జాతీయ మానవ హక్కుల కమీషన్ కు లేఖ రాసిన మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు

2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్ దళితులపై దాడులకు కేంద్రంగా మారింది.ఏపీలో దళితులపై జరిగిన దౌర్జన్యాలు, దాడులు, బెదిరింపులు, వేధింపులను ఎప్పటికప్పుడు కమిషన్ దృష్టికి తీసుకొస్తునే ఉన్నాం. ఏపీలో వైసీపీ హింసాత్మక దాడులతో దళితులు నిరంతరం ప్రాణ భయంతో జీవిస్తూ ఉన్నారు.

ఈ దాడుల పరంపరలో తాజాగా 20 డిసెంబర్ 2021న రాత్రి 10.30కి దళితుడైన పొత్తూరి వెంకటనారాయణను మద్యం సీసాలతో కొట్టి పెట్రోలు పోసి నిప్పంటించారు. వెంకటనారాయణ వంట పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈయనకు ఇద్దరు పిల్లలు.. 3 సం. వయస్సు గల పాప, ఒకటిన్నర సం. వయస్సు గల బాబు ఉన్నారు.

వెంకటనారాయణ ఎస్సీ మాల సామాజికవర్గానికి చెందినవాడు. పెదనందిపాడు నుండి కొప్పారు గ్రామంలోని తన తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వస్తూ బోయపాలెం దగ్గర దారిలో ఓ వైన్ షాపు వద్ద ఆగాడు.అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులపై వైసీపీ గూండాల గుంపు దుర్భాషలాడడం విని అభ్యంతరం వ్యక్తం చేశాడు.

దీనితో అధికార వైసీపీ గూండాలు వెంకటనారాయణపై మద్యం బాటిళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. స్పృహ కోల్పోయిన వెంకటనారాయణపై పెట్రోలు పోసి నిప్పంటించి పారిపోయారు. వెంకటనారాయణను హాస్పిటల్ కు తీసుకెళ్లెందుకు సహాయం లేక అపస్మారక స్థితిలోనే పడి ఉండాల్సి వచ్చింది.

21 డిసెంబర్ 2021 ఉదయం మాత్రమే వెంకట నారాయణను గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేర్చారు. ఈ నేపథ్యంలో, జూన్ 2019 నుంచి దళితులపై జరుగుతున్న దాడులపై సమగ్ర విచారణను చేయాలని కమిషన్‌కు విజ్ఞప్తి చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల ప్రాథమిక హక్కులను పునరుద్ధరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవడం చాలా అవసరం..

Leave a Reply