– ఆలయ సంస్కృతి, సంప్రదాయాలకు వైసీపీ తిలోదకాలు ఇచ్చింది
– మంత్రి వెల్లంపల్లి బహిరంగ క్షమాపణ చెప్పాలి
– తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంలోని బోడికొండ కోదండ రామాలయం పునర్ నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజును ప్రభుత్వం అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. శంకుస్థాపనపై ధర్మకర్తల మండలితో చర్చించకపోవడం జగన్ రెడ్డి కక్షసాధింపు చర్యలకు నిదర్శనం. ప్రోటోకాల్ పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరించారు. శంకుస్థాపన బోర్డుపై ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు పేరు లేకపోవడం సంస్కృతి, సంప్రదాయాలను కాలరాయడమే.
దీనిపై ప్రశ్నించిన అశోక్ గజపతిరాజును వైసీపీ గూండాలు తోసివేడయం దుర్మార్గం. దేవాలయాల వద్ద కూడా వైసీపీ తమ వికృత రూపాన్ని ప్రదర్శిస్తోంది. చట్టాన్ని, రాజ్యాంగాన్ని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉల్లంఘించారు. రాష్ట్రంలో రెండున్నరేళ్ల జగన్ రెడ్డి పాలనలో 200కు పైగా హిందూ దేవాలయాలపై దాడులు, విగ్రహ ధ్వంసం ఘటనలు జరిగాయి. ఏ ఘటనలోనూ దోషులను పట్టుకోలేదు. బోడికొండలోని కోదండరాముని విగ్రహం ధ్వంసం ఘటన జరిగి ఏడాది గడుస్తున్నా ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు?
విజయవాడ దుర్గగుడిలో మూడు వెండి సింహాలు మాయమైనా, అంతర్వేదిలో రథం దగ్ధమైనా జగన్ రెడ్డి పాలనలో చర్యలు శూన్యం. రామతీర్థం ఆలయాన్ని ఏడాదిలో పూర్తిచేస్తామని చెప్పి మాట తప్పారు. దేవాదాయశాఖ మంత్రి బూతుల పురాణం, అవినీతిలో తేలియాడుతున్నారు. ప్రోటోకాల్ పాటించకుండా అశోక్ గజపతిరాజును అవమానించిన దేవాదాయశాఖ మంత్రి వెల్లింపల్లి శ్రీనివాస్ బహిరంగ క్షమాపణ చెప్పాలి.