముందు స్పష్ఠముగా కనపడుతోంది. ఇదంతా చూస్తుంటే ఈరోజు నాకు చాలా ఆనందంగా వుంది రమా…

రమా, మన యశ్వంత్ కూడా బాగా చదువుకోవాలి. పుస్తకాల పట్ల ఆశక్తిని, జిజ్ఞాసను యశ్వంత్ హృదయంలో మనం రగిలించాలి. డబ్బుతో, ఆడంబరాలతో ఎలాంటి ఉపయోగం లేదు రమా. ఈ విషయాన్ని నువ్వు అనునిత్యం నీ చుట్టుపక్కల గమనిస్తూనే వుండివుంటావు. జనం భోగభాగ్యాలకోసం, సౌఖ్యాలకోసం యుగయుగాలుగా నిరంతరంగా పరిగెడుతూనే వున్నారు. డబ్బుసంపాదన అనే ఒకే ఒక్క లక్ష్యం దగ్గరే అటువంటివారు ఆగిపోతారు. వారు జీవితంలో పైకి ఎదగరు. అటువంటి జీవన విధానంతో మనం సంతృప్తి చెందరాదు రమా.

మన చుట్టూ కష్ఠాలు, వేదన తప్ప మనం మరొకటి చూడం. పేదరికం మాత్రమే మన సహచరి. కష్ఠాలు మనలను విడిచి వెళ్లవు. అవమానాలు, వంచన, అలక్ష్యము, నిరాదరణ ఒక నీడలాగా మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఇదంతా గాఢాంధకారమైన చీకటిలా, ఎడతెగని, అనంతనైన కష్ఠాల కడలిలా వుంది.

మన రక్షకులుగా మనమే ఉండాలి. మనకు మార్గదర్శకులుగా మనమే ఉండాలి. మనం ఎన్నుకొన్న మార్గంలో మనమే దీపాలు వెలిగించాలి. ఈ మార్గంలో ప్రయాణించి మనం విజయం సాధిస్తాం. ప్రస్తుత సమాజంలో మనకు ఒక సముచిత స్థానం లేదు కాబట్టి ఆ సముచిత స్థానాన్ని మనమే సంపాదించాలి. సమాజంలో మనం ఒక దుర్భరమైన స్థితిలో వున్నాం కాబట్టి, యశ్వంత్ కు ఉన్నతమైన విద్యను అందిస్తావని ఆశిస్తున్నాను. యశ్వంత్ కు మంచి బట్టలు అందిందు మరియు తనకు శుచి,శుభ్రత,మంచి,మర్యాదలు నేర్పించు. యశ్వంత్ మనసులో ఒక ఉన్నతమైన ఆశయాన్ని నువ్వు కలిగించాలి.

నేను నిన్ను, మన యశ్వంత్ ను చాలా ఎక్కువగా గుర్తు చేసుకుంటుంటాను. ఒక చెట్టు ఆకులు ఒక్కొక్కటిగా రాలిపోయినట్లు నీ ఆరోగ్యం కొద్దికొద్దిగా క్షీణిస్తోందని నాకు తెలుసు. ఈ విషయం నాకు తెలియనిది కాదు రమా. కానీ నన్ను ఏం చేయమంటావ్ రమా? ఒక వైపు ఈ అంతంలేని దుర్భర పేదరికం, మరొక వైపు అనంతమైన జ్ఞాన సముపార్జన చెయ్యాలనే నా మొండి పట్టుదలతో నేను తీసుకున్న దృఢ సంకల్పం నాకు కనిపిస్తున్నాయి.

జ్ఞాన సముపార్జన చెయ్యాలి అనే నా తపనతో, నేను మిగతా విషయాలు అస్సలు పట్టించుకోవడం లేదు. కానీ నాకు వున్న ఒకానొక బలమైన ఉతానివి నువ్వే. నా వెన్ను, దన్ను నువ్వే రమా. నా బాధ్యతంతా నువ్వే చూసుకుంటూ నీ కన్నీళ్లతో నా మానసిక స్థైర్యాన్ని పెంచుతావు. నాకు ఎల్లవేళలా నీ తోడు ఉందన్న భరోసా, నన్ను కార్యోన్ముఖుడ్ని చేసి ఏ ఆటంకం లేకుండా.. ఈ అనంతమైన జ్ఞాన సముపార్జన చేసేలా నన్ను ప్రోత్సహిస్తోంది. రమా,నిజానికి నేను కౄరుడుని కాను. నీ సహకారంతో నా అచంచలమైన జ్ఞానదాహాన్ని తీర్చుకుంటున్నాను. నా ఈ ప్రయాణంలో ఏ చిన్న ఆటంకం ఎదురైనా నాకు బాధ కలిగి, నా మానసిక ప్రశాంతతకు భంగం కలిగి నాకు ఆగ్రహం తెప్పిస్తుంది.

