Suryaa.co.in

Telangana

యాదాద్రి ధర్మకర్తల మండలిగా మార్చాలి

-హుండీ డబ్బులతో ఈవో, చీఫ్ అకౌంట్ ఆఫీసర్ కు జీతం ఇవ్వా లి
– మండలిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీని కూడా విధిగా పెట్టాలి
– బ్రాహ్మణ పరిషత్ ఉన్నదా లేదా అన్నది ప్రశ్నార్థకం
– 18వ తారీఖు అయినా ఇంకా జీతం రాని పరిస్థితి
– ఈ బిల్లును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం
– దేవాదాయ ధర్మాదాయ, యాదాద్రి దేవాలయ బోర్డు ఏర్పాటు బిల్లు పై శాసన సభలో మాజీ మంత్రి హరీష్ రావు

హైదరాబాద్ : ఈ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రిని, బిల్లును రూపొందించిన అధికారులను నేను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. ఈ బిల్లులో కొన్ని సూచనలు చేయాలనుకుంటున్నాను. వాటిని సభ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ఎంఐఎం సభ్యుడు కౌసర్ మౌనద్దీన్ గత ప్రభుత్వం 1800 కోట్లు ఖర్చు చేసి, చాలా చక్కగా యాదాద్రి దేవాలయం నిర్మించారని కేసీఆర్ కృషిని గుర్తించారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఎక్కడైనా కేసీఆర్ పేరు ప్రస్తావిస్తారేమో అని చూసాను గాని వారు ప్రస్తావించలేదు.

కేసీఆర్ తెలంగాణ ఇలవేల్పు అయిన యాదాద్రి లక్ష్మీనరసింహ దేవాలయాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్మించారు. ఈ దేశంలో కొంతమంది రాజకీయాల కోసం దేవుడిని ఉపయోగించుకుంటారు. కెసిఆర్ ఈ దేవాలయ నిర్మాణాన్ని ఎక్కడా కూడా రాజకీయం కోసమో, ప్రచారం కోసమో వాడుకునే ప్రయత్నం చేయలేదు. బాధ్యతతో, భక్తితో నిర్మించారు. దాదాపు 2000 కోట్ల రూపాయలతో యాదాద్రి దేవాలయాన్ని నిర్మించారు. వెయ్యి సంవత్సరాల కోసం ఆలోచించి దేవాలయాన్ని అభివృద్ధి చేశారు. రోడ్లు గాని పార్కింగ్ కానీ ఇవన్నిటిని సమగ్రంగా నిర్మించారు.

రోజుకు 50 వేలమంది భక్తులు ఇప్పుడు వస్తున్నారు. భవిష్యత్తులో రోజుకి లక్ష మంది భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది. యాదాద్రిలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ని నిర్మిస్తే, అక్కడికొచ్చే భక్తుల ఆరోగ్య సౌకర్యానికి కూడా ఉపయోగపడుతుందని మేము భావించాము. ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ బీబీనగర్ వద్ద ఉంటుంది. యాదాద్రి వద్ద మరో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తే వచ్చే భక్తులకు ఉపయోగపడుతుందని మేం భావించాము. ఎమర్జెన్సీ వైద్యం అందించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి, ప్రభుత్వం కూడా ఈ విషయంపై దృష్టి పెట్టి అక్కడ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాను.

కెసిఆర్ నాయకత్వంలో ప్రశాంత్ రెడ్డి ఎంతో కష్టపడ్డారు. అక్కడ నిర్మించిన కోనేరు లో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను నింపడం జరిగింది. పోచమ్మ సాగర్ నుండి గంధమల్ల కెనాల్ ద్వారా కోనేరులోకి గోదావరి జలాలను తీసుకొని వచ్చిన గొప్ప అనుభూతి కూడా మాకుంది. మంత్రికి నా సూచన ఏమిటంటే. యాదాద్రి దేవాలయం మండలిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీని కూడా విధిగా పెట్టగలిగితే బాగుంటుందనేది మా సూచన. మన రాష్ట్ర జనాభాలో 11% జనాభా గిరిజనులు ఉంటారు కాబట్టి , గిరిజన సభ్యుణ్ణి కూడా ఈ బోర్డులో పెట్టేటట్టు బిల్లును సవరించాలని కోరుతున్నాను.

ధర్మకర్తల బోర్డు అని బిల్లులో ఉంది. తిరుపతిలో ధర్మకర్తల మండలి అని ఉంటుంది. బోర్డు అనే పదం కాకుండా ధర్మకర్తల మండలిగా మార్చాలని కోరుతున్నాను. దేవుని మీద ఉండేటువంటి భక్తి మనుషులను సక్రమమైన మార్గంలో నడిపిస్తుంది. ఎంతో విశ్వాసం, నమ్మకం ఉంటుంది.

