నేపాల్ లో చిన్న విమానం కూలిపోయిన ఘటన అతిపెద్ద విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో అందరూ మరణించినట్టు భావిస్తున్నామని నేపాల్ ప్రకటించింది. ప్రయాణికులు, సిబ్బంది సహా 22 మందితో వెళుతున్న విమానం పర్వతాల్లో కూలిపోవడం తెలిసిందే. ఇప్పటి వరకు 14 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన వారి ఆనవాళ్ల కోసం గాలింపు పనులు కొనసాగుతున్నాయి.
ప్రమాద స్థలంలో ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ, ఒక బృందం అక్కడకు చేరుకోగలిగినట్టు నేపాల్ సివిల్ ఏవియేషన్ విభాగం తెలిపింది. ప్రమాదం నుంచి ఒక్కరూ ప్రాణాలతో బయటపడి ఉండకపోవచ్చని నేపాల్ హోంశాఖ ప్రకటించింది. విమానంలో ఉన్న అందరూ మరణించి ఉంటారని భావిస్తున్నట్టు హోంశాఖ అధికార ప్రతినిధి ఫదీంద్ర మణి పొఖ్రేల్ తెలిపారు. మహారాష్ట్రకు చెందిన నలుగురు సభ్యుల కుటుంబం కూడా ఈ విమానంలో ప్రయాణించడం తెలిసిందే.
ప్రమాద స్థలం నుంచి స్వాధీనం చేసుకున్న మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా ఉన్నాయని ఖాట్మండు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అధికార ప్రతినిధి రాజ్ సితాల పేర్కొన్నారు. ముస్తంగ్ జిల్లాలో 14,500 అడుగుల ఎత్తులో ఆదివారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.