Suryaa.co.in

Andhra Pradesh

ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ సాధించి తీరుతాం

-ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనక్కు తగ్గం
-కేంద్రీకరణ వల్ల ఇప్పటికే నష్ట పోయాం
-ఇంకా నష్టపోవడానికి అస్సలు సిద్ధంగా లేం
-విశాఖపట్నంలో జేఏసీ నాయకులతో కలిసి మీడియాతో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

విశాఖపట్నం: మీడియాతో మంత్రి అమర్‌నాథ్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..:
అందరూ సహకరించాలి:
ఎవరు ఎన్ని అడ్డంకులు కల్పించినా విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ సాధిస్తాం. మా పోరాటం శాంతియుతంగా ఉంటుంది. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలను తెలియజెప్పేందుకే శనివారం విశాఖలో గర్జన ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి అన్ని వర్గాల వారు సహకరించాలి.

అవకాశాన్ని వదులుకోం:
దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు పూరై్తనా, ఉత్తరాంధ్ర ఇప్పటికీ చాలా వెనకబడి ఉంది. ఇప్పుడు అభివృద్ధి చేసుకునే అవకాశం మాకు వచ్చింది. దాన్ని వదులుకోం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మన భవిష్యత్‌ తరాల్లో కూడా మార్పు రాదు. రేపు (శనివారం) మొదలవుతున్న పోరాటం కేవలం ఉత్తరాంధ్రకు మాత్రమే కాదు. మొత్తం ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం.

వారి వైఖరే మాకు ప్రేరణ:
కేంద్రీకరణ వల్ల ఇప్పటికే ఉత్తరాంధ్ర, రాయలసీమ వాసులకు చాలా అన్యాయం జరిగింది. అది పునరావృతం కాకూడదు. అమరావతి నుంచి అరసవెల్లి వరకు చేస్తున్న పాదయాత్రలో, వారి వైఖరి మాకు ప్రేరణగా నిల్చింది. ఇప్పటివరకు ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకున్న వారిపై పోరాటం చేయడానికి అది ప్రేరేపించింది.

అహింసా మార్గంలో..:
విశాఖ గర్జనకు వేలాదిగా తరలి వస్తున్న జనం, అహింసా మార్గంలో వారి ఆకాంక్షలను పాదయాత్ర చేస్తున్న రైతులకు అర్థమయ్యేలా చెప్పాలి. విశాఖ నగరం ఎంతోమందికి భవిష్యత్తు ఇచ్చింది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ఇక్కడ పుట్టి పెరిగిన వారంతా ఇప్పుడు రోడ్డెక్కి ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది. రాయలసీమ నాయకులు కూడా విశాఖ ఉద్యమానికి మద్దతు తెలియజేయడం గర్జనకు మరింత ఊపునిచ్చింది అని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు.

కాగా, రాష్ట్రంలో అన్ని ప్రాంతా అభివృద్ధికి సీఎం వైయస్‌ జగన్‌ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు అవంతి శ్రీనివాస్‌ వెల్లడించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం సీఎం ఒక దేవుడిలా వచ్చారని, అందుకే విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ను ప్రకటించారని చెప్పారు. దీన్ని అడ్డుకునేందుకు విపక్షం నానా కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి అన్నారు.

LEAVE A RESPONSE