తిరుపతిలో ఈవో, జేఈవో జీతాలు తిరుమల తిరుపతి దేవస్థానం నుండే ఇస్తారు. దేవుడి సొమ్ము నుండి జీతం తీసుకోవడం అంటే, దేవుడి సొమ్ము జీతంగా తీసుకుంటున్నామని ఎంతో భక్తిశ్రద్ధలతో పనిచేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా హుండీ డబ్బులతో ఈవో, చీఫ్ అకౌంట్ ఆఫీసర్ కు జీతం ఇవ్వాలని కోరుతున్నాము. జీర్ణ దేవాలయాల పునరుద్ధరణ కోసం దేవాలయానికి వచ్చే డబ్బుల నుండి ఖర్చు చేయడానికి ఓ ట్రస్ట్ ను ఏర్పాటు చేసే వెసలు బాటు కల్పించాలి.

100 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం ఉన్న దేవాలయాలకు ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసే వెసులుబాటును కల్పించామని బిల్లులో చెప్పారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడకు 127 కోట్లకు పైగా ఆదాయం వస్తున్నది. అదేవిధంగా వేములవాడకు కూడా ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతున్నాము. యాదాద్రి దేవాలయం ఇంత అద్భుతంగా అభివృద్ధి జరిగిందంటే అది కేసీఆర్ కృషికి నిదర్శనం. దేవాలయానికి పూర్వ వైభవం తెచ్చి పురోగమనం వైపు తీసుకొని వెళ్ళాము.

దురదృష్టం ఏమిటంటే 15 నెలల కాంగ్రెస్ పాలనలో దేవాలయాల అభివృద్ధి పూర్తిగా తిరోగమనం పట్టింది. ఆర్థిక శాఖ నుండి దేవాదాయ శాఖకు నిధులు విడుదల కావడం లేదు. దేవాలయాల నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి కోసం వాడుకున్నటువంటి చరిత్ర రాష్ట్రంలో ఉంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వ నిధులను దేవాలయాలకు ఇచ్చిన చరిత్ర లేదు. కానీ మొట్టమొదటిసారి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ నిధుల చేత దేవాలయాల నిర్మాణం చేపట్టారు.

దేవుడు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రం బాగుంటే రాష్ట్ర ప్రజలు బాగుంటారని నమ్మి దేవాలయాల అభివృద్ధి చేపట్టారు. విమాన గోపురానికి సంబంధించి కాంగ్రెస్ మిత్రులు ఏమేమి నిర్మించామని అన్నారు. సిద్దిపేట నియోజకవర్గం నుండి నా డబ్బులతో కూడా కలుపుకొని రెండు కిలోల బంగారాన్ని భక్తులతో కలసి వెళ్లి దేవాలయానికి సమర్పించాము. కెసిఆర్ ఒక కేజీ 116 గ్రాములు ఇచ్చారు. మా సొంత డబ్బులను కూడా దేవాలయానికి ఇచ్చాము. 50 ఏళ్లు కాంగ్రెస్ పాలించింది రాష్ట్రాన్ని అయినప్పటికీ ఎందుకు ఆలయ అభివృద్ధి జరగలేదు?

గతంలో కూడా ప్రభుత్వాలు ఉన్నాయి గత ప్రభుత్వాలు ఎందుకు చేయలేదు ?కేసీఆర్ మాత్రమే ఎందుకు అభివృద్ధి చేశారు. బాసర దేవాలయానికి 50 కోట్ల రూపాయలు, భద్రాద్రి రామాలయానికి 50 కోట్లు, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి 50 కోట్లు, వేములవాడ రాజరాజేశ్వర దేవాలయాన్ని 70 కోట్లతో అభివృద్ధి చేయడం జరిగింది. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయాలయానికి 30 కోట్లు, కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయానికి 600 కోట్ల రూపాయలతో అభివృద్ధి కోసం ప్రణాళికలు చేసాం. ఈ రెండిటిని ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాం.

కామన్ గుడ్ ఫండ్ కింద చాలా దేవాలయాలను రాష్ట్రంలో అభివృద్ధి చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం గ్రామీణ ప్రాంతాల్లో ఉండే దేవాలయాలకు 50 కోట్ల రూపాయలు బడ్జెట్ లో నిధులు ఇచ్చాము. 15 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా దేవాలయాలకు విడుదల చేయలేదు. సి జి ఎఫ్ లో గతంలో సాంక్షన్ అయిన టెంపుల్ లకు, ఈ ప్రభుత్వం పనులు ప్రారంభించాలి. టెండర్లకు పిలవాలని కోరుతున్నాను. దేవాలయ ఉద్యోగులకు గతంలో ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి జీతాలు ఇచ్చేవారు కాదు. దేవాలయ హుండీ ఆదాయంతో మాత్రమే జీతాలు ఇచ్చేవారు.

కాంగ్రెస్ ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు జీతాల కోసం పూజార్లు రోడ్డుపై ధర్నా చేశారు. ఆలయంలో ఉండే పూజారి కూడా దైవంతో సమానం అంటారు. మొట్టమొదటిసారిగా కేసీఆర్ చట్టాన్ని సవరించి గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద జీతాలను ప్రభుత్వం నుండి ఇచ్చాము. ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు ఇస్తామని చెబుతున్న రేవంత్ రెడ్డి సర్కారు. ఈరోజు 18వ తారీఖు అయినా ఇంకా జీతం రాని పరిస్థితి ఉంది.

కారుణ్య నియామకాల్లో కూడా 86 మంది దేవాదాయ శాఖ ఉద్యోగులు చనిపోతే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వడానికి ఫైనాన్స్ మినిస్టర్ గా నేను గ్రాంటిన్ ఎయిడ్స్ స్కీములో చేర్పించి ఫైల్ క్లియర్ చేశాము.

86 మందికి సంవత్సరం నుండి జీతం రావడం లేదు. వారికి కూడా జీతం వచ్చేలా చూడాలని కోరుతున్నాను. దీప దూప నైవేద్యం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం దేవాలయాలకు 2000 రూపాయలు ఇచ్చేది. కెసిఆర్ 2000 రూపాయలు ఉన్న దీప దూప నైవేద్యాన్ని 10 వేలకు పెంచడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో 12 వేల రూపాయలు దేవాలయా దీప దీప నైవేద్యాలకు ఇస్తామని హామీ ఇచ్చారు. 12000 రూపాయలు దేవుడెరుగు కానీ రెండు నెలలుగా ఉన్న పదివేలను కూడా ఇవ్వడం లేదు.

సమ్మక్క సారక్క దేవాలయానికి 100 కోట్లు నిర్వహణకు ఇచ్చాము. బ్రాహ్మణ సంక్షేమం కూడా భగవంతుని సంక్షేమంలో భాగమే. బ్రాహ్మణులు ఎక్కడైతే బాగుంటారో ఆ రాజ్యం కూడా బాగుంటుంది. పేద బ్రాహ్మణుల సంక్షేమం కోసం 100 కోట్లు కేసీఆర్ ప్రభుత్వం కేటాయించేది. బ్రాహ్మణులలో పేదవారికి పిల్లనివ్వని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ బ్రాహ్మణులు పౌరోహిత్యం వదిలేయడం వల్ల, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి హిందీలో మంత్రాలు చదివే పరిస్థితి ఏర్పడింది. బ్రాహ్మణ సంక్షేమ నిధిని 100 కోట్లతో ఏర్పాటు చేయడం జరిగింది.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రాహ్మణ పరిషత్ ఉన్నదా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ లో 10 కోట్ల రూపాయలతోని బ్రాహ్మణ సదన్ ను నిర్మించాము. రాష్ట్రంలో సూర్యాపేట, మధిర, ఖమ్మం నియోజకవర్గాల్లో బ్రాహ్మణ సదన్ పనులు ఆగిపోయాయి. వాటిని తిరిగి ప్రారంభించాలని కోరుతున్నాము. బ్రాహ్మణ పేద విద్యార్థులు విదేశీ విద్యా పథకం కింద 300 మంది విదేశాల్లో చదువుతున్నారు. వారి బకాయిలు విడుదల చేయించాలని ఈరోజు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడుతున్నారని ఎంతోమంది పేద బ్రాహ్మణ విద్యార్థులు ఫోన్లు చేసి మమ్మల్ని కోరారు.

300 మంది విద్యార్థులకు 30 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నయి. వాటిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. బ్రాహ్మణ ఎంటర్ ప్రైనియర్ స్కీం కింద 497 మంది బెస్ట్ స్కీం కింద 16 కోట్లు పెండింగ్లో ఉన్నాయి వాటిని కూడా విడుదల చేయాలని కోరుతున్నాం. మరోసారి ఈ బిల్లును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం.

LEAVE A RESPONSE