నాకు కూడా ఒక హృదయం ఉంది రమా. నేను చాలా నిరాశా నిస్పృహల్లో ఉన్నాను, కానీ నేను ఒక విప్లవం తీసుకొచ్చే పనికి బద్ధుడనై వున్నాను. నా ఆశయ సాధనలో భాగంగా నా కోరికలను అణచుకోవాల్సి వస్తోంది. ఈ కారణంగా కొన్నిసార్లు నువ్వు, యశ్వంత్ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనేది నిజం. కానీ ఈరోజు నేను ఒక చేత్తో ఉబికివస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ, మరొక చేత్తో నీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. మన “పట్లే”ను(యశ్వంత్) జాగ్రత్తగా చూసుకో రమా. వాడిని నువ్వు దండించవద్దు. ఒకసారి నేను వాడిని కొట్టాను. తనకి ఆ సంఘటనని మరలా గుర్తుకురానీయకు. మన యశ్వంత్ నీలో ఒక భాగం.

మన సమాజంలోని మానసిక, మత వివక్షలను, మరియు సామాజిక ఆర్ధిక అసమానతలను నిర్మూలించే విధానాన్ని మనం తప్పక కనుక్కోవాలి. మన దైనందిన జీవితంలో పెనవేసుకొని ఒక భాగంగా మారిన ఈ వివక్షలు, అసమానతలకి చరమగీతం పాడి వాటికి సమాధి కట్టాలి. వీటిని మన సమాజంలోని ప్రజల జ్ఞాపకాల్లోంచి చెరిపివేయాలని మనం కోరుకోవాలి.

ఈ ఉత్తరాన్ని చదివేటప్పుడు నీ కళ్ళ వెంట ఉబికివచ్చే కన్నీళ్ళని నేను ఊహించగలను. నీ గుండె దుఃఖంతో భారంగా ఉండి ఉంటుంది. నీ పెదవులు వణుకుటూ ఉండవచ్చు కానీ నీ భావోద్వేగాల్ని వెల్లండించగలిగే పదాలు నీ వద్ద లేవని నాకు తెలుసు రమా. నువ్వు చాలా బలహీనమైన మానసిక స్థితిలో ఉన్నావని నేనెఱుగుదును రమా.

రమా, నువ్వు నా జీవితంలోకి రాకపోయివుంటే నా పరిస్థితి ఎలా వుండివుండేదో నేనూహించలేను. నువ్వు నా అర్థాంగివి కాకపోయివుంటే నా జీవితం ఎలా ఉండేది? జీవితంలో భోగభాగ్యాలు మాత్రమే కావాలని కోరుకునే వేరెవరైనా నన్ను ఈపాటికి వదిలిపెట్టి వెళ్లిపోయేవారు. పస్తులుండాలని, ఆవు పేడ కోసం వీధుల వెంట వెతుకుతూ వెళ్లాలని, ఆ పేడతో పిడకలు చేసి వాటిని పొయ్యిలోకి వాడుకోవడం ఎవరికి ఇష్టం ఉంటుంది?

అటువంటి పిడకల వంటచెరకు కోసం బొంబాయి మహానగరంలో ఎవరు వెదుక్కుంటూ వెళతారు? చిరిగిపోయిన పాత బట్టలను ఇంట్లో కుట్టుకుంటూ, పేదరికంతో నిండిన నా మాటలు వింటూ, ఒక్క అగ్గి పేట్టెతో నెలంతా సర్దుకోవాలని, ఇంట్లో కొద్దిగా వున్న ఉప్పు, పప్పు, చింతపండుతో సర్దుకోవాలని చెప్పే నా బికారి మాటలు విని నీలా మరొకరు సర్దుకుపోగలరా?

నా మాటలను లెక్కచెయ్యకుండా నువ్వు నన్ను ఎదిరించి ఉంటే ఏం జరిగివుండేది? నా హృదయం పగిలిపోయి నా ఆశయానికి తిలోదకాలు ఇచ్చేవాడిని. నా కలలు చెదిరిపోయి నేను ఖిన్నుడనై పోయేవాడిని. నేను ఇన్నేళ్ళుగా ఓపికగా ఎదురు చూస్తున్న వాటన్నింటిని కోల్పోయేవాడిని. నా కోరికలు, ఆశలు, ఆశయాలు అన్ని అసంపూర్తిగా మిగిలిపోయి దుఃఖంతో, వేదనతో మిగిలిపోయేవాడిని. నేను ఎందుకు పనికిరాని వాడిగా, చరిత్రహీనుడిగా ఉండిపోయేవాడిని.
నన్ను ఎంత జాగ్రత్తగా చూసుకుంటావో, నీ గురించి కూడా అంతే జాగ్రత్త వహించు. నేను అతి తొందరలో తిరిగి నీ వద్దకొస్తాను. దిగులు పడకు రమా.

అందరినీ అడిగినట్లు చెప్పు.
నీ,
భీమ్ రావ్,
లండన్,
30 డిసెంబర్ 1930

LEAVE A RESPONSE