Suryaa.co.in

Entertainment Telangana

హిందుత్వాన్ని కించపరిచే సినిమాలను అడ్డుకుంటాం: విశ్వహిందూ పరిషత్

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో హిందుత్వాన్ని అవమానపరిచేలా సన్నివేశాలు చిత్రీకరిస్తూ ద్వంద్వార్థాలు ప్రతిధ్వనించేలా డైలాగులు రచిస్తున్నారు. ఇది ముమ్మాటికీ క్షమించరానిది. దేవీదేవతల విషయంలో, వారి వేషధారణ విషయంలో అనేక విధాలుగా అసభ్య రీతిలో పదాలను ఉపయోగిస్తున్న చిత్ర సన్నివేశాలను తెరపైకి ఎక్కిస్తున్నారు. ఈ వరవడి వెండితెరపై మాత్రమే కాదు.. బుల్లితెరపై చిత్రీకరించే సీరియల్స్ లో కూడా దేవతలను కించపరిచే చిత్రీకరణలు చేస్తున్నారు.

ఇటీవల కాలంలో అన్నమయ్య పాటపై కూడా అసభ్య రీతిలో చిత్రీకరణ జరిగింది. ఒకపరి ఒకపరి అంటూ భగవంతుడిని కీర్తించే సన్నివేశాలను అసభ్య రీతిలో చిత్రీకరించి వెంకటేశ్వర స్వామిని అవమానించేలా ప్రవర్తించారు. దీనిపై సమాజంలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో కాస్త వెనక్కి తగిన విషయం గమనించాము. అయితే హిందుత్వాన్ని హిందూ దేవీ దేవతలను, హిందూ సంప్రదాయాలను అగౌరపరిచే చర్యలు నేడు ఓ ఫ్యాషన్ గా తీసుకొని చిత్ర పరిశ్రమ వారు ఆధ్యాత్మికతపై దాడికి దిగుతున్నారు.

కోట్లాదిమంది హిందువుల మనోభావాల ను గాయపరుస్తూ.. వినోదాల కోసం డైలాగులు రాసుకుంటున్నారు. భావ ప్రకటన పేరుతో బరితెగింపులకు దిగుతున్నారు. దేవీ దేవతల చేతిలో సిగరెట్టు ఉంచి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. మరీ ముఖ్యంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న యూట్యూబ్ ఛానల్స్.. స్మాల్ ఫిలిమ్స్ ద్వారా దేవీ దేవతలను అగౌరవపరుస్తున్న సన్నివేశాలు కోకకొల్లలుగా ఉన్నాయి. కాబట్టి వెండి తెర, బుల్లితెర, స్మాల్ ఫిలిమ్స్, యూట్యూబ్ ఛానల్స్ ద్వారా హిందుత్వం పై జరుగుతున్న దాడిని సెన్సార్ బోర్డ్ కట్టడి చేయాలి..చేయాల్సిన బాధ్యత కూడా వారిదే.!

హిందుత్వం పై వివక్ష చూపే చర్యలు మానుకోవాలి. భావ స్వేచ్ఛ పేరుతో దేవీ దేవతలపై అసభ్య పదజాలంతో డబుల్ మీనింగ్ ప్రతిధ్వనించేలా దాడులకు దిగితే విశ్వహిందూ పరిషత్ చూస్తూ ఊరుకోదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాము. సున్నితమైన అంశాలపై స్పందించే సమయంలో సెన్సార్ బోర్డు అత్యంత చొరవ చూపాలని విశ్వహిందూ పరిషత్ సూచిస్తుంది. అవసరమనుకుంటే రచయితలు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, ఇతర చిత్ర పరిశ్రమ పెద్దలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై చర్చించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది.

ఈ మేరకు భారత సమాచార ప్రభుత్వానికి సంబంధించిన కేంద్ర చలనచిత్ర పరిశ్రమ డైరెక్టర్ షిఫలీ కుమార్ కి విశ్వహిందూ పరిషత్ నాయకులు వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించారు. శుక్రవారం కవాడిగూడలోని సీజీవో కాంప్లెక్స్ లో షిఫలీ కుమార్ తో కలిసి చిత్ర పరిశ్రమలో జరుగుతున్న హిందూ వ్యతిరేక సంఘటనలపై చర్చించారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు వీరన్న గారి సురేందర్ రెడ్డి , రాష్ట్ర కార్యదర్శి పండరీనాథ్ , రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు గారు, నాయకులు ఎడ్ల జగన్